Andhra Pradesh:కొత్త రేషన్‌ కార్డులొచ్చాయ్‌ | - | Sakshi
Sakshi News home page

Andhra Pradesh:కొత్త రేషన్‌ కార్డులొచ్చాయ్‌

Published Mon, Jan 8 2024 1:40 AM | Last Updated on Mon, Jan 8 2024 10:17 AM

- - Sakshi

సాక్షి, భీమవరం: క్షేత్రస్థాయిలో అర్హత కలిగిన వారందరికీ ఎప్పటికప్పుడు తెల్లరేషన్‌ కార్డుల మంజూరుచేయడం ద్వారా ఇంటింటా సంక్షేమ కాంతులు నింపుతోంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. తాజాగా జిల్లాలో 4,935 రేషన్‌కార్డులు మంజూరు కాగా మొత్తం తెల్లరేషన్‌ కార్డుల (బియ్యం కార్డులు) సంఖ్య 5,70,956 చేరింది. ఈనెల నుంచే కొత్త కార్డుదారులకు ప్ర భుత్వం రేషన్‌ సరుకులు పంపిణీ ప్రారంభించడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దారిద్య్ర రేఖకు దిగువన ఉండే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో తెల్లరేషన్‌ కార్డులదే ప్రధానపాత్ర. గత టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోత పెట్టేందుకు అరకొరగా రేషన్‌కార్డులు మంజూరు చేసింది. దీంతో కొత్త కార్డుల కోసం పేదలు అప్పటి జన్మభూమి కమిటీలు, కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం జగన్‌ సర్కారు రేషన్‌కార్డుల మంజూరుకు నిబంధనలను సరళతరం చేసింది. కుటుంబంలో ఎవరైనా ఉద్యోగి ఉంటే వారి వల్ల తల్లిదండ్రులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారన్న ఉద్దేశంతో కార్డు నుంచి వారిని తొలగించే వీలు కల్పించింది. కొత్తగా పెళ్లయిన వారుంటే స్పిట్లింగ్‌ ద్వారా కార్డుల మంజూరుకు వెసులుబాటు ఇచ్చింది. ప్రతి ఆరు నెలలకు అర్హులైన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తుండటంతో జిల్లాలో కార్డుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఉచితంగా బియ్యం
పునర్విభజన అనంతరం జిల్లాలో 5,53,519 రేషన్‌కార్డులు ఉండగా గతేడాది జనవరిలో 3,090, జూలైలో 9,372 కొత్త కార్డులు మంజూరయ్యాయి. తాజాగా ఈనెలలో 4,935 కార్డుల మంజూరు చేయడంతో జిల్లాలో కార్డుదారుల సంఖ్య 5,70,916కు పెరిగింది. వీటిలో 31,944 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. ప్రతినెలా అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల బియ్యం ఉచితంగా, రూ.13.50కు కిలో పంచదార అందిస్తున్నారు. తెల్ల రేషన్‌కార్డుదారులకు రూ.67కు కిలో కందిపప్పు, రూ.17కు అరకిలో పంచదార, రూ.16కు కిలో గోధుమ పిండిలతో పాటు కుటుంబంలోని ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

ఇంటి వద్దకే సరఫరా
రేషన్‌ డిపోకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కార్డుదారులకు ఎండీయూ వాహనాల ద్వారా ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్‌ సరుకులను అందిస్తోంది. తూకంలో కచ్చితత్వం, ఈపోస్‌ యంత్రాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ అమర్చడంతో సరుకుల అక్రమ రవాణకు తెరదించింది. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎక్కడైనా సమస్యలుంటే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఎండీయూ వాహనాలపై 1967 టోల్‌ఫ్రీ నంబర్‌ను ముద్రించింది. ఎండీయూ వాహనాలు క్రమం తప్పకుండా నిర్దేశిత ప్రాంతాలకు వెళ్లేలా సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందని సివిల్‌ సప్లయీస్‌ అధికారులు చెబుతున్నారు.

వలంటీర్‌ సాయంతో త్వరితగతిన..
మా ఇద్దరు అమ్మాయిలకు వివాహాలు కావడం, వారు ఆదాయపు పన్ను పరిధిలో ఉండటంతో 8 నెలల క్రితం రేషన్‌ కార్డు రద్దయ్యింది. నేను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే వలంటీర్‌ సాయంతో కొత్త రేషన్‌ కార్డు పొందాను. కొత్త రేషన్‌ కార్డుతో పాటు ఈనెల రేషన్‌ సరుకులు కూడా ఇచ్చారు. అసలే వృద్ధాప్యం, ఆపై ఒంటరిగా ఉంటున్న నాకు రేషన్‌ సరుకులు అందడం ఆనందంగా ఉంది.
–కల్లేపల్లి పుష్పావతి, తేతలి, తణుకు మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement