సెల్ఫీ జోష్‌.. డేంజర్‌ బాస్‌ Selfie deaths: Last year 190 deaths were recorded across the country | Sakshi
Sakshi News home page

సెల్ఫీ జోష్‌.. డేంజర్‌ బాస్‌

Published Mon, Jun 17 2024 6:16 AM

Selfie deaths: Last year 190 deaths were recorded across the country

నగరంలో పెరిగిపోతున్న సెల్ఫీల క్రేజ్‌

కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్న యువత

గతేడాది దేశవ్యాప్తంగా 190 మరణాల నమోదు

హైదరాబాద్‌లోనూ అధిక సంఖ్యలో ఘటనలు

ఇతరులకు ఇబ్బందిగా మారుతున్న వైనం

సైబర్‌ నేరగాళ్లకూ ఉపకరిస్తున్న ఈ తరహా ఫొటోలు

పలు జాగ్రత్తలు సూచిస్తున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: సెల్ఫీ.. బాగా ప్రాచుర్యం పొందిన, ఎవరికి వారు స్వయంగా తీసుకునే సెల్‌ ఫోన్‌ ఆధారిత ఫొటో. దీనికోసం ప్రత్యేక సెల్‌ ఫోన్లు, స్టిక్కులతో పాటు కోర్సులు కూడా అందు బాటులోకి వచ్చాయంటేనే వాటికి ఉన్న క్రేజ్‌ అర్థం చేసుకో వచ్చు. ముఖ్యంగా కొంతమంది యువ తలో ఈ క్రేజ్‌ విపరీత స్థాయిలో ఉంటోంది. అయితే ఈ క్రేజ్‌ కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలనే హరి స్తోంది. ఈ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నాల్లో అనేక మంది ప్రమాదాలకు గురై చనిపోతున్నారు.

ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు అధిక సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. దేశంలో గత ఏడాది సెల్ఫీ సంబంధిత మరణాలు 190 నమోద య్యాయి. తీవ్రంగా గాయపడిన ఉదంతాలు 55 చోటు చేసుకున్నట్లు వికీపీడియా గణాంకాలు చెప్తు న్నాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రమాదాలు భారత్‌లోనే ఎక్కువని స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ ఇలాంటి మరణాలు ఎక్కువ గానే జరుగుతున్నాయి. నగరంలో 2016లో తొలి సెల్ఫీ డెత్‌ నమోదైంది. జూ పార్క్‌లో సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో కాలుజారి పడటంతో జియాగూడ వాసి మంజీత్‌ చౌదరి కన్నుమూశాడు.

2024 జనవరి 7
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాలుడు (16) అల్వాల్‌లో ఉంటున్న తన బాబాయి ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు. ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఈ బాలుడు బొల్లారం బ్యారెక్‌ సమీపంలోని రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్దకు చేరుకున్నాడు. వెనుక నుంచి రైలు వస్తుండగా సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే రైలు దూసుకు రావడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

2024 జనవరి 29
హైదరాబాద్‌ బహదూర్‌పురకు చెందిన అబ్దుల్‌ రెహ్మాన్‌ (23) అబిడ్స్‌ లోని కళ్లజోళ్ల దుకాణంలో పనిచేస్తు న్నాడు. తనస్నేహితులతో కలిసి ఉప్పుగూడ–యాకత్‌పుర రైల్వే స్టేష న్ల మధ్య రైల్వే ట్రాక్‌ల వద్దకు వెళ్లా డు. అక్కడ సెల్ఫీ తీసుకునే ప్రయ త్నాల్లో రైలు పట్టాల మీదకు చేరుకు న్నాడు. అదే సమయంలో దూసుకు వచ్చిన ఎంఎంటీఎస్‌ ఢీ కొట్టడంతో తీవ్రగాయాలతో చనిపోయాడు.

2024 ఏప్రిల్‌ 5
ఏపీకి చెందిన ఎస్‌.అనిల్‌ కుమార్‌ (27) భార్యతో కలిసి హైదరా బాద్‌లోని మాదాపూర్‌లో ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అర్ధ రాత్రి వేళ తన స్నేహితుడు అజ య్‌తో కలిసి కేబుల్‌ బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. తమ ద్విచక్ర వాహనాన్ని వంతెనపై నిలిపిన ఈ ద్వయం సెల్ఫీలు తీసుకుంటోంది. ఇంతలో ఇనార్బిట్‌ మాల్‌ వైపు నుంచి వచ్చిన కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన అనిల్‌ చికిత్స పొందుతూ అసువులు బాశాడు.

2024 జూన్‌ 15
హైదరాబాద్‌కు చెందిన ఉదయ్‌కుమార్‌ (17), శివదీక్షిత్‌ (17) మరో బాలుడు (17) ఇంటర్‌ పూర్తి చేశారు. బాలుడి పుట్టినరోజు కావడంతో శుక్రవారం అర్ధరాత్రి కేకుకోసిన అనంతరం మాదాపూర్‌ కేబుల్‌ బ్రిడ్జికి బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున 2.18 ప్రాంతంలో ముగ్గురూ స్కూటీపైనే ఉండి రీల్స్‌ చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. ఉదయ్, దీక్షిత్‌ అక్కడిక్కడే మరణించగా.. బాలుడు గాయపడ్డాడు.  

అత్యుత్సాహంతోనే చేటు..
సెల్‌ఫోన్లు వచ్చినప్పటి నుంచే ఈ సెల్ఫీల జాఢ్యం మొదలవలేదు. ఎప్పుడైతే వాటిల్లో ఫ్రంట్‌ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయో అప్ప ట్నుంచీ సెల్ఫీ క్రేజ్‌ ప్రారంభమై, క్రమంగా మంచి రెజుల్యూషన్‌ (ఫొటో స్పష్టంగా కన్పిస్తుంది)తో కూడిన ఫొటోలు వచ్చే ఫ్రంట్‌ కెమెరాలు కూడా వస్తుండటంతో ఈ సెల్ఫీల పిచ్చి మరింత ముదిరి పోయింది. సెల్ఫీ మోజులో ఉంటున్న వారిలో ఎక్కువగా యువతే ఉంటు న్నారు. ఏదో రకంగా విభిన్నమైన సెల్ఫీని తీసుకో వాలనే తాపత్రయంలో ప్రమాదకర పరిస్థితుల్ని పట్టించుకోకుండా సెల్ఫీలు దిగేందుకు ప్రయత్ని స్తున్నారు. వెనుక నుంచి రైలు వస్తుండగానో, వాహనాలు డ్రైవ్‌ చేస్తూనో, జలపాతాల వద్దో, బీచ్‌ ల్లోనో, ఎత్తైన ప్రదేశాల్లోనో సెల్ఫీలకు ప్రయత్నిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.

సోషల్‌ మీడియా ప్రాచుర్యం పొందిన తర్వాత..
ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియాలు ప్రాచుర్యం పొందిన తర్వాత సెల్ఫీ ఫీవర్‌ మరింత ఎక్కువైంది. ఆయా సోషల్‌ మీడియాల్లో ఎవరి ప్రొఫైల్‌ పిక్‌ చూసినా, అప్‌లోడ్‌ చేసిన ఫొటోలు పరిశీలించినా సగానికి సగం సెల్ఫీలే కనిపిస్తు న్నాయి. ఒకరిని చూసి మరొకరు, ఒకరి ప్రొఫైల్స్‌ చూసి ఇంకొకరు... ఇలా అంతా సెల్ఫీల బాటపడుతున్నారు. ఇటీవలి కాలంలో వీటితో పాటు రీల్స్‌ (షార్ట్‌ వీడియోలు) కూడా సోషల్‌ మీడియాల్లో ఎక్కువగా కన్పిస్తుండటం గమనార్హం. మరోపక్క ఈ సెల్ఫీలను మార్ఫింగ్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడే సైబర్‌ నేరాలు పెరుగుతుండటం గమనార్హం.

‘నో పార్కింగ్‌’ తరహాలో..
ప్రజల్లో ముఖ్యంగా యువతలో మితిమీరి పోతున్న ఈ సెల్ఫీ పిచ్చి ప్రభుత్వ విభాగాలకూ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ నేప థ్యంలోనే ‘నో పార్కింగ్‌’ ప్రాంతాల తరహాలో మహారాష్ట్రలో ‘నో సెల్ఫీ’ ప్రాంతాలు అమల్లోకి వచ్చాయి. కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన కుంభ్‌మేళాలో సెల్ఫీ ప్రియుల కారణంగా అనేక ప్రాంతాలు ఇరుకైన ప్రదేశాలుగా మారిపోయి ఇతరులకు ఇబ్బందులు కలిగించాయి. ఆయా ప్రాంతాలను దాటి వెళ్లడానికి భక్తులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో కుంభమేళాను అధికారులు ‘నో సెల్ఫీ జోన్‌’గా ప్రకటించాల్సి వచ్చింది. సెల్ఫీలను నిరోధించడం కోసం ముంబై పోలీసులు నగరంలోని 16 ప్రాంతాలను ‘నో సెల్ఫీ జోన్స్‌’గా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ సైతం ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యలు హైదరాబాద్‌లోనూ తీసుకోవాలనే అభిప్రాయంగా గట్టిగా వ్యక్తమవుతోంది.

సెల్ఫీకి ముందు సప్త ప్రశ్నలు
సెల్ఫీలు, రీల్స్‌ వల్ల ప్రమాదాలకు గురికాకుండా ఉండటం, అవి ఇతరులకు ఇబ్బందికరంగా మారకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికి వారు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 
1. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతాల్లో ఫొటోగ్రఫీకి అనుమతి ఉందా?
(మ్యూజియాలు, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, విద్యా సంబంధ వ్యవహారాల్లో)
2. ఈ ప్రదేశంలో సెల్ఫీ కారణంగా తనకు కానీ తన చుట్టు పక్కల వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉందా? (జూ పార్కులు, థీమ్‌ పార్కులు, జనసమ్మర్థ ప్రాంతాలు, మాల్స్, సబ్‌వేస్, విమానా శ్రయాలు, రైల్వే ట్రాక్‌లు, వాహనాలు నడుపుతూ)
3. సెల్ఫీ తీసుకుంటూ నేను ఎదుటివారు చూస్తున్న వాటికి అడ్డం వస్తున్నానా? ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగిస్తున్నానా? (థీమ్‌ పార్కులు, సినిమా హాళ్లు, సందర్శనీయ ప్రాంతాలు, కొన్ని కార్యక్రమాలు)
4. సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో మరో వర్గా నికి చెందినవారి మనోభావాలు దెబ్బతీస్తు న్నామా? (ప్రార్థనా స్థలాలు)
5. సెల్ఫీ తీసుకుంటున్న ప్రాంతంలో కంటికి కనిపించని ముప్పు పొంచి ఉందా?
(జూ పార్క్‌లు, జాతీయ పార్కులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎత్తైన భవనాలు/ప్రాంతాలు, ఓడలు, సబ్‌ వేస్, కదులుతున్న వాహనాలు, రహదారులు)
6. సెల్ఫీ తీసుకోవడం సమంజసమేనా?
(ప్రమాదం జరిగిన ప్రాంతాలు, అంతిమ యాత్రలు)
7. నేను తీసుకుంటున్న సెల్ఫీ ఇతరులకు అభ్యంతకరం అవుతుందా?
(పార్టీలు, రెస్ట్‌రూమ్స్‌ సమీపంలో, బీచ్‌ల్లో)

Advertisement
 
Advertisement
 
Advertisement