పాఠశాలల్లో మౌలిక వసతులు | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో మౌలిక వసతులు

Published Sat, Apr 20 2024 1:35 AM | Last Updated on Sat, Apr 20 2024 1:35 AM

నిధులు మంజూరైన పహిల్వాన్‌పూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
 - Sakshi

భువనగిరి : ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతంలో ఉన్న పాఠశాల యాజమాన్య కమిటీల పదవీ కాలం ముగియడంతో వాటి స్థానంలో మహిళా సంఘాల సభ్యులతో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పనులకు చేయించేందుకు రూ.24.05 కోట్లు మంజూరు చేసింది. అయితే జిల్లాలో 712 పాఠశాలలు ఉండగా గతంలో 251 పాఠశాలల్లో మన ఊరు – మన బడి పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో 60 పాఠశాలల్లో పనులు చేయగా మిగిలిన స్కూళ్లలో పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు మౌలిక వసతులకు నోచుకోని 563 పాఠశాలలను విద్యాశాఖ అధికారులు గుర్తించారు. యూడైస్‌ ఆధ్వర్యంలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా వాటిని అభివృద్ధి చేసేందుకు పూనుకుంది.

కార్యాచరణ రూపకల్పన

పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు విద్యాశాఖ కార్యచరణ రూపొందించింది. ఇంజనీరింగ్‌ అధికారుల అంచనా మేరకు ప్రధానంగా విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు, బాలికల మూత్రశాలల నిర్మాణం, తరగతి గదుల మరమ్మతులకు జిల్లాకు రూ.24.05 కోట్లు మంజూరు చేసింది. మొదట మౌలిక వసతుల కల్పన, యూనిఫాం కుట్టుకూళ్ల కోసం రూ.25 శాతం నిధులు విడుదల చేయనున్నారు. వీటిని ఇప్పటికే ఎంపీడీఓల ఖాతాల్లో జమ చేస్తున్నారు. వసతుల కల్పనను గరిష్టంగా రూ.14 లక్షలు, కనిష్టంగా రూ.1.35 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.అమ్మ ఆదర్శ కమిటీల తీర్మానం మేరకు ఉన్నత అధికారుల ఆదేశాలతో పనులు చేపట్టనున్నారు.

ఫ అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పనులు

ఫ జిల్లాలో 563 పాఠశాలలు ఎంపిక

ఫ రూ.24.05 కోట్లు మంజూరు

అంచనాలు రూపొందిస్తున్నాం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టనున్న పనులకు ఇంజనీరింగ్‌ అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అంచనాలకు అనుగుణంగా కార్యచరణ రూపొందిస్తాం. ప్రక్రియ పూర్తయిన తర్వాత మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తాం.

–నారాయణరెడ్డి, డీఈఓ

నిధులు డ్రా చేయడం ఇలా..

పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి మౌలిక వసతుల కల్పంచడానికి విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. పనులు ప్రారంభమైన తర్వాత డబ్బులు డ్రా చేయడానికి ప్రధానోపాధ్యాయులు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలితో ఇప్పటికే బ్యాంకు ఖాతాలు తెరిచారు. రూ. 25 వేల విలువ చేసే పనులు చేపట్టి తర్వాత పాఠశాలల్లో సమావేశమై డబ్బులను విత్‌ డ్రా చేయనున్నారు. అదే విధంగా రూ.లక్ష వరకు ఎంపీడీఓ అనుమతితో విత్‌ డ్రా చేయనున్నారు. రూ.లక్షకు పైగా విలువైన పనులు చేస్తే జిల్లా మహిళా సమాఖ్యతో పాటు జిల్లా ఉన్నతాధికారి అనుమతి తీసుకోవాలి. ఈ నిధుల వినియోగంపై అమ్మ ఆదర్శ కమిటీలకు అవగాహన కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement