డిప్యుటేషన్‌ ఇష్టారాజ్యం.. నచ్చినవారికి ఎక్కడంటే అక్కడే! ఫిర్యాదుకు రెడీ? Telangana Treasury And Accounts Department Deputation Issues | Sakshi
Sakshi News home page

డిప్యుటేషన్‌ ఇష్టారాజ్యం.. ఇదేమని ప్రశ్నిస్తే ఆకాశ రామన్నల ఫిర్యాదులు తెరపైకి!

Published Wed, Aug 10 2022 8:55 AM | Last Updated on Wed, Aug 10 2022 9:42 AM

Telangana Treasury And Accounts Department Deputation Issues - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌లో డిప్యుటేషన్లకు సంబంధించి ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలే ఫైనల్‌. ఉద్యోగులు ఇదేమని ప్రశ్నిస్తే దశాబ్దాల క్రితం వచ్చిన ఆకాశ రామన్నల ఫిర్యాదులను మళ్లీ తెరమీదకు తెస్తామంటూ హెచ్చరిస్తుంటారు. డిప్యుటేషన్ల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అన్ని ఆధారాలతో ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

అందులో డిప్యుటేషన్లకు సంబంధించి వికలాంగులు, మహిళలు, తీవ్ర అనారోగ్య సమ­స్యలున్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న నిబంధనలున్నా అవేవి పట్టించుకోకుండా అస్మదీ­యులకు మాత్రమే కోరుకున్నచోట డిప్యుటేషన్‌ ఇచ్చారని పేర్కొంటున్నారు. ఉమ్మడి మహబూ­బ్‌నగర్‌ జిల్లాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తాను అంగవైకల్యంతో బాధపడుతున్నానని, ఒకరోజు విధులకు వెళ్లి వస్తే మూడురోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోందని, దూరభారంతో ఇబ్బంది పడుతున్నానని, అందుకే డిప్యుటేషన్‌ ఇవ్వాలని వేడుకున్నా కనికరించలేదు. ఎలాంటి ఇబ్బందిలేని ఓ అధికారికి మాత్రం వైరా నుంచి ఖమ్మం జిల్లాకేంద్రానికి డిప్యుటేషన్‌ ఇచ్చారు.

కుటుంబసభ్యుల అనారోగ్యం కారణంగా మంచిర్యాల నుంచి క్లియర్‌ వేకెన్సీ ఉన్న వైరాకు డిప్యుటేష¯న్‌ ఇవ్వాలని కోరితే కనీస స్పందన లేదని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌లో పనిచేస్తున్న మరో అవివా­హిత ఉద్యోగి క్లియర్‌ వేకెన్సీ ఉన్న సంగారెడ్డికి డిప్యుటేషన్‌పై పంపాలని చాలాకాలంగా వేడుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారు. మానవతాదృక్పథంతో డిప్యుటేషన్లు పరిశీలించి చర్య తీసుకోవాలని ఆర్థికమంత్రి పేషీ సిఫారసు చేసినా డైరెక్టరేట్‌లో మాత్రం బుట్టదాఖల­వుతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
(చదవండి: ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారా?.. ఈ నియమాలు తప్పనిసరి..)

సిమ్‌కార్డుల పితలాటకం
తరచూ సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ను మారుస్తుండటం సిబ్బందికి ఇబ్బందిగా మారింది. తాజాగా మరో కంపెనీకి సెల్‌ నెట్‌వర్క్‌ను మార్చటంతో గ్రామీణప్రాంతాలు, కార్యాలయ ఆవరణల్లోనూ సిగ్నల్స్‌ రాకపోవటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం కార్యాలయాలకు రాగానే విధుల్లో లాగిన్‌  కావాలంటే వారి సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీయే ఆధారం. కానీ, ఓటీపీ వచ్చేందుకు గంటల సమయం పడుతుండటంతో ఒక్కపూట మొత్తం అవస్థలు పడుతున్నామని, సర్వీసులకు తీవ్ర అంత­రాయం ఏర్పడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమకు సీనియర్‌ ఐఏఎస్‌ అండ ఉందన్న ధీమాతో నిబంధనలన్నీ బేఖాతర్‌ చేస్తున్న ఉన్నతాధికారుల తీరుపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, ఆపై ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించాలని ఉద్యోగులు, సంఘాలనేతలు భావిస్తున్నారు. రూ.23.8 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను స్వాధీనం చేసుకోకపోవటం, కొత్త కంప్యూటర్ల మొరాయింపు అంశంపైనా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు.  
(చదవండి: పేదల భూములను లాక్కునేందుకే కేసీఆర్‌ ధరణి పోర్టల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement