తరుగు పేరిట మోసం | - | Sakshi
Sakshi News home page

తరుగు పేరిట మోసం

Published Sat, Apr 20 2024 1:35 AM | Last Updated on Sat, Apr 20 2024 1:35 AM

గౌరాయపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న డీఆర్‌డీఓ - Sakshi

మోత్కూరు : తరుగు, కమీషన్‌, హమాలీ ఖర్చుల పేరిట పాటిమట్ల గ్రామ ఎక్స్‌ రోడ్డు వద్ద గల శ్రీమల్లికార్జున వేబ్రిడ్జి కాంటా నిర్వాహకుడు తనను మోసం చేశారని ఆరోపిస్తూ కొండగడపకు చెందిన రైతు తొంట తిరుతపయ్య శుక్రవారం డిఫెన్స్‌ వినియోగదారుల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. మూడు క్వింటాళ్ల 20 కిలోల ధాన్యాన్ని వేబ్రిడ్జి నిర్వాహకులకు విక్రయించగా క్వింటాకు రూ.1900 చొప్పున కొనుగోలు చేశారని రైతు తెలిపాడు. మొత్తం రూ.5,890 రావల్సి ఉండగా 10 కిలోల తరుగు, రూ.125 హమాలీ, రూ.117 కమిషన్‌, రూ.100 వే బ్రిడ్జి ఖర్చుల పేరుతో కోత పెట్టి రూ.5,548 చెల్లించారని ఆరోపించారు. తక్కువ డబ్బులు ఇస్తున్నారని ప్రశ్నించగా నిర్వాహకులు తనతో దురుసుగా మాట్లాడారని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని రైతు కోరారు.

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

యాదగిరిగుట్ట రూరల్‌ : రైతులకు కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర దక్కుతుందని, దళారులను నమ్మి మోసపోవద్దని డీఆర్‌డీఓ కృష్ణన్‌ పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబెట్టి, తాలు, చెత్త, మట్టి పెల్లలు లేకుండా శుభ్రం చేసుకొని తీసుకురావాలని రైతులకు సూచించారు. సీరియల్‌ ప్రకారం పేర్లు నమోదు చేసుకొని ధాన్యాన్ని విక్రయించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం సుధాకర్‌, ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

సారా తయారీ కేంద్రాలపై దాడులు

సంస్థాన్‌నారాయణపురం : మండల పరిధిలోని కొర్రతండా, డాకుతండా, సీత్యాతండా, రాధానగర్‌తండా, అంబోత్‌తండా, పొర్లగడ్డతండాలో శుక్రవారం ఎకై ్సజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 68 లీటర్ల సారా, 25 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. 2,200 లీటర్ల బెల్లంపాకం పారబోశారు. ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా సంస్థాన్‌నారాయణపురం, సర్వేల్‌ గ్రామాల్లోని మద్యం దుకాణాల్లో తనిఖీలు చేశారు. సారా తయారు చేసినా, అక్రమంగా మద్యం తరలించినా చర్యలు తప్పవని ఎకై ్సజ్‌ అధికారులు హెచ్చరించారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ రాధాకిషన్‌, రామన్నపేట సీఐ బాలాజీనాయక్‌, ఎస్‌ఐ శంకర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

హాస్టళ్ల నిర్వహణను

నిర్లక్ష్యం చేయొద్దు

భువనగిరిటౌన్‌ : ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని వార్డెన్లకు జెడ్పీ సీఈఓ శోభారాణి సూచించారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో విద్య, వైద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, మెనూ, విద్యార్థుల హెల్త్‌చార్ట్‌ అమలు, వైద్య శిబిరాల ఏర్పాటు విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. రికార్డుల పక్కాగా నిర్వహించాలని సూచించారు. ప్రతి నెలా 23వ తేదీన తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి శుక్రవారం వసతి గృహాల నివేదికను కలెక్టర్‌ అందజేయాలని పేర్కొన్నారు. ముందుగా ఇటీవల భువనగిరి గురుకుల విద్యాలయంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థి ప్రశాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ పాపారావు, డీఆర్‌డీఓ కృష్ణన్‌, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
భువనగిరిలోని గురుకుల పాఠశాల కిచెన్‌లో బియ్యాన్ని పరిశీలిస్తున్న జెడ్పీ సీఈఓ
1/2

భువనగిరిలోని గురుకుల పాఠశాల కిచెన్‌లో బియ్యాన్ని పరిశీలిస్తున్న జెడ్పీ సీఈఓ

బెల్లం పాకాన్ని స్వాధీనం చేసుకున్న
ఎక్సైజ్‌ పోలీసులు
2/2

బెల్లం పాకాన్ని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్‌ పోలీసులు

Advertisement
 
Advertisement
 
Advertisement