ప్రాక్టికల్‌ ‘ప్రాబ్లమ్‌’ | Irregularities In Inter Practical Exams | Sakshi
Sakshi News home page

ప్రాక్టికల్‌ ‘ప్రాబ్లమ్‌’

Published Sat, Jan 18 2020 8:09 AM | Last Updated on Sat, Jan 18 2020 8:10 AM

Irregularities In Inter Practical Exams - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: ప్రయోగాత్మక విద్యే విద్యార్థి భవితకు పునాది. కొన్నేళ్లుగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహణ అంతా లోపభూయిష్టంగా కొనసాగుతూ వచ్చింది. పారదర్శకంగా నిర్వహించేందుకు జంబ్లింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. మార్కులు, ర్యాంకులాటలో మునిగి తేలుతున్న ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థలు ప్రలోభాల ఎసరు పెట్టి ఈ విధానాన్నీ కలుతం చేస్తున్నాయి. ఎక్కడైతే మాకేంటి అంటూ  ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు ముడుపుల మత్తు చల్లి తమ దారికి తెచ్చుకుంటున్నాయి. దీనికిగాను అయ్యే ఖర్చులను విద్యార్థుల నుంచే దండుకుంటున్నాయి.  

ఒక్కొక్కరి నుంచి రూ.3 వేలు వసూలు  
ఇంటర్మీడియట్‌ మార్కుల వెయిటేజ్‌కు ప్రాధాన్యత పెరిగింది. అయినప్పటికీ ప్రైవేట్, కార్పొరేట్‌ కళాశాలలు కూడా ప్రాక్టికల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. విద్యార్థులకు ఏదో ఒక విధంగా ప్రాక్టికల్స్‌ గండం తప్పించటానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేస్తున్నారు. ఒక్కో విద్యార్థి చేత రూ.2 నుంచి రూ.3 వేల వరకు వసూల్‌ చేసి ప్రాక్టికల్స్‌ మార్కులు వేయిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రాక్టికల్స్‌ కోసం సమయం వెచ్చించే తీరిక లేకపోవటం, నేర్చుకున్నా చేయగలమో లేదోనన్న భయంతో విద్యార్థులు అడిగినంత డబ్బులు చెల్లించటానికి సిద్ధపడుతున్నారు.

ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం లేదు  
ప్రైవేట్, కార్పొరేట్‌ కాలేజీల అక్రమాలను అడ్డుకోవటానికి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని బోర్డు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలను జంబ్లింగ్‌ విధానంలో కేటాయిస్తోంది. గతేడాది నుంచి ఎగ్జామినర్లను కూడా జంబ్లింగ్‌ విధానంలో నియమిస్తోంది. ఇన్ని చర్యలను తీసుకుంటున్నా అక్రమాలకు అలవాటు పడ్డ వారు తమ కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. వారికున్న పరిచయాలు, పలుకుబడితో గతేడాది కూడా నిరి్వగ్నంగా అక్రమాలకు పాల్పడ్డారు. కనీసం ఈ ఏడాదైనా అవకతవకలను ఆరికట్టి సమర్థవంతంగా నిర్వహిస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న నేపధ్యంలో ఇంటర్మీడియట్‌ బోర్డు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని తల్లిదండ్రులు  కోరుతునన్నారు.

ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌... 
సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 298 కళాశాలల నుంచి ఇంటరీ్మడియట్‌ రెండో ఏడాదికి చెందిన 36,460 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ఎంపీసీ విభాగం నుంచి 29,458, బైపీసీ విభాగం నుంచి 7,002 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాక్టికల్స్‌ నిర్వహణకు పూర్తిస్థాయిలో ప్రయోగశాలలు, పరికరాలు ఉన్న 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్‌ను సమర్థవంతంగా పూర్తి చేయటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని జిల్లా ఆర్‌ఐవో తెలిపారు.

ప్రైవేట్, కార్పొరేట్‌ సంస్థల నిర్లక్ష్యం వాస్తవమే 
ప్రైవేట్, కార్పొరేట్‌ కాలేజీలలో ప్రాక్టికల్స్‌ ప్రాక్టీస్‌ చేయించటం లేదన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఆయా యాజమాన్యాలు కేవలం థీయరీపైనే దృష్టి సారిస్తున్నాయి. దీని వల్ల విద్యార్థులు ప్రాక్టికల్స్‌ సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీల తనిఖీల్లో ఇటువంటి పరిస్థితి గుర్తించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశాం. ప్రాక్టికల్స్‌ విషయంలో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా సహించం.
– జెడ్‌ఎస్‌ రామచంద్రరావు,  ఇంటర్‌ బోర్డు ఆర్‌ఐవో, గుంటూరు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
Advertisement