ఆర్టీసీ.. టార్గెట్‌ మండే RTC has a special focus on revenue raising activities | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ.. టార్గెట్‌ మండే

Published Mon, May 22 2023 3:43 AM | Last Updated on Mon, May 22 2023 9:38 AM

RTC has a special focus on revenue raising activities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా సోమవారాలపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. సోమవారాల్లో వివిధ పనులపై వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రతి సోమవారం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌)ను భారీగా పెంచడం ద్వారా టికెట్‌ ఆదాయం అధికంగా వచ్చేలా చర్యలు ప్రారంభించింది. గత సోమవారం ప్రయోగాత్మకంగా చేసిన కసరత్తు సత్ఫలితం ఇవ్వడంతో ఇక నుంచి ప్రతి సోమవారం ప్రత్యేక కసరత్తు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశించారు.

దీంతో ఈ సోమవారానికి సంబంధించి కూడా ఆదివారం నుంచే కసరత్తు ప్రారంభించారు. డిపోల్లోని స్పేర్‌ బస్సులన్నింటినీ రోడెక్కించడంతోపాటు వీలైనంత వరకు సిబ్బంది సెలవుల్లో లేకుండా చూస్తున్నారు. ఇక సర్వీసులను అటూఇటూ మార్చడం ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాల్లో ఎక్కువ బస్సులు తిప్పేందుకు రూట్లను మారుస్తున్నారు. 

గత సోమవారం 73 డిపోల లాభార్జన 
గత సోమవారం అంటే.. మే 15న ఆర్టీసీకి రికార్డు స్థాయిలో రూ. 20 కోట్ల ఆదాయం టికెట్ల రూపంలో సమకూరింది. గత సంవత్సర కాలంలో సంక్రాంతి ముగిసిన మర్నాడు, హోలీ రోజుల్లోనే ఇలా రూ. 20 కోట్లు చొప్పున ఆదాయం లభించింది. కానీ ఇప్పుడు ఎలాంటి పండుగలు లేకున్నా సాధారణ రోజునే అలా రూ. 20 కోట్ల ఆదాయం రావడం ఆర్టీసీ చరిత్రలో రికార్డే.

మే 15న ట్రాఫిక్‌ రెవెన్యూకు ప్యాసింజర్‌ సెస్, సేఫ్టీ సెస్, టోల్‌ సెస్‌లను కలపడం ద్వారా ఈ మొత్తం రికార్డయింది. టార్గెట్‌ను మించి 116 శాతం ఆదాయం నమోదు కావడం విశేషం. ఆక్యుపెన్సీ రేషియో 79.33 శాతంగా నమోదైంది. అధికారులు చేసిన ప్రత్యేక కసరత్తు వల్ల సాధారణ సోమవారాల్లో వచ్చే ఆదాయం కంటే దాదాపు రూ. 3 కోట్లు అదనంగా వచ్చింది. 96 డిపోలకుగాను ఏకంగా 73 డిపోలు లాభాలను ఆర్జించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement