వైద్యాధికారుల్లో వేటు భయం | Remember the fear of Assistants | Sakshi
Sakshi News home page

వైద్యాధికారుల్లో వేటు భయం

Published Tue, May 27 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

Remember the fear of Assistants

బాపట్లటౌన్, న్యూస్‌లైన్: గర్భిణికి వైద్యం అందించేందుకు నిరాకరించిన స్థానిక ఏరియా వైద్యశాల వైద్యాధికారుల్లో గుబులు మొదలైంది. అందరినీ వేటు భయం వెంటాడుతోంది. పిట్టలవానిపాలెం మండలం మండేవారిపాలెం గ్రామానికి చెందిన నిరుపేద గర్భిణి ఇందిరకు ఈ నెల 25న పురిటి నొప్పులు వచ్చాయి. బంధువులు బాపట్ల ఏరియావైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వైద్యం చేయలేదు. దీనిపై సోమవారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ స్పందించారు. విచారణ చేపట్టాల్సిందిగా జిల్లా ఆరోగ్యశాఖ కోఆర్డినేటర్‌ను ఆదేశించారు. డీసీ శ్రీదేవి మంగళవారం ఏరియా వైద్యశాలకు వచ్చారు. వివరాలు సేకరించారు. 25న ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీలో ఎవరున్నారు.. గర్భిణికి ఎలాంటి వైద్యం అందించారు.. కేసును ఎందుకు రిఫర్ చేయాల్సి వచ్చింది.. అనేదానిపై దర్యాప్తు చేపట్టారు. రికార్డులు పరిశీలించాక సిబ్బంది అందరినీ దశలవారీగా విచారించారు.
 
 అందరి లోపం ఉంది
 అనంతరం ఆమె‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ఘటనలో అందరి లోపం ఉందని, డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆర్.విజయలక్ష్మి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కేసుకు సంబంధించి డాక్టర్ ఆర్.విజయలక్ష్మి, ఇద్దరు స్టాఫ్ నర్సులు, లేబర్ రూమ్ నర్సు, ఏఎన్‌ఎం, నర్సింగ్ సూపరింటెండెంట్, మెడికల్ సూపరింటెండెంట్ల నుంచి లిఖితపూర్వకంగా లెటర్లు తీసుకున్నామని, వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు.
 
 వేటుపైనే సర్వత్రా చర్చ
 ఈ కేసుకు సంబంధించి ఎవరిపై వేటు పడుతుందోనన్న భయం ఇప్పుడు వైద్యశాల సిబ్బందిని వెంటాడుతోంది. ఆస్పత్రిలో ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైద్యాధికారి చేసిన తప్పుకు తాము ఏం చేస్తామంటూ కొందరు స్టాఫ్‌నర్సులు జిల్లా కోఆర్డినేటర్ ముందు బహిరంగంగానే వాపోయారు. విషయాలన్నీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని డీసీ చెప్పడంతో అటు నర్సులు, ఇటు వైద్యుల్లో కలవరం మొదలైంది. బాధ్యులపై వేటుపడితేనే వైద్యశాలకు మహార్దశ పడుతుందని రోగులు స్పష్టంచేస్తున్నారు.
 
 ఉద్యోగమంటే సంతకాలు చేసి
 వెళ్లడమా: డీసీ ఆగ్రహం
 ‘వచ్చినప్పుడల్లా వాగుతూనే ఉన్నా. మీలో మార్పు లేదు. జిల్లాలోనే బాపట్లలాంటి అధ్వానసెంటర్‌ను నేనెక్కడా చూడలేదు. కనీసం నెలలో నాలుగైదు సార్లు వస్తున్నా. మాకేం పనుల్లేక వస్తున్నారనుకుంటున్నారా. చెప్పిన వాటిలో ఒక్కపనినైనా కచ్చితంగా చేస్తున్నారా. ఉద్యోగం అంటే సంతకాలు చేసి వెళ్లిపోవడమా.’ అని శ్రీదేవి ఆస్పత్రి సిబ్బందిపై మండిపడ్డారు. ఆమె ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టాక ఆగ్రహం వ్యక్తంచేశారు. పది రోజుల కిందట తాను వచ్చినప్పుడు స్కానింగ్ సకాలంలో తీసేలా చూడాలని, ఫ్యాన్లకు మరమ్మతులు చేయించాలని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న కేసులు మినహా మిగిలిన అన్ని కేసులకు ఇక్కడే వైద్యసేవలు అందించాలని ఆదేశించినా.. ఒక్కటీ ఎందుకు అమలవడంలేదని సిబ్బందిని నిలదీశారు. నెలరోజులుగా ఆస్పత్రిలో ఎన్ని ఆపరేషన్లు చేశారు.. ఎన్ని కేసులు రిఫర్ చేశారనే విషయాలను రికార్డుల్లో రాశారా అని ప్రశ్నించారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement