వారెన్‌ బఫెట్‌కు షాకిచ్చిన అంబానీ | Sakshi
Sakshi News home page

వారెన్‌ బఫెట్‌కు షాకిచ్చిన అంబానీ

Published Fri, Jul 10 2020 7:55 PM

 RIL Chairman Mukesh Ambani is now richer than Warren Buffett - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు,  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్‌ అంబానీ (63) తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.  నికర విలువ పరంగా, బిజినెస్‌​ టైకూన్‌, ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్‌ను అధిగమించారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అంబానీ విలువ ఇప్పుడు 70.1 బిలియన్ డాలర్లకు చేరగా, వారెన్ బఫెట్ సంపద విలువ 67.9 బిలియన్ డాలర్లు మాత్రమే. దీంతో అంబానీ ప్రపంచంలో ఏడవ ధనవంతుడుగా నిలిచారు. రిలయన్స్‌ టెలికాం విభాగం జియోలో వరుస పెట్టుబడులతో అంబానీ సంపద గణనీయంగా పుంజుకుంది. దీంతో ప్రపంచంలోని టాప్10 ధనవంతుల క్లబ్‌లో ఉన్న ఏకైక ఆసియా వ్యాపారవేత్తగా అంబానీ నిలిచారు.  

బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ సీఈఓ వారెన్ బఫెట్‌ (82) 37 బిలియన్ డాలర్లకు పైగా బెర్క్‌షైర్ హాత్వే షేర్లను ఇటీవల విరాళంగా ఇచ్చిన తరువాత సంపద క్షీణించింది. ఒరాకిల్ ఆఫ్ ఒమాహా గా పేరొందిన బఫెట్‌ ఈ వారంలో 2.9 బిలియన్ డాలర్లను స్వచ్ఛంద సంస్థకు డొనేట్‌ చేశారు. దీంతో ఆయన సంపద నికర విలువ క్షీణించింది.  కాగా హురున్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, అంబానీ ఇటీవల ప్రపంచంలో ఎనిమిదవ ధనవంతుడిగా అంబానీ అవతరించారు. సంపన్న భారతీయుడిగా అంబానీ నంబర్ వన్ ర్యాంకులో దూసుకుపోతున్నారు.ఈ ఏడాదిలో మొదటి రెండు నెలల్లో తీవ్ర నష్టాలను నమోదు చేసినప్పటికీ, జియోలో వరుస భారీ పెట్టుబడుల నేపథ్యంలో రిలయన్స​ షేరు రికార్డు గరిష్టాన్ని తాకింది. దీంతో కరోనా సంక్షోభంలో కూడా గణనీయమైన వృద్దిని సాధించి, అప్పుల్లేని సంస్థగా రిలయన్స్‌ అవతరించింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12.70 లక్షల కోట్ల రూపాయల రికార్డు స్థాయికి చేరింది. (రిలయన్స్‌- బీపీ జాయింట్‌ వెంచర్‌ లాంచ్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement