డిఫాల్టర్లకు పెనాల్టీ | Penalty for millers who not giving CMR | Sakshi
Sakshi News home page

డిఫాల్టర్లకు పెనాల్టీ

Published Sun, May 28 2023 3:07 AM | Last Updated on Sun, May 28 2023 3:07 AM

Penalty for millers who not giving CMR  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిర్ణీత గడువులోగా ఎఫ్‌సీఐకి కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం ఇవ్వని రైస్‌ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా విదిల్చింది. 2021–22 వానా కాలం సీఎంఆర్‌ గడువు పలు వాయిదాల తరువాత ఏప్రిల్‌ 31తో ముగిసింది. అయినా రాష్ట్రంలోని 494 రైస్‌ మిల్లులు బియ్యం అప్పగించలేదు. వీటినుంచి 2.22 ఎల్‌ఎంటీ బియ్యం ఎఫ్‌సీఐకి చేరాల్సి ఉంది.

ఈ బియ్యం రికవరీకి గడువు కోరినా ఎఫ్‌సీఐ అంగీకరించలేదు. దీంతో ఎఫ్‌సీఐ నుంచి సుమారు రూ. 700 కోట్లు రాలేదు. ఇప్పుడు మిల్లర్ల నుంచి బియ్యాన్ని రికవరీ చేసినా, నిబంధనల మేరకు ఎఫ్‌సీఐకి పంపకుండా రాష్ట్ర అవసరాలకే (స్టేట్‌ పూల్‌) వినియోగించుకోవాలి. దీంతో పౌర సరఫరాల శాఖ నష్ట నివారణకు చర్యలు చేపట్టింది.

494 రైస్‌ మిల్లులను డిఫాల్టర్లుగా ప్రకటించి, వారి నుంచి 25 శాతం పెనాల్టీతో 125 శాతం సీఎంఆర్‌ను రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి హోదాలో పౌరసరఫరాల  సంస్థ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

25 శాతం నగదు.. 100 శాతం బియ్యం..
డిఫాల్టర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మిల్లర్ల గుండెల్లో పిడుగు పడినట్లయింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్‌ విలువ రూ. 700 కోట్లు అనుకుంటే... రూ. 175 కోట్లు(25 శాతం) పెనాల్టీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం వెంటనే చెల్లించాలి. అప్పుడే మిల్లర్‌ నుంచి బియ్యం రికవరీ ప్రారంభమ వుతుంది.

మిల్లర్లు ఇప్పటికే బియ్యాన్ని విక్రయించినట్లు ఆరోపణల నేపథ్యంలో రికవరీకి రేషన్‌ బియ్యాన్ని రీసైకిల్‌ చేసి స్టేట్‌పూల్‌కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. వంద శాతం రికవరీయే కష్టమవుతుంది కాబట్టి, 25 శాతం బియ్యాన్ని నగదు రూపంలో వసూలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ, సంస్థ డీఎంలు, డీఎస్‌ఓలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. పెనాల్టీ నుంచి 5వ వంతు మిల్లర్ల నుంచి వసూలు చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. 

ఓ వైపు సీఎంఆర్‌..  మరోవైపు ధాన్యం అన్‌లోడింగ్‌..
ఇప్పుడు డిఫాల్ట్‌ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఓవైపు సీఎంఆర్‌ అప్పగించేందుకు మిల్లులు నడుపుతూ ప్రస్తుత యాసంగి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకొనే విషయంలో సర్కార్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ధాన్యానికి కొర్రీలు పెడుతూ ప్రతి 40 కిలోల బస్తాపై 3 నుంచి 5 కిలోల అదనపు ధాన్యాన్ని రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement