రెండో రోజూ స్వల్పంగానే.. | - | Sakshi
Sakshi News home page

రెండో రోజూ స్వల్పంగానే..

Published Sat, Apr 20 2024 1:35 AM | Last Updated on Sat, Apr 20 2024 1:35 AM

- - Sakshi

సాక్షి, యాదాద్రి : లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భువనగిరి స్థానానికి రెండో రోజు శుక్రవారం ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్‌, బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్‌, సోషలిస్ట్‌ పార్టీ (ఇండియా) అభ్యర్థిగా రచ్చ సుభద్రారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా మెగావత్‌ చందునాయక్‌, రేకల సైదులు ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే తెలిపారు. మొదటి, రెండో రోజు కలిపి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు తొమ్మిది సెట్ల నామినేషన్లు వేశారు.

అట్టహాసంగా సీపీఎం నామినేషన్‌

సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్‌ అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జహంగీర్‌ వెంట సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండమడుగు నర్సింహ ఉన్నారు. నామినేషన్‌ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు.

23న మరోసారి బీజేపీ నామినేషన్‌

బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ బూరనర్సయ్యగౌడ్‌ మొదటి సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే జన సమీకరణ చేయకుండా సాదాసీదాగా వచ్చి నామినేషన్‌ వేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్‌, కిసాన్‌ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్‌మోహన్‌రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, బీజేపీ జిల్లా అధికార ప్రతినిఽధి కోళ్ల భిక్షపతి ఉన్నారు. అయితే 23వ తేదీన భారీ జన సమీకరణతో వచ్చి మరో రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు మరికొందరు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. శుక్రవారం నామినేషన్‌ వేసిన అనంతరం బూర నర్సయ్యగౌడ్‌ విలేకరులతో మాట్లాడారు. 23న నామినేషన్‌ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నామని, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోరారు.

ముహూర్తం చూసుకుంటున్న అభ్యర్థులు

లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు మంచి ముహూర్తాలు చూసుకుంటున్నారు. నామినేషన్‌ దాఖలుకు 25వ తేదీ వరకు గడువు ఉంది. మధ్యలో 21వ తేదీ ఆదివారం సెలవు పోను ఏడు రోజులు సమయం ఉంది. ఈ వ్యవధిలో తమకు కలిసొచ్చే రోజు కోసం అభ్యర్థులు పండితులను ఆశ్రయిస్తున్నారు. 18, 19, 21, 23, 24 తేదీల్లో ముహూర్తం బాగుందని పండితులు చెబుతున్నారు. అయినా మొదటి రెండు రోజులు అంతంతమాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. 23,24 తేదీల్లో నామినేషన్లు ఎక్కువగా దాఖలయ్యే అవకాశం ఉంది.

నల్లగొండలో..

నల్లగొండ లోక్‌సభ స్థానానికి రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొదటి రోజు నలుగురు అభ్యర్థులు ఆరుసెట్లు, రెండో రోజు నలుగురు అభ్యర్థులు ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. రెండు రోజుల్లో ఎనిమిది మంది అభ్యర్థులు పది సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, నల్లగొండ కలెక్టర్‌ హరిచందన నామినేషన్లు స్వీకరించారు.

నామినేషన్‌ వేసింది వీరే..

రెండో రోజు స్వతంత్ర అభ్యర్థులుగా బండారు నాగరాజు, కిన్నెర యాదయ్య, ధర్మసమాజ్‌ పార్టీ అభ్యర్థిగా తలారి రాంబాబు, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (యునైటెడ్‌) తరఫున వసుకుల మట్టయ్య నామినేషన్‌ వేశారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి తరఫున ఒక నామినేషన్‌ సెట్‌ దాఖలు కాగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు ఒకటి, ఇద్దరు రెండు సెట్ల చొప్పున, ప్రజావాణి పార్టీ, సోషలిస్టు పార్టీ, ధర్మసమాజ్‌ పార్టీ, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ తరఫున ఒక్కొక్కరు ఒక్కో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

ఫ భువనగిరి ఎంపీ స్థానానికి శుక్రవారం ఐదు నామినేషన్లు దాఖలు

ఫ సీపీఎం తరఫున ఎండీ జహంగీర్‌

ఫ బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్‌

ఫ ఇద్దరు ఇండిపెండెంట్లు

ఫ రెండు రోజుల్లో మొత్తం ఎనిమిది మంది నామినేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
పార్టీ నాయకులతో కలిసి నామినేషన్‌ దాఖలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌
1/3

పార్టీ నాయకులతో కలిసి నామినేషన్‌ దాఖలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌

నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న ధర్మ సమాజ్‌ పార్టీ అభ్యర్థి తలారి రాంబాబు
2/3

నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న ధర్మ సమాజ్‌ పార్టీ అభ్యర్థి తలారి రాంబాబు

3/3

Advertisement
 
Advertisement
 
Advertisement