విదేశాలకు వెళ్లాలా? వద్దా? | Students Confused by Delay in Foreign Scholarship Eligibility | Sakshi
Sakshi News home page

విదేశాలకు వెళ్లాలా? వద్దా?

Published Mon, Apr 1 2024 1:56 AM | Last Updated on Mon, Apr 1 2024 1:56 AM

Students Confused by Delay in Foreign Scholarship Eligibility - Sakshi

విదేశీ విద్యానిధి అర్హతలు జాప్యమవడంతో అయోమయంలో విద్యార్థులు

ఎన్నికల కోడ్‌తో అర్హుల జాబితా విడుదలకు బ్రేక్‌

కోడ్‌ తర్వాత జాబితా ప్రకటించే యోచనలో బీసీ సంక్షేమ శాఖ

అదేబాటలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సాయం అందించే ఓవర్సీస్‌ విదేశీ విద్యానిధి పథకాల లబ్ధిదారుల ఖరారు అంశం పెండింగ్‌లో పడింది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొంతకాలం ఆపేయాలని నిర్ణయించాయి. వివిధ సంక్షేమ శాఖలు క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తుల స్వీకరించడంతోపాటు ఆయా విద్యార్థుల ఒరిజినల్‌ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను సైతం పూర్తి చేశాయి.

మెరిట్‌ ఆధారంగా వడపోసినప్పటికీ అర్హుల జాబితాలను మాత్రం ప్రకటించలేదు. నెలన్నరపాటు వివిధ దశల్లో వడపోత చేపట్టినా... సకాలంలో ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదు. ఇదే సమయంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు ఒక్కసారిగా ఈ ప్రక్రియను నిలిపివేశాయి.

విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన
పార్లమెంటు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి దాదాపు పక్షం రోజులవుతోంది. రాష్ట్రంలో పోలింగ్‌ ప్రక్రియ మే 13తో పూర్తి కానుంది. కానీ దేశవ్యాప్తంగా జూన్‌ 1న ఎన్నికలు ముగియనుండగా, జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అప్పటివరకు కోడ్‌ అమల్లో ఉంటుంది. అప్పటివరకు విదేశీ విద్యానిధి పథకం లబ్ధిదారుల ఎంపిక జాబితా వెలువడే అవకాశం లేదు.

ఈ క్రమంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విదేశీ వర్సిటీల్లో ఏప్రిల్‌ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే సంక్షేమ శాఖలు ఓవర్సీస్‌ విద్యానిధి లబ్ధిదారుల ఎంపికను జనవరిలోనే మొదలుపెడతాయి.

దరఖాస్తుల స్వీకరణ, ధ్రువపత్రాల పరిశీలన, ఇతర ప్రక్రియ పూర్తి చేసి మార్చి మొదటి వారంలో లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేసేది. కానీ ఈ దఫా అర్హుల జాబితా విడుదలలో జాప్యం జరిగింది. విదేశీ విద్యానిధి సాయం వస్తుందన్న ఆశతో వందల సంఖ్యలో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. 

అప్పు చేసి మరీ...
ఈ పథకం కింద అర్హత సాధిస్తేనే ఉన్నత విద్యలో చేరేందుకు సిద్ధమయ్యే పరిస్థితి ఉండగా... ఇప్పుడు పథకం కింద లబ్ధి చేకూరుతుందా? లేదా? అనే గందరగోళం అభ్యర్థుల్లో నెలకొంది. దీంతో విదేశాలకు వెళ్లాలా? వద్దా? అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మరికొందరు మాత్రం అర్హత సాధిస్తామనే ధీమాతో అప్పు చేసి మరీ విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

విమానం టికెట్లు బుక్‌ చేసుకుని గడువులోగా యూనివర్సిటీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఓవర్సీస్‌ విద్యానిధి కింద బీసీ సంక్షేమ శాఖ ద్వారా 300 మందికి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల నుంచి 350 మందికి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 500 మందికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఉన్నత విద్యా కోర్సు పూర్తి చేసే వరకు రూ.20 లక్షలు రెండు వాయిదాల్లో ఇస్తారు. ఈ మొత్తాన్ని సదరు విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement