గ్లూమీ.. గ్లూమీ సార్లు మస్తుగున్నరు | Sarikonda Chalapathi Political Satire Article On Cloudburst | Sakshi
Sakshi News home page

గ్లూమీ.. గ్లూమీ సార్లు మస్తుగున్నరు

Published Sat, Jul 23 2022 5:31 PM | Last Updated on Sat, Jul 23 2022 5:39 PM

Sarikonda Chalapathi Political Satire Article On Cloudburst - Sakshi

ఇప్పుడు మనం ఓ గాడిద కథ చెప్పుకుందాం.. ప్రాచీన గ్రీసు దేశంలో డెమాస్తనీస్‌కు మహావక్తగా మంచి పేరుండేది. ఆయనోసారి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పన్నులు.. ఇలా చెప్తుంటే జనంలో కాస్త అలజడి, గందరగోళం కనిపించాయి. వాళ్ల అనాసక్తి గ్రహించిన డెమాస్తనీస్‌.. వెంటనే ప్రసంగం ఆపి మీకు ఒక కథ చెబుతాను వినండి అంటూ మొదలుపెట్టాడు.

‘‘ఇద్దరు వ్యక్తులు వేసవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒకడి దగ్గర గాడిద ఉంది. మరొకడికి దాని అవసరం ఉంది. దాన్ని అమ్ముతావా అని అడిగాడు. ఇద్దరూ మాట్లాడు కున్నారు. బేరం కుదిరింది. అమ్మకం అయిపోయింది..

వారు వాళ్ల ప్రయాణం కొనసాగిస్తున్నారు. అసలే వేసవి ఎండ ఎక్కువగా ఉండి.. ఓ దగ్గర ఆగారు. గాడిద నిలబడి ఉండగా దాని నీడలో అమ్మిన వ్యక్తి కూర్చున్నాడు. కొన్నా యనకు మండుకొచ్చింది. కొనుక్కున్న నేను ఎండలో ఉండాలి అమ్మినవాడు నీడలోకూర్చుంటాడా? అని ఆర్గ్యు చేశాడు. ‘నువ్వు లే నేను కూర్చుంటా’నని గదమాయించాడు.
చదవండి: తెలంగాణ సర్కార్‌ మరో కీలక నిర్ణయం..

అమ్మిన వ్యక్తి బాగా తెలివైన వాడు.. ‘నేను గాడిదను అమ్మాను గానీ నీడను కాదు.. నీడ నాదే..’ అంటూ తన లాజిక్‌ వదిలాడు.. ఇంకేం తగువు మొదలైంది. నలుగురూ చుట్టూ చేరారు. వాదులాట పెరిగింది. గాడిద–నీడ సమస్య పరిష్కరించడంలో అందరూ మునిగిపోయారు’’ అని చెప్పడం ఆపేశాడు డెమాస్తనీస్‌. వింటున్న జనంలో ఆసక్తి మొదలైంది. వాళ్లలో వాళ్లు గాడిద గొడవపై మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ పరిష్కారమేమైంది? ఏం తేల్చారు? అని డెమాస్తనీస్‌ను అడగడం మొదలుపెట్టారు.

అసలు తమ బతుకు సంగతి చెబితే పట్టని జనం గాడిద గొడవ చర్చించడం చూసి డెమాస్తనీస్‌ నవ్వి ఊరుకున్నాడు. ఆ గాడిద గొడవ తేలేది కాదు కాబట్టి,  మనమూ వదిలేద్దాం.

జనాన్ని మనకు అనుకూలమైన చర్చ వైపు నెట్టడమే కదా.. మంచి వక్త నేర్పరితనం. చుట్టూ వరదలున్నా గ్లూమీ.. గ్లూమీ సమాచారంతోనైనా మనకు ఇష్టమైన దారిలోకి ‘మంద’ను మళ్లించడమే కదా.. అసలైన పొలిటీషియన్‌ టెక్నిక్‌.. చర్చ గాడిదల వైపు కావచ్చు.. విదేశీ కుట్రల వైపూ కావచ్చు.. జనం ‘కళ్ల నిండా కాళేశ్వరం’ చూసి కంగారు పడో, కడుపు మండో ‘విదేశీ కుట్ర’ అని ఒక మాట అనరా.. బరాబర్‌ అంటారు ఆయన.. ఇంకా ‘విదేశీ కుట్ర’ అన్నారాయన. ఈ విషయంలో సొంత ప్రభుత్వంపైన అనుమానాలున్నవారు కూడా ఉన్నారు. ఇట్లా రండి అలా సోషల్‌ మీడియాలో దూరుదాం..

సిడ్నీ.. స్వదేశీ కుట్ర
కొద్దిరోజుల క్రితం.. సిడ్నీలో భారీ వర్షాలు పడ్డాయి. ఎంతగా అంటే ఎనిమిది నెలల వర్షం నాలుగు రోజుల్లో దంచేసింది. సహజంగానే పెను నష్టం వాటిల్లింది. ఇంకేం రకరకాల సిద్ధాంతాలు నిద్ర లేచాయి. ప్రభుత్వం చేపట్టిన ‘క్లౌడ్‌ సీడింగ్‌’ దానికి కారణమని ప్రచారమైంది. ఆ స్థాయిలో వర్షాలు తెచ్చే క్లౌడ్‌ సీడింగ్‌ భౌతికంగా, ఆర్థికంగా సాధ్యం కాదని గవర్నమెంట్‌ చెప్పినా.. అ వాయిస్‌ జనానికి చేరేలోపు.. లక్షల్లో వ్యూస్‌ నమోదయ్యాయి. రాడార్‌ చిత్రాలు, మేఘాలలో వింత ఆకారాల ఫొటోలు.. విమానం ఎగరడాలు.. ఇలా ఏవేవో ఆధారాలు చూపుతూ.. అది ప్రభుత్వం ప్రజలపై వేసిన ‘వెదర్‌ బాంబే..’ అనేయడం మొదలుపెట్టారు. ఇదంతా న్యూస్‌ చానళ్లలో, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. వాతావరణ నిపుణులు శాస్త్రీయ కారణాలు చెప్పినా ఎవరూ వినలేదు.. అంతా అధికార పక్షం చేసినదేంటూ ఢంకా బజాయించారు... దీనికన్నా మనం విన్న ‘విదేశీ కుట్రే’ నయం కదా..

థాయ్‌లాండ్‌.. వరద రాజకీయాలు
2011లో ఇక్కడ వచ్చిన వరదలు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ‘నష్టం’గా పేర్కొంటారు. జూలై నుంచి అక్టోబర్‌ వరకు వరదలు కొనసాగాయి. జనవరి 2012 వరకు కూడా అక్కడక్కడా కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఆ వరదల ప్రభావం ఎంతో. ఆ వరదలు బ్యాంకాక్‌ను కూడా చుట్టుముట్టాయి. 20వేల చదరపు కిలోమీటర్ల మేర పంట పొలాలు నీట మునిగాయి. 13.6 మిలియన్ల జనాభా ముంపు ప్రభావానికి లోనయింది. అనేక పరిశ్రమలు నీట మునిగాయి. లక్షన్నరకుపైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆర్థికంగా జరిగిన నష్టం 46.5 బిలియన్‌ డాలర్లు..

ఇంత విధ్వంసానికి కారణం ‘ప్రకృతి ప్రకోపం’ అన్న పాయింట్‌ పక్కకుపోయింది.. చర్చలన్నీ రాజకీయం చుట్టే తిరిగాయి. ఎందుకంటే అచ్చంగా ఎన్నికల ప్రచార సమయంలో వరదలు వచ్చాయి.

‘తాము ఎలాగూ ఓడిపోతామని తెలిసిన అధికార పక్షం డ్యాములను ఖాళీ చేయకుండా ఊరుకుందనీ.. తర్వాత వానలతో డ్యాములన్నీ నిండా మునిగి ఊర్లకు ఊర్లు నీటిలో కొట్టుకుపోయాయని విపక్షం వాదనకు దిగింది.
‘వరదల పెను నష్టంతో రానున్న ప్రభుత్వానికి ఊపిరి ఆడకుండా చేయాలని.. రాజకీయంగా తమను, ఆర్థికంగా ప్రజలను కుదేలు చేయాలనే కుట్రతోనే ఇదంతా జరిగిందని..’ ప్రతిపక్షం గగ్గోలు పెట్టింది.

కొన్నేళ్ల పాటు ఆ దేశంలో ఈ చర్చ జరిగింది.. ‘‘అధికార పక్షానికి అంత తెలివి లేదు. వరదలను సరిగ్గా మేనేజ్‌ చేయకపోవడం వల్లే ఈ దురవస్థ’’ అని అక్కడి వామపక్ష మేధావులు చెప్పినా ఎవరూ వినలేదు. విపక్షాలపై కుట్రతోనే తమ ప్రజలకు భారీ నష్టాన్ని కలిగించారని బలమైన వాదన జనంలోకి పోయింది.
..ఇదీ స్వదేశీ వరద రాజకీయమే.

అవకాశం రావాలేగానీ.. వరదలు, విపత్తులు, మహమ్మారులు వేటినీ వదలడం లేదు. కుట్ర కోణాలు, రాజకీయాలు, సొంత అవసరాలు వాటిని అంటుకునే తిరుగుతున్నాయి.
2011లో జపాన్‌లో తారస్థాయిలో వచ్చిన భూకంపం ఏకంగా సునామీనే సృçష్టించింది. 30 అడుగుల ఎత్తుతో అలలు ఎగిసిపడి.. ఫుకుషిమా పవర్‌ ప్లాంట్‌లో ‘అణు’ ప్రమాదానికి దారి తీసింది. ఇదంతా ప్రకృతి విలయంగా ప్రపంచం భావిస్తుండగా.. ‘ఠాట్‌!.. అంతా తప్పు. దీనికి ఇజ్రాయెల్‌ చేసిన అణు విస్పోటనమే కారణమని.. ఇరాన్‌ కోసం çజపాన్‌ యురేనియం శుద్ధి చేయకుండా అడ్డుకునే పనే’నని జపాన్‌లో బాగా నమ్మిన వారున్నారు.

2004లో ఇండోనేసియాలో 9.1–9.3 తీవ్రతతో భూకంపం, సునామీ వచ్చినప్పుడు 14 దేశాల్లో 2,27,000 మందికిపైగా మరణించారు. ఇదంతా అమెరికా అధ్యక్షుడి పనేనని ప్రచారమైంది. తూర్పు ఆసియా ప్రాంత ఆర్థిక ప్రగతిని తగ్గించడానికి అమెరికా చేసిన పనేనని బలంగా నమ్మారు. అక్కడ కనిపించిన అమెరికా యుద్ధనౌకను ఆధారంగా చూపారు. గతంలో ఎప్పుడూ అక్కడ భూకంపాలు రాలేదని నిరూపించే ప్రయత్నం చేశారు.. ఇలాంటి సిద్ధాంతాలకు వందలకొద్దీ ఆధారాలు (?) గుప్పించడం కూడా సామాన్య జనానికి అది నిజమేనని అనిపించేలా చేస్తుంది.

రెండో ప్రపంచ యుద్ధం నాటి అమెరికా అణుబాంబు ఇప్పుడు పేలిందని కొందరు అనుమానాలు వ్యక్తీకరించారు. పాకిస్తాన్‌ టార్గెట్‌గా ఇండియా చేస్తున్న అణు పరీక్షలే దానికి కారణమని మనవైపూ అనుమానంగా చూసినవారూ ఉన్నారు.
.. చివరికి భూమి భ్రమణాన్ని మార్చేందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని నమ్మి ప్రచారం హోరెత్తించిన వారూ ఉన్నారు. ఇలా అనుమానాలు, కుట్ర కోణాల సిద్ధాంతాలు, వాటికి తగిన ఆధారాలను పుంఖానుపుంఖాలుగా జనం నెత్తిన రుద్దేవారెవరూ నిపుణులో, శాస్త్రవేత్తలో కాదు.. గ్లూమీ, గ్లూమీగా విషయం తెలిసినవారే. అప్పటి అవసరాలు, పాలిటిక్స్‌ కోసం జనం ముందుకు తెచ్చినవారే.

ఇది బాగుంది...
శుక్రవారం మళ్లీ వర్షాలు మొదలు కావడంతో సోషల్‌ మీడియాలో కనిపించిన జోక్‌..

ఇది కూడా బాగుంది...
 ఈ మధ్య వరదలు, వ్యాఖ్యలు చూస్తుంటే గుర్తొస్తుందంటూ ఓ మిత్రుడు చెప్పిన కామెంట్‌.. ప్రముఖ అమెరికన్‌ రచయిత, కాలమిస్టు, వక్త, యాక్టివిస్టు జిమ్‌ హైటవర్‌.. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌పై వేసిన చురక ఇది..
‘అజ్ఞానం బ్యారెళ్ల లెక్కన అమ్మే వీలుంటే.. జార్జి బుష్‌ బుర్ర డ్రిల్లింగ్‌ హక్కులు సంపూర్ణంగా నేనే కొనుక్కుంటా..’
.. ఆహా.. నిజమే ఇలాంటి మార్కెట్‌ ఉంటే బాగుండు.. సహజ వనరులున్న బుర్రలు మనకు అనేకం ఉన్నాయి కదా..
-సరికొండ చలపతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement