కార్డు కాజేసి.. క్యాష్ డ్రా చేసి.. | 1.89 lakhs amount drawn by unkown person through atm | Sakshi
Sakshi News home page

కార్డు కాజేసి.. క్యాష్ డ్రా చేసి..

Published Sat, Jan 11 2014 2:20 AM | Last Updated on Sat, Aug 25 2018 4:52 PM

1.89 lakhs amount drawn by unkown person through atm

 సాయం కోరితే ఓ ఎస్.. అన్నాడు. పిన్ నెంబర్ తెలుసుకున్నాడు. కళ్లు గప్పి కార్డు మార్చేశాడు. తర్వాత బాధితుడి కార్డుతో వారం రోజుల్లో విడతలు విడతలుగా రూ.1.89 లక్షలు డ్రా చేసుకున్నాడు. మళ్లీ డబ్బులు అవసరమై శుక్రవారం బ్యాంకుకు వెళ్లిన అసలు ఖాతాదారుడు ఖాళీ ఖాతా వెక్కిరించడంతో లబోదిబోమన్నాడు. పోలీసులను ఆశ్రయించాడు.    
     
 1.89 లక్షల స్వాహా చేసిన ఘనుడు
 రణస్థలం, న్యూస్‌లైన్:
 ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడంలో సహాయం చేసినట్లు నటించి ఏటీఎం కార్డు తస్కరించిన ఓ ఆగంతకుడు సదరు వ్యక్తి ఖాతా నుంచి రూ.1.89 లక్షలు విత్‌డ్రా చేశాడు. విషయం తెలిసి బాధితుడు లబోదిబోమంటున్నాడు. వివరాల్లోకి వెళితే... లావేరు మండలం లింగాలవలసకి చెందిన లుకలాపు అప్పలనాయుడికి రణస్థలంలోని ఎస్‌బీఐలో 32033222913 నంబరుతో ఖాతా ఉంది. సంకిలి సుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేయడంతో ఆ సంస్థ యాజమాన్యం అప్పలనాయుడు ఖాతాలో ఈ నెల 3న రూ.2 లక్షలు జమచేసింది. అదేరోజున అప్పలనాయుడు డబ్బులు తీసుకోడానికి రణస్థలంలోని ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్లాడు. ఏటీఎంలో కార్డు పెట్టినా డబ్బులు రాకపోవడంతో పక్కనే ఉన్న గుర్తుతెలియని వ్యక్తి సహాయం తీసుకున్నాడు. మూడు విడతలుగా రూ.35 వేలు తీసుకున్న తర్వాత ఆగంతుకుడు అప్పలనాయుడుకు వేరొకరి ఏటీఎం కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిని అప్పలనాయుడు కూడా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బలు అవసరమై ఏటీఎంకు వెళ్లగా డబ్బులు రాకపోవడంతో అప్పలనాయుడు బ్యాంకు అధికారులను సంప్రదించగా కార్డు టిబిక్రమ్ ప్రధాన్‌ది అని చెప్పడంతో మోసపోయానని గుర్తించాడు.
 
 ఖాతాలో నిల్వ ఎంత ఉన్నదీ వాకబుచేయగా రూ.2 లక్షలకు రూ.71 మాత్రమే ఉండడంతో విస్తుపోయిన అప్పలనాయుడు శుక్రవారం రణస్థలం పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్పై ఎల్.సన్యాసినాయుడు బ్యాంకుకు వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్‌లో ఆగంతుకుడి ఆనవాళ్లు గమనించారు. అప్పలనాయుడి నుంచి ఏటీఎం కార్డు తస్కరించిన వ్యక్తి 3వ తేదీన కోస్టలోని ఏటీఎం నుంచి రూ.5 వేలు తీసుకోవడమేకాకుండా మహాబీర్ ప్రధాన్ అనే వ్యక్తి ఖాతాకి రూ.20 వేలు బదిలీ చేశాడు. 4వ తేదీన ఒడిశా రాష్ట్రం జైపూర్‌లోని హోటల్ ప్రిన్స్ ఏటీఎం నుంచి రూ.40 వేలు, 5న కోరియా బైపాస్ దికానా ఏటీఎం నుంచి మూడు విడతల్లో రూ.35 వేలు డ్రా చేశాడు. అలాగే మహాబీర్ ప్రధాన్ ఖాతాకి మరోకసారి రూ.20 వేలు బదిలీ చేశాడు. 6న చండోల్ ఏటీఎం నుంచి రూ.30 వేలు, 7న జైపూర్ ఏటీఎం నుంచి రూ.3 వేలు డ్రా చేశాడు. మొత్తంమీద 3వ తేదీ నంచి 7వ తేదీ వరకూ అప్పలనాయుడి ఖాతా నుంచి రూ.1.89 లక్షలు డ్రాచేశాడు. ఒకే ఖాతాకు రెండుసార్లు నగదు బదిలీ చేసినందుకు నిందితుడు దొరికిపోతాడని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement