అంతేగా.. అంతేగా!! | TDP Leaders Corporation Bills Pendings | Sakshi
Sakshi News home page

అంతేగా.. అంతేగా!!

Published Tue, Feb 5 2019 12:48 PM | Last Updated on Tue, Feb 5 2019 12:48 PM

TDP Leaders Corporation Bills Pendings - Sakshi

పటమట (విజయవాడ తూర్పు): పాలకులు పలుకుబడి... అధికారుల అండదండలుంటే చాలు నిబంధనలు బేఖాతర్‌ చేయవచ్చని.. అనుమతులకు చెల్లించాల్సిన చార్జీలను కూడా ఎగ్గోట్టోచ్చని విజయవాడ టీడీపీ నాయకులు, వీఎంసీ అధికారులు మరోమారు నిరూపించారు. నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక అధికారులు పాలకపక్షం నేతలు చెప్పింది తూచా తప్పకుండా పాటించటంతోపాటు వీఎంసీకి రావాల్సిన ఆదాయానికి గండికొట్టి తమ జేబులు నింపుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలిస్తున్న అధికారులు అసలు పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంటుందని ఆరోపణలు పెరుగుతున్నాయి. ఒకే నిర్మాణానికి వేర్వేరు బిల్డింగ్‌ ఇన్సెపెక్టర్లు పరిశీలనకు వెళ్లగా ఒక అధికారి తిరస్కరించిన ప్లాను, అనుమతిని మరో అధికారి మంజూరు చేయటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

14 శాతం ఓపెన్‌స్పేస్‌ చార్జీలను ఒక అధికారి సిఫారసు చేస్తే అదే భవనాకికి నామమాత్రపు చార్జీలతో అనుమతులు ఇచ్చేయటం ఇప్పుడు వీఎంసీలో చర్చనీయాంశంగా మారింది. దీనికి నగరంలోని టీడీపీకి చెందిన ఓ యువనేత చక్రం తిప్పి అటు అధికారులకు, ఇటు నిర్మాణాదారులకు మధ్యవర్తిత్వం వహించి వీఎంసీకి సమకూరాల్సిన సొమ్ముకు గండికొట్టారు. వివరాల మేరకు ..

బెంజిసర్కిల్‌ వద్ద కళానగర్‌లో 2018 నవంబర్‌ 440 గజాల స్థలంలో సిల్టు, జీప్లస్‌3 నిర్మాణానికి అనుమతి కావాలని వీఎంసీకి దరఖాస్తు వచ్చింది. దీన్ని క్షేత్రస్థాయి పరిశీలనకు బిల్డింగ్‌ ఇన్సెపెక్టర్‌ వశీంబేగ్‌ వెళ్లారు. సంబంధిత ఆస్తికి చెందిన దస్తావేజులు, పన్ను చెల్లింపుల రసీదుల పరిశీలనలో భవన నిర్మాణ అనుమతికి సంబంధించి కేవలం 1999ల నుంచి పన్నులు చెల్లిస్తున్నట్లు బిల్డింగ్‌ ఇన్స్‌పెక్టర్‌ పరిశీలనలో తేలటంతో ఈ ఆస్తికి 14 శాతం ఓపెన్‌స్పేస్‌ బెటర్‌మెంట్‌ చార్జీలు అప్‌లై అవుతుందని నివేదిక ఇచ్చారు. ఆ చార్జీలు చెల్లించిన తర్వాతే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు.  బెటర్‌మెంట్‌ చార్జీలు చదరపుగజానికి రూ. 60,500 చొప్పున 440 చదరపు గజాలకి 14 శాతం చొప్పున 37.26 లక్షలు వీఎంసీకి చెల్లించాల్సి వచ్చింది. దీంతో సదరు భవన నిర్మాణదారులు భవన నిర్మాణ అనుమతి దరఖాస్తును విత్‌డ్రా చేసుకున్నారు.

కానీ నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ పనులు జరిగినా అధికారులు ఇటువైపు కన్నెతి చూడలేకపోయారు. అయితే ఈ ఏడాది జనవరి 10వ తేదీన సంబంధిత భవనానికి సిల్టు, జీప్లస్‌ 4 నిర్మాణానికి మళ్లీ వీఎంసీకి దరఖాస్తు అందింది.  మళ్లీ క్షేత్రస్థాయి పరిశీలనకు బిల్డింగ్‌ ఇన్స్‌పెక్టర్‌ రాం కుమార్‌  వెళ్లటంతో సంబంధిత భవన నిర్మాణదారులు టీడీఆర్‌ (టాన్స్‌ఫర్‌బుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌) బాండ్లు సమర్పించి దరఖాస్తు చేసుకోవటంతో అధికారులు భవన నిర్మాణానికి నామమాత్రపు చార్జీలు రూ. 1.6 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని సిఫారసు చేయటంతో వీఎంసీ అధికారులు అనుమతిని యధేచ్ఛగా ఇచ్చేశారు. అయితే ముందు జరిగిన పరిశీలనలో ఉన్న 14 శాతం ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలను అధికారులు కన్పించకుండా మాయచేసి అనుమతులు ఇచ్చేవారని, దీనికి నగరంలోని టీడీపీలో కీలకంగా ఉన్న ఓ యువ నాయకుడు చక్రంతిప్పి అటు నిర్మాణదారులకు, ఇటు అధికారులకు సమన్యాయం చేశారని సమాచారం. 

పరిశీలించాల్సి ఉంది
దీనిపై పరిశీలన చేయాల్సి ఉంది. భవన నిర్మాణదారులు 14 శాతం ఓపెన్‌ స్పేస్‌ చార్జీలు చెల్లించారా లేదా అనేది పరిశీలించి చెల్లించకపోతే చర్యలు తీసుకుంటాం.- లక్ష్మణరావు, సిటీ ప్లానర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement