ఈటీఎఫ్‌ల్లోకి ఈపీఎఫ్‌ఓ నిధులు | Investors Really got it Wrong With Nasdaq ETFs | Sakshi
Sakshi News home page

ఈటీఎఫ్‌ల్లోకి ఈపీఎఫ్‌ఓ నిధులు

Published Sat, Apr 25 2015 1:16 AM | Last Updated on Wed, Sep 5 2018 8:20 PM

ఈటీఎఫ్‌ల్లోకి ఈపీఎఫ్‌ఓ నిధులు - Sakshi

2015-16లో 5 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుమతి
మార్కెట్‌లోకి  రూ.5,000 కోట్లు..!
ప్రణాళికను నోటిఫై చేసిన కార్మిక శాఖ
న్యూఢిల్లీ: రిటైర్‌మెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నిధుల్లో కొంత మొత్తం స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి రంగం సిద్ధమయ్యింది. ఈపీఎఫ్‌ఓ నిధుల్లో 5 శాతాన్ని ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో పెట్టుబడులుగా పెట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది.

ఈ మేరకు పెట్టుబడుల ప్రణాళిక, విధివిధానాలను రెండు రోజుల క్రితం కార్మిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. కార్మిక శాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ ఇక్కడ ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు. తాజా నిర్ణయం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2015-16) దాదాపు రూ.5,000 కోట్ల ఈపీఎఫ్‌ఓ నిధులు మార్కెట్‌లోకి వస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలుత నిధిలో ఒక శాతాన్ని మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తామని, అటు తర్వాత దీనిని క్రమంగా ఐదు శాతం వరకూ పెంచుకుంటూ వెళ్లడం జరుగుతుందని అగర్వాల్ తెలిపారు.
 
ఈటీఎఫ్ అంటే...
ఈటీఎఫ్ ఒక ప్రత్యేక పత్రం లాంటిది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌పై ఒక మామూలు స్టాక్ తరహాలో ఈటీఎఫ్ ట్రేడవుతుంది.   2001లో భారత్‌లో ఈటీఎఫ్‌ల ప్రొడక్ట్ ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 33 ఈటీఎఫ్‌లు ఉన్నాయి. వీటి కింద దాదాపు 6.2 లక్షల ఇన్వెస్టర్లకు చెందిన రూ.11,500 కోట్ల నిధుల నిర్వహణ జరుగుతోంది. భారత్ మార్కెట్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల హవా భారీగా ఉంది. ఈపీఎఫ్‌ఓ తన నిధుల్లో కొంత భాగాన్ని సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో (ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పెట్టుబడులు పెట్టేలా  ఇప్పటికే కార్మిక మంత్రిత్వశాఖతో పెట్టుబడుల శాఖ (డిజిన్వెస్ట్‌మెంట్ డిపార్ట్‌మెంట్- డీఓబీ)  చర్చలు జరిపింది.

డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి ఆరాధనా జోహ్రీ ఇటీవల స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు.  దీనికి కార్మిక మంత్రిత్వశాఖ సానుకూలంగా ఉన్నట్లు కూడా సంకేతాలు ఇచ్చారు.  2014లో సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను ఏర్పాటు చేశారు. 10 ప్రభుత్వ రంగ సంస్థల షేర్లతో ఈ ట్రేడెడ్ ఫండ్ బాస్కెట్ ఉంటుంది. ఈ ఫండ్‌లో పెట్టుబడుల ద్వారా ఇన్వెస్టర్లు ఓఎన్‌జీసీ, గెయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, ఇంజినీర్స్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్‌లో సహవాటాదారుల అవకాశాన్ని పొందగలుగుతారు. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో ఏ మేరకు పెట్టుబడులు పెట్టాలన్న అంశాన్ని త్వరలో నిర్ణయిస్తామని అగర్వాల్ పేర్కొన్నారు.
 
నిధి... రూ.6.5 లక్షల కోట్లు...
ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ  దాదాపు ఐదు కోట్ల మంది చందాదారులతో దాదాపు రూ.6.5 లక్షల కోట్ల నిధిని నిర్వహిస్తోంది. 2015-16 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా కనీసం 5 శాతం వరకూ  ఈపీఎఫ్‌ఓ నిధులను ఈక్విటీ, సంబంధిత పథకాల్లో పెట్టుబడులను ప్రతిపాదించారు. గరిష్టంగా 15 శాతం వరకూ ఈ నిధులు ఉండవచ్చని సైతం ఆర్థిక శాఖ నిర్ణయించినట్లు స్వయంగా కార్మిక శాఖ కార్యదర్శి తెలిపారు. అయితే ఆచితూచి వ్యవహరిస్తూ,  ఈ దిశలో ముందుకు వెళతామని ఆయన పేర్కొన్నారు.

తొలుత ఈటీఎఫ్‌లలో మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి ఈ ‘జాగరూకతే’ కారణమనీ పేర్కొన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా అనుభవాలను చూస్తే... ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ వల్ల అధిక లాభాలు వస్తాయన్న విషయం రుజువవుతోందని కార్మిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.  2014-15లో ఈపీఎఫ్‌ఓ ఇంక్రిమెంటల్ డిపాజిట్లు రూ.80,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇవి దాదాపు రూ. లక్ష కోట్ల వరకూ ఉంటాయని అంచనా. ఈపీఎఫ్‌ఓ సామాజిక భద్రతా పథకాల  కింద కవరేజ్‌కు నెలవారీ వేతన సీలింగ్‌ను రూ.6,500 నుంచి రూ.15,000 కు గత ఏడాది సెప్టెంబర్‌లో పెంచడం  దీనికి ఒక కారణం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement