‘కూలిన’ బతుకులు  | Two laborers died in a shed under construction | Sakshi
Sakshi News home page

‘కూలిన’ బతుకులు 

Published Tue, Nov 21 2023 4:08 AM | Last Updated on Tue, Nov 21 2023 4:08 AM

Two laborers died in a shed under construction - Sakshi

మొయినాబాద్‌: నాణ్యత లోపం.. ఇంజనీర్లు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం ఇద్దరు వలస కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంది. నిర్మాణంలో ఉన్న షెడ్‌ కుప్పకూలడంతో శిథిలాలకింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం ఫైర్‌ఫాక్స్‌ క్లబ్‌లో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫైర్‌ఫాక్స్‌ క్లబ్‌లో షెడ్‌ మాదిరి నిర్మాణం చేపడుతున్నారు.

సుమారు 100 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తుతో ఇనుప స్తంభాలు ఏర్పాటు చేసి నాలుగు వైపులా 40 అడుగుల ఎత్తు గోడలు నిర్మించారు. వాటిపై ఇనుప బీమ్‌లు పెట్టి వాటిపై ఐరన్‌ షీట్లు బిగించారు. షీట్లపై ఆర్‌సీసీ స్లాబ్‌ వేశారు. బీహార్, పశ్చిమబెంగాల్‌కు చెందిన వలస కార్మికులు కొంత కాలం క్రితం ఇక్కడికి వచ్చి కూలీ పనుల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం 14 మంది కార్మికులు నిర్మాణంలో ఉన్న షెడ్‌లో పని చేస్తుండగా పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పశ్చిబెంగాల్‌కు చెందిన బబ్లూ(35), బిహార్‌కు చెందిన సునీల్‌ (26), రాకేష్, సంజయ్, విజయ్,         సంతోష్, ప్రకాష్, వికాస్‌కుమార్, రాజన్‌లు శిథిలాల కింద ఇరుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీంను రప్పించారు. శిథిలాలను తొలగిస్తూ అందులో ఇరుకున్నవారిని బయటకు తీశారు. బబ్లూ, సునీల్‌ మృతి చెందగా.. మిగిలిన ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మరో ఐదు మంది ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. దీనిపై మృతుల కుటుంబాల నుంచి ఫిర్యాదు అందిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఇన్‌స్పెక్టర్‌ ఏవీ రంగా తెలిపారు. 

నాణ్యతా లోపంతోనే... 
ఫైర్‌ఫాక్స్‌ క్లబ్‌లో నిర్మిస్తున్న షెడ్‌ నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం వల్లే కుప్పకూలిందని స్థా నికులు ఆరోపిస్తున్నారు. షెడ్‌ నిర్మాణం చేపట్టి ఇనుప షీట్లపై ఆర్‌సీసీ స్లాబ్‌ వేయడం వల్లే కూలిందని, షెడ్‌ డిజైనింగ్‌లో ఇంజనీర్ల నిర్లక్ష్యం ఉందని మండిపడుతున్నారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. కాగా బాధితులను ఆదుకుంటామని నిర్మాణదారులు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement