సంతోష్‌ ఎప్పుడు వస్తారు? | TS High Court Adjourned Till 30th In TRS MLAs Purchase Case | Sakshi
Sakshi News home page

సంతోష్‌ ఎప్పుడు వస్తారు?

Published Thu, Nov 24 2022 4:58 AM | Last Updated on Thu, Nov 24 2022 3:06 PM

TS High Court Adjourned Till 30th In TRS MLAs Purchase Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ విచారణకు ఎప్పుడు వస్తారో చెప్పేదెవరని హైకోర్టు ధర్మాసనం.. బీజేపీ తరఫు న్యాయ వాదిని ప్రశ్నించింది. హాజరుపై స్పష్టత ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ–మెయిల్, వాట్సాప్‌ ద్వారా మళ్లీ నోటీసులు అందజేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. సిట్‌ విచారణను ఆపాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, నిందితులు రామచంద్ర భారతి, నందు, సింహయాజి, కరీంనగర్‌ న్యాయవాది బి.శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిటిషన్లతో పాటు ఇతర పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్, ఏఏజీ రామచంద్రరావు, కేంద్రం తరఫున గాడి ప్రవీణ్‌కుమార్, నిందితుల తరఫున సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జఠ్మలానీ, బీజేపీ తరఫున సీనియర్‌ న్యాయవాదులు వైద్యనాథన్‌ చిదంబరేశ్, ఎన్‌.రామచంద్రరావు హాజరయ్యారు.  

పార్టీ ప్రతినిధుల్లా మాట్లాడకూడదు.. 
‘సంతోష్‌కు నోటీసులు ఇవ్వడం కోసం 16వ తేదీ నుంచి సిట్‌ ప్రయత్నిస్తోంది. ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. సంతోష్‌ కావాలనే నోటీసులు తీసుకోకుండా తప్పించుకుంటున్నారు. దీంతో ఆయన కార్యాలయంలోని వారికి సిట్‌ వాటిని అందజేసింది. ఆయనపై అనేక అనుమానాలున్నాయి. విచారణకు రాకుండా జాప్యం చేయడం మూలంగా సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది’ అని ఏజీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎన్‌. రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆధారాలు మొత్తం బహిరంగపర్చిందని ఆరోపిం చారు. బీఎల్‌ సంతోష్‌ సీనియర్‌ సిటిజన్‌ అని.. ఏం చేయలన్నదానిపై న్యాయసలహా తీసుకుంటున్నా రని తెలిపారు. ఈ క్రమంలో సంతోష్‌ అసలు విచా రణకు ఎందుకు హాజరుకావడం లేదు.. ఎప్పుడు హాజరవుతారని హైకోర్టు ప్రశ్నించింది.

దీనిపై తమ కు సమాచారం లేదని బీజేపీ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఇంకా వ్యక్తిగతంగా ఆయనకు నోటీసులు అందలేదని ఆయన చెప్పడంపై ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసుల విషయం తెలియనప్పుడు 70 ఏళ్ల వయసులో విచారణకు హాజరుకా లేనని సిట్‌కు సంతోష్‌ ఎలా లేఖ రాశారని ప్రశ్నించారు. కాగా, ఈ సందర్భంగా బీజేపీ, ప్రభుత్వ న్యాయవాదుల తీరు పట్ల న్యాయమూర్తి అభ్యంత రం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రతినిధుల్లా మాట్లాడకూడదని.. రాజకీయ నాయకుల్లా వాదించుకోవడం సరికాదన్నారు. వృత్తి నిపుణుల్లా ప్రవర్తించాలని వ్యాఖ్యానించారు. ఆవేశానికి లోనుకావొద్దన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఇవ్వాలని ఏజీని న్యాయమూర్తి కోరగా, ఇంకా రాలేదని చెప్పారు. ఉత్తర్వులు వచ్చాకే విచారణ జరుపుతామంటూ మధ్యాహ్నం 2:30కి వాయిదా వేశారు.  

సిట్‌పై తేల్చాల్సింది ఈ ధర్మాసనమే.. 
తిరిగి విచారణ ప్రారంభం సందర్భంగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీని ఏజీ న్యాయమూర్తికి అందజేశారు. ‘సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి­నా సంతోష్‌ విచారణకు హాజరుకాలేదు. బీఎల్‌ సంతోష్‌ తరఫున న్యాయవాదులెవరూ ప్రాతినిధ్యం వహించడం లేదు. ఈ నెల 19న అరెస్టు చేయకూడదని ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సిట్‌ స్వతంత్రంగా, స్వేచ్ఛగా విచారణ సాగించే వెసులుబాటు కల్పించాలి’ అని ఏజీ విజ్ఞప్తి చేశారు. విచారణ కోసమే 41ఏ నోటీ సులు ఇచ్చామని చెప్పి.. ఇప్పుడు అరెస్టు చేయకూడదన్న ఆదేశాలు రద్దు చేయాలని కోరడం సరికాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. బీజేపీ కీలక నేత అయిన సంతోష్‌ను అరెస్టు చేస్తే.. దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చిదంబరేశ్‌ నివేదించారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఏజీ బదులిచ్చారు.

సిట్‌ దర్యాప్తును సింగిల్‌ జడ్జి పర్యవేక్షించాలని డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసిందని మహేశ్‌ జఠ్మలానీ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సిట్‌ భవితవ్యాన్ని తేల్చే అధికారం ఈ ధర్మాసనానిదేనని చెప్పారు. సిట్‌ ఉండాలా?. వద్దా ? కొత్త సిట్‌ను ఏర్పాటు చేయాలా? లేదా సీబీఐకి బదిలీ చేయాలా?.. ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ ఈ ధర్మాసనానికి ఉందన్నారు. హైకోర్టు జడ్జి దర్యాప్తును పర్యవేక్షించగలరా? అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు జఠ్మలానీ బదులిస్తూ.. పర్యవేక్షించవచ్చని.. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముగ్గురు నిందితులు గురువారం హైకోర్టులో బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. సంతోష్‌కు మళ్లీ నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. 

సిట్‌ వేధిస్తోంది: శ్రీనివాస్‌  
విచారణ పేరుతో సిట్‌ అధికారులు వేధిస్తున్నారని పేర్కొంటూ న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌ హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రతిరోజూ తమ ఎదుట హాజరుకావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ నెల 25న సిట్‌ ఎదుట హాజరైతే సరిపోతుందని తెలిపింది. అలాగే తనకు సిట్‌ సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇవ్వడంపై అంబర్‌పేటకు చెందిన హైకోర్టు న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సింహయాజీ స్వామితో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వేధిస్తున్నారని, ఈ నోటీసులను కొట్టేయాలని కోరారు.

ఇదీ చదవండి: రెండో రోజూ ఐటీ వేట: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో కొనసాగిన దాడులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement