రాష్ట్రంలో ‘ష్నైడర్‌’ రెండో ప్లాంట్‌ Schneiders Second Plant To Be Established In Telangana | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ వద్ద ఏర్పాటు చేయనున్న  ఫ్రాన్స్‌ దిగ్గజ సంస్థ

Published Fri, Sep 30 2022 4:46 AM | Last Updated on Fri, Sep 30 2022 2:56 PM

Schneiders Second Plant To Be Established In Telangana - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విద్యుత్‌ పరికరాల తయారీ, ఆటోమేషన్‌ రంగంలో ఉన్న ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ తెలంగాణలో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. శంషాబాద్‌ వద్ద 18 ఎకరాల్లో ఇది రానుంది. రూ. 300 కోట్ల వ్యయంతో చేపడుతున్న తొలి దశ 2023 సెప్టెంబర్‌కు సిద్ధం అవుతుంది. ఉత్పత్తుల తయారీకి స్మార్ట్‌ యంత్రాలు, ఉపకరణాలను ఉపయోగించనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. కొన్ని ఉత్పత్తులను దేశంలో తొలిసారిగా శంషాబాద్‌ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. 30కిపైగా దేశాలకు ఇక్కడ తయారైన సరుకు ఎగుమతి చేస్తారు. భారత్‌లో సంస్థకు ఇది 31వ కేంద్రం కాగా తెలంగాణలో రెండవది. స్మార్ట్‌ ఫ్యాక్టరీలపరంగా కంపెనీకి దేశంలో ఇది ఎనిమిదవది కానుంది.

అత్యంత స్మార్ట్‌ ఫ్యాక్టరీ..
భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి ఎమాన్యుయల్‌ లెనిన్‌తో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ష్నైడర్‌ ప్రతిపాదిత నూతన కేంద్రానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కొత్త ప్లాంటు మూడు దశలు పూర్తి అయితే 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. భారత్‌లో కంపెనీకి ఇది అతిపెద్ద, అత్యంత స్మార్ట్‌ ఫ్యాక్టరీ అవుతుందని చెప్పారు. 75 శాతం ఉత్పత్తులు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయని వివరించారు. స్మార్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాల్సిందిగా కంపెనీ ప్రతినిధులను ఆయన కోరారు.

టాప్‌–3లో భారత్‌..
ష్నైడర్‌కు ప్రపంచంలోని టాప్‌–3 మార్కెట్లలో భారత్‌ ఒకటి. సంస్థ కార్యకలాపాల్లో 10 శాతం వాటాను కైవసం చేసుకుంది. 77% ఉత్పత్తులు, సొల్యూషన్స్‌ భారత్‌లో అభివృద్ధి చేసినవేనని సంస్థ ఇండియా ప్రెసిడెంట్‌ అనిల్‌ చౌదరి వెల్లడించారు. ‘భారత్‌లో విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో 90% దేశీయంగా తయారైనవి. ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ విద్యుత్‌ పరికరాలను ఇప్పటికే సరఫరా చేస్తున్నాం. చార్జింగ్‌ స్టేషన్లను సొంతంగా ఏర్పాటు చేస్తాం. శంషాబాద్‌ ఫెసిలిటీకి మూడు దశల్లో కలిపి 4–5 ఏళ్లలో రూ.900 కోట్ల దాకా పెట్టుబడి పెడతాం’ అని చౌదరి వివరించారు.

భారత్‌లోనే అధికం..
ఇప్పటికే హైదరాబాద్‌లో ష్నైడర్‌కు తయారీ యూనిట్‌ ఉంది. ఈ ప్లాంటులో రెండు వేల మంది పనిచేస్తున్నా రు. శంషాబాద్‌ కేంద్రం రాకతో తొలిదశలో ప్రత్యక్షంగా వెయ్యిమందికి, పరోక్షంగా 8 వేలమందికి ఉపాధి అవ కాశాలు ఉంటాయని గ్లోబల్‌ సప్లై చైన్‌ ఎస్‌వీపీ జావెద్‌ అహ్మద్‌ తెలిపారు. భారత్‌లో సంస్థ ఉద్యోగుల సంఖ్య 35 వేలు. వారిలో 5,500 మంది సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ష్నైడర్‌లో 1.60 లక్షల మంది పనిచేస్తుండగా భారత్‌లోనే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తుండటం విశేషం. 

హైదరాబాద్‌లో ‘హౌస్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌’ 
తెలంగాణ, ఫ్రాన్స్‌ నడుమ వాణిజ్య సంబంధాలు, రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘హౌస్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌’ పేరిట కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రకటించడాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు. 2023 అర్ధభాగంలో కొత్త ఫ్రెంచ్‌ బ్యూరో పనిచేయడం ప్రారంభిస్తుందని, ఇది వాణిజ్య కార్యకలాపాల కేంద్రంగా పనిచేయడంతోపాటు కాన్సులార్, వీసా సేవలను కూడా అందిస్తుందన్నారు.

తద్వారా తెలంగాణ విద్యార్థులు, బిజినెస్‌ వర్గాలకు ఫ్రాన్స్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతాయన్నారు. ఫ్రెంచ్‌ బిజినెస్‌ మిషన్‌  బృందం గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, పారిశ్రామిక విధానాలు, సాధించిన విజయాలు, పెట్టుబడి అవకాశాలపై కేటీఆర్‌ ఆ బృందానికి వివరించారు. ఈ భేటీలో ఫ్రెంచ్‌ బృందం ప్రతినిధులు పాల్‌ హెర్మెలిన్, గెరార్డ్‌ వోల్ఫ్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇ. విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement