అమ్మవారి రూపాన్ని ధైర్యంగా చూడగలరా?! | Vijaya Dashami Importance Of Festival In Contemporary Issues | Sakshi
Sakshi News home page

దుర్గుణాలను పారద్రోలే ఆయుధ పూజ!

Published Sun, Oct 25 2020 9:57 AM | Last Updated on Mon, Oct 26 2020 1:19 PM

Vijaya Dashami Importance Of Festival In Contemporary Issues - Sakshi

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే పండుగ విజయదశమి. యావద్భారతం ఏటా ఎంతో వైభవంగా జరుపుకొనే ఉత్సవం. అయితే ఈసారి కరోనా కారణంగా పరిస్థితులు మారిపోయాయి. మునుపటి స్థాయిలో కాకపోయినా, కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూనే ప్రజలు పండుగ సంబరాల్లో పాల్గొంటున్నారు. కాగా, తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు నిర్వహించి, పదో రోజును విజయదశమి లేదా దసరాగా జరుపుకొంటారన్న విషయం తెలిసిందే. అయితే అన్నిచోట్లా ఈ ఉత్సవాలు ఒకేరకంగా నిర్వహించరు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లోని ప్రాంతీయ, సాంస్కృతిక వైవిధ్యమంతా ఈ పండుగ ఉత్సవాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎక్కడైనా దసరా అంటే శక్తి ఆరాధనే. శక్తి స్వరూపిణిని అయిన అమ్మవారిని కొలిచే సందర్భమే. మహిషాసురుడిని వధించిన ఆ దుష్టసంహారిణికి జేజేలు పలుకుతూ, మమ్మల్ని కాపాడు తల్లీ అంటూ వేడే వేడుక. (చదవండి: శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు)

మరి ఆ అమ్మవారికి ప్రతిరూపమైన మహిళలకు ఈదేశంలో ఏపాటి గౌరవం దక్కుతోంది? దుర్గామాత విశ్వరూపం గురించి తెలిసిన మనం, ప్రతి ఆడబిడ్డలోనూ అంతర్లీనంగా దాగి ఉండే ఆ ఆదిశక్తికి ఎంత విలువ ఇస్తున్నాం? ‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా’అంటూ స్త్రీలకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన కర్మభూమి మా జన్మస్థానం అని గర్వంగా చెప్పుకొనే వాళ్లలో లింగభేదాలకు అతీతంగా, ఎంతమంది మహిళను పురుషులతో సమాననంగా, ముఖ్యంగా సాటి మనిషిగా చూడగలుగుతున్నారు? ఆ దేవి అనుగ్రహం పొందేందుకు హారతులు పట్టి, పెద్ద ఎత్తున పండుగ చేస్తున్న వారిలో, కడుపులో ఉన్నది ఆడశిశువు అని తెలియగానే గర్భంలోనే అంతం చేస్తున్న వాళ్లు ఎందరు? 

అన్ని అవాంతరాలు దాటుకుని ఎలాగోలా భూమి మీద పడి, ఎన్నెన్నో సవాళ్లు ఎదుర్కొని విద్యాసంస్థల్లో అడుగుపెడితే ప్రేమ పేరిట వేధించే పోకిరీలు, వాటిని అధిగమించి కార్యక్షేత్రంలోకి దిగితే అడుగడుగునా వివక్ష, ఇక గృహిణిగా అంతాతానై కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్న ఇల్లాలికి కనీస గౌరవం ఇవ్వకుండా చిన్నచూపు చూసేవిధంగా వ్యవహరించే తంతు ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమేనని కొట్టిపారేసే మహానుభావులు ఎందరు? ఇక నెలల పసికందు నుంచి పండు ముసలిదాకా మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మృగాళ్ల పశువాంఛకు బలైపోతున్న ఆడవాళ్ల సంఖ్యకు లెక్కేలేదు. నేర గణాంక సంస్థల లెక్కల పరిగణనలోకి రాని అవ్యవస్థీకృత నేరాలు కోకొల్లలు. 

అనాదికాలం నుంచి నేటి ఆధునిక స్మార్ట్‌ యుగం దాకా.. హథ్రాస్‌ ఉదంతం వంటి ఎన్నెన్నో దారుణాలకు సాక్షీభూతంగా నిలిచిన సమాజం, ఏ న్యాయస్థానం ముందు దోషిగా నిలబడకపోవచ్చు. కానీ ఆ దుర్గాదేవి విజయాన్ని ఉత్సవంగా జరుపుకొనే ఈ పర్వదినంనాడు, ఆ అమ్మవారి ముందు ధైర్యంగా నిలబడి, ఆ తల్లి రూపాన్ని చూస్తూ మనస్ఫూర్తిగా ఆమె అనుగ్రహం కోరే ధైర్యం ఎంతమందికి ఉంటుంది! దసరా పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న నిజమైన స్ఫూర్తిని గ్రహించగలిగితే, ఇతరులకు చెడు చేయకుండా ఉండటం సహా బాధితుల పక్షాన పోరాడే గుణాన్ని ప్రతి ఒక్కరు పెంపొందించుకోవచ్చు. గతంలో ఎలా ఉన్నా సరే నేటి నుంచైనా పద్ధతి మార్చుకుని, మనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవీయత, అహంకారం వంటి దుర్గుణాలను అంతం చేయమంటూ ‘ఆయుధ పూజ’కు సంసిద్ధులమవుదాం!!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement