అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

Published Sat, Apr 20 2024 1:35 AM | Last Updated on Sat, Apr 20 2024 1:35 AM

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ 
 - Sakshi

నల్లగొండ క్రైం : తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.16లక్షల 24వేల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు విలేకరుల సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విజయవాడలోని బొంబాయి కాలనీ, సీబ్లాక్‌ ఎఫ్‌ఎఫ్‌6లో నివాసం ఉండే దేవరకొండ రాంబాబు పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. రాంబాబు జలస్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ఒంటరిగానే చోరీలకు పాల్పడడం ప్రారంభించారు. విజయవాడలో పలు చోరీ కేసుల్లో, గుంటూరులో పలు చోరీలో పట్టుబడి గుంటూరు జైలులో ఏడాది పాటు శిక్ష అనుభవించి 2024 జనవరిలో జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా అతడు తీరు మార్చుకోకపోగా మళ్లీ చోరీలకు పాల్పడడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఈనెల 10న మిర్యాలగూడ వన్‌టౌన్‌ పరిధిలో మౌర చంద్రశేఖర్‌ తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. గమనించిన రాంబాబు రాత్రి సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ.50వేలు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలిస్తుండగా మిర్యాలగూడలోని ఈదులగూడ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రాంబాబు అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని పట్టుకుని విచారించగా దొంగతనాలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. ఈ ఏడాది జనవరి 30న మిర్యాలగూడలోని కృష్ణాకాలనీలో, ఫిబ్రవరి 9న కృష్ణా జిల్లా గుడివాడలోని సత్యనారాయణపురం సాయిరాం అపార్ట్‌మెంట్‌లో, ఫిబ్రవరి18న ఏపీలోని బాపులపాడు, ఫిబ్రవరి 26న మిర్యాలగూడ రూరల్‌ పరిధిలోని తుంగపాడ్‌లో, మార్చి 26న మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తిలో, మార్చి 29న మిర్యాలగూడలోని తాళ్లగడ్డలో, ఈనెల 10న మిర్యాలగూడలో హౌజింగ్‌ బోర్డు కాలనీలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు ఒప్పుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన సీ ఐ సుధాకర్‌, ఎస్‌ఐ రవికుమార్‌, కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు, శ్రీను, నాగరాజు, ఐటీకోర్‌ మధు, ఫింగర్‌ ప్రింట్‌ ఏఎస్‌ఐ శివను డీఎస్పీ అభినందించారు.

దొంగతనాల నివారణపై పటిష్ట నిఘా..

జిల్లాలో దొంగతనాలు నివారించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరింత నిఘా పెట్టినట్లు ఎస్పీ చందనా దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు దొంగతనాల పట్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలు, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. జైళ్ల నుంచి విడుదలైన వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు.

ఫ రూ.16లక్షల 24వేల విలువైన

బంగారు ఆభరణాలు స్వాధీనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement