వాట్సాప్‌తో ఎటాక్‌ | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌తో ఎటాక్‌

Published Mon, Mar 19 2018 7:18 PM

Chinese Hackers Use WhatsApp To Target Indian Soldiers - Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ విషయంలో చాలా జాగ్రత్త వహించాలని సైనికులకు భారత ఆర్మీ వార్నింగ్‌ ఇస్తోంది. వాట్సాప్‌ను వాడుతూ చైనీస్, భారత సిస్టమ్స్‌ను హ్యాక్‌ చేస్తున్నట్టు ఆదివారం దేశీయ ఆర్మీ ఓ వార్నింగ్‌ వీడియోను పోస్టు చేసింది. నిమిషం నిడివి గల ఈ వీడియోను సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ రీపోస్టు చేశారు.

‘మన డిజిటల్‌ ప్రపంచాన్ని కొల్లగొట్టడానికి చైనీస్‌ అన్ని రకాల ప్లాట్‌ఫామ్‌లను వాడుతున్నారు. మన సిస్టమ్‌లను హ్యాక్‌ చేయడానికి చైనీస్‌ వాడుతున్న కొత్త మాధ్యమం వాట్సాప్‌ గ్రూప్‌లు. +86 ప్రారంభమయ్యే చైనీస్‌ నెంబర్లు మీ గ్రూప్‌లోకి ప్రవేశించి, మీ డేటాను సంగ్రహించడం ప్రారంభించాయి’ అని తెలుపుతూ ఆర్మీ అధికారులు ఈ వీడియో ట్వీట్‌ చేశారు.

సైనికులు తమ కాంటాక్ట్‌ నెంబర్లను పేర్లతో సేవ్‌ చేసుకోవాలని, అన్ని వాట్సాప్‌ గ్రూప్‌లను ఎప్పడికప్పుడు చెక్‌ చేసుకోవాలని, తెలియని నెంబర్లను పదేపదే క్రాస్‌చెక్‌ చేసుకోవాలని భారత ఆర్మీ సూచించింది. ఒకవేళ మీరు మొబైల్‌ నెంబర్‌ మారిస్తే, గ్రూప్‌ అడ్మిన్‌కు తెలియజేయాలని తెలిపింది. ఒకవేళ సిమ్‌ కార్డును మారిస్తే, దాన్ని పూర్తిగా నాశనం చేయాలని సూచించింది. ఆర్మీ అడిషినల్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇంటర్‌ఫేస్‌ ఈ వీడియోను రూపొందించింది. ‘బీ అలర్ట్‌, బీ సేఫ్‌’ అనే ట్వీట్‌తో ఈ వీడియోను విడుదల చేసింది.

గతేడాది చైనా సరిహద్దులో ఉన్న సైనికులను తమ స్మార్ట్‌ఫోన్లను ఫార్మాట్‌ చేసుకోవాలని ఆర్మీ ఆదేశించిన సంగతి తెలిసిందే. చైనీస్‌ హ్యాకర్ల నుంచి ప్రమాదం పొంచి ఉన్న 40కి పైగా యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్‌ చేయమని కూడా ఆదేశాలు జారీచేసింది. చైనీస్‌ సంస్థలు అభివృద్ధి చేసిన ఆ యాప్స్‌ అనుమానితమైనవిగా ఆర్మీ పేర్కొంది. ఇరు దేశాల మధ్య డోక్లాం వివాదం ముగిసిన రెండు నెలల తర్వాత ఆర్మీ ఈ హెచ్చరికలు జారీచేయడం పలు ఆందోళనలకు దారితీస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement