నృసింహస్వామి పెళ్లికొడుకాయెనే..  | Shri Swami Kalyanotsava tonight in Yadagirigutta | Sakshi
Sakshi News home page

నృసింహస్వామి పెళ్లికొడుకాయెనే.. 

Published Mon, Mar 18 2024 2:30 AM | Last Updated on Mon, Mar 18 2024 2:30 AM

Shri Swami Kalyanotsava tonight in Yadagirigutta - Sakshi

యాదగిరిగుట్టలో వైభవంగా స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం

నేటి రాత్రి శ్రీస్వామి కల్యాణోత్సవం 

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి శ్రీస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవాన్ని ఆలయ ఆచార్యులు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవంగా జరిపించారు. ఉదయం ప్రధానాలయ మాడ వీధుల్లో శ్రీస్వామి వారు జగన్మోని అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఇక సాయంత్రం శ్రీస్వామి వారు అశ్వవాహనంపై పెండ్లి కొడుకుగా, ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై అమ్మవారిని సేవోత్సవంగా ఆలయ మాడవీధిలో ఊరేగించారు. అనంతరం ఆచార్యులు, అధికారులు స్వామి వారి పక్షాన, అమ్మవారి పక్షాన చేరి గుణగణాలను చర్చించుకున్నారు. శ్రీనృసింహస్వామికి లక్ష్మీ దేవితో వివాహం జరిపేందుకు ముహూర్తాన్ని ఆచార్యులు నిర్ణయించారు.  

గజవాహనంపై కల్యాణోత్సవానికి.. 
తిరుకల్యాణోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి 8.45 గంటలకు గజవాహనంపై శ్రీస్వామి, ప్రత్యేక పల్లకిపై అమ్మవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ 9.15 గంటలకు ఉత్తర దిశలోని రథశాల ముందు ఏర్పాటు చేసిన కల్యాణ మండపానికి చేరుకుంటారు.

ఆ తరువాత శ్రీస్వామి, అమ్మవార్ల కల్యాణ వేడుకను ఆచార్యులు, వేద పండితులు పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో ప్రారంభిస్తారు. తుల లగ్న ముహూర్తంలో రాత్రి 9.37 గంటలకు శ్రీస్వామి వారు అమ్మవారికి మాంగళ్యధారణ చేయనున్నారు. ఇక ఉదయం శ్రీస్వామి వారు శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై ఊరేగనున్నారు.

యాదాద్రీశుడి కల్యాణానికి టీటీడీ పట్టువ్రస్తాలు 
శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణోత్సవాలకు టీటీడీ తరఫున ఆదివారం పట్టు వస్త్రాలను అందజేశారు. ఉదయం టీటీడీకి చెందిన ఉప కార్యనిర్వహణాధికారి లోకనాథం మేల్చాట్‌ పట్టు వ్రస్తాలను తీసుకొని, ఆలయ మాడ వీధిలో ఊరేగింపుగా వచ్చారు.జగన్మోహిని అలంకార సేవ ముందు పట్టు వస్త్రాలను ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులకు అందజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement