ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌గా రాజేంద్రనగర్‌ పీఎస్‌కు అవార్డు | Rajendranagar Best Police Station in India: Telangana | Sakshi
Sakshi News home page

ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌గా రాజేంద్రనగర్‌ పీఎస్‌కు అవార్డు

Published Sat, Jan 6 2024 2:30 AM | Last Updated on Sat, Jan 6 2024 2:30 AM

Rajendranagar Best Police Station in India: Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/రాజేంద్రనగర్‌: దేశంలోనే ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌గా 2023కుగాను ఎంపికైన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ (సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌)కు కేంద్ర ప్రభుత్వం అవార్డు అందించింది. శుక్రవారం జైపూర్‌లో జరిగిన అఖిలభారత డీజీపీ, ఐజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ (స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌) బి. నాగేంద్రబాబు ఈ అవార్డు అందుకున్నారు.

దేశవ్యాప్తంగా 17 వేల పోలీస్‌స్టేషన్ల నుంచి ప్రతిపాదనలు వెళ్లగా ఇందులో 74 పోలీస్‌ స్టేషన్లను కేంద్ర హోంశాఖ ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌లుగా ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్‌ చివరి వారంలో కేంద్ర హోంశాఖ వెల్లడించిన అత్యుత్తమ పోలీస్‌ స్టేషన్ల జాబితాలో రాజేంద్రనగర్‌ పీఎస్‌ తొలి స్థానంలో నిలవడం తెలిసిందే.

స్టేషన్‌లో పోలీసులు చేపడుతున్న విధులు, కేసుల నమోదు, వాటి పరిష్కారంలో చూపుతున్న శ్రద్ధ, భార్యభర్తల గొడవల్లో కౌన్సెలింగ్, మహిళా భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, మిస్సింగ్‌ కేసులు, గుర్తుతెలియని మృతదేహాల విషయంలో తీసుకుంటున్న చర్యలు.. స్టేషన్‌కు వచ్చిన వారిపట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు.. పీఎస్‌ పరిధిలో నమోదైన క్రైం రేట్‌.. దొంగతనాలు, దొంతనాల్లో రికవరీ శాతం వంటి అంశాల్లో ఈ స్టేషన్‌కు అవార్డు లభించింది.

కాగా, దేశంలోనే ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌ అవార్డు అందుకున్న రాజేంద్రనగర్‌ పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓ బి. నాగేంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ రవి గుప్తా సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’వేదికగా అభినందనలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement