Pattadar Passbook Not Available To Farmers Telangana - Sakshi
Sakshi News home page

ఓవైపు ధరణి.. మరోవైపు బట్వాడా సమస్యలు.. రెవెన్యూ అధికారుల తీరేంటో?

Published Tue, May 16 2023 12:49 AM | Last Updated on Tue, May 16 2023 2:47 PM

Pattadhar Passbooks not available to farmers Telangana - Sakshi

రాష్ట్రంలో భూముల లావాదేవీలు జరిగి నెలలు గడుస్తున్నా రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు అందడం లేదు. ఇదేమిటని రెవెన్యూ కార్యాలయాలకు వెళితే తపాలా శాఖ ఆపేసిందని.. అక్కడికి వెళితే రెవెన్యూశాఖ నుంచి తమకు రానేలేదని చెప్తుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు వాస్తవం ఏమిటంటే.. లక్షల కొద్దీ పాస్‌బుక్కులు రెవెన్యూ కార్యాలయాల్లోనే గుట్టలుగా పడి ఉన్నాయి.

వాటిని తపాలాశాఖ ద్వారా రైతులకు బట్వాడా చేసేందుకు సంబంధించిన చార్జీలను రెవెన్యూ శాఖ చెల్లించకపోవడమే దీనికి కారణం. పాస్‌బుక్‌ల ముద్రణ, బట్వాడా కోసం రైతుల నుంచే రూ.300 వసూలు చేస్తున్న రెవెన్యూ శాఖ.. తపాలా శాఖకు చార్జీలు చెల్లించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌: భూముల రిజిస్ట్రేషన్లు అయ్యాయి.. పాస్‌బుక్‌ల ముద్రణ, తపాలా ద్వారా ఇంటికి చేర్చేందుకు బట్వాడా ఖర్చును రైతులు అప్పుడే రెవెన్యూ శాఖకు చెల్లించారు. కానీ నెలలు గడుస్తున్నా పాస్‌బుక్‌  మాత్రం చేతికి అందడం లేదు. ఒకరిద్దరు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులకు పాస్‌బుక్‌లు అందాల్సి ఉంది. ఎప్పుడో రైతుల ఇళ్లకు చేరాల్సి ఉన్న ఈ పాస్‌బుక్‌లు రెవెన్యూ శాఖ కార్యాలయాల్లోని బీరువాల్లో మూలుగుతున్నాయి. ఏప్రిల్‌ నుంచి ఇదే పరిస్థితి. ఇప్పటికే ధరణి సమస్యలు గందరగోళంతో రైతులు ఇబ్బంది పడుతుండగా.. ఇప్పుడు పాస్‌బుక్‌లు రాకపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.  

చెల్లింపులు లేక బకాయిలు.. 
వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతుల నుంచి రిజిస్ట్రేషన్‌ సమయంలోనే రూ.300 చొప్పున రెవెన్యూ శాఖ వసూలు చేస్తోంది. ఆ మొత్తంతో పాస్‌బుక్‌ను ముద్రించి, తపాలా శాఖ ద్వారా రైతుల ఇళ్లకు పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ములో ఒక్కో పాస్‌బుక్‌కు రూ.40 చొప్పున తపాలాశాఖకు చార్జీగా చెల్లించాలి. కానీ ఏడాది నుంచి ఈ చెల్లింపుల్లో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. తపాలా శాఖ పాస్‌బుక్‌లను ఠంచనుగా బట్వాడా చేస్తున్నా.. అందుకు సంబంధించిన చార్జీలను ఎప్పటికప్పుడు చెల్లించడం లేదు.

అప్పుడప్పుడు ఎంతో కొంత మొత్తం ఇస్తూ వస్తోంది. దీనితో బకాయిలు రూ.3 కోట్ల వరకు చేరుకున్నాయి. చార్జీల సొమ్ము చెల్లించాలని తపాలా శాఖ ఎన్నిసార్లు కోరినా రెవెన్యూ శాఖ నుంచి స్పందన లేదు. అయినా ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో తపాలా అధికారులు బట్వాడాను కొనసాగిస్తూ వచ్చారు.
 
ఆడిట్‌ అభ్యంతరాలతో.. 

ఇంతగా బకాయిలు పేరుకుపోతున్నా.. ఇంకా సేవలు ఎలా అందిస్తున్నారంటూ తపాలా శాఖను అంతర్గత ఆడిట్‌ అధికారులు ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తపాలా శాఖ బకాయిల వసూలుపై దృష్టిపెట్టింది. బకాయిలు చెల్లించకుంటే ఏప్రిల్‌ ఒకటి నుంచి బట్వాడా నిలిపేస్తామని రెవెన్యూ శాఖకు తేల్చి చెప్పింది. అయినా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించలేదు. దీంతో తపాలాశాఖ ఏప్రిల్‌ ఒకటి నుంచి పాస్‌బుక్‌ల బట్వాడాను నిలిపేసింది. ఇకపై పాస్‌బుక్‌లను పంపవద్దని స్పష్టం చేసింది. అప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయాల్లోనే లక్షల సంఖ్యలో పాస్‌బుక్‌లు పేరుకుపోయాయి. 
 
తప్పుడు సమాచారంతో అటూ ఇటూ.. 
పాస్‌బుక్కులు అందకపోవడంలో తప్పు తమది కాదని.. తపాలా శాఖనే దగ్గరపెట్టుకుని పంపటం లేదంటూ కొందరు అధికారులు తప్పుడు సమాచారం ఇస్తుండటంతో రైతులు పోస్టాఫీసులకు వెళ్తున్నారు. అసలు పాస్‌ పుస్తకాలు తమ వద్దకు రానేలేదని, రెవెన్యూ అధికారుల వద్దనే ఉంటాయని తపాలా సిబ్బంది స్పష్టం చేస్తుండటంతో మళ్లీ రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు.

ఇదంతా గందరగోళంగా మారిపోయింది. చార్జీల బకాయిలు, పాస్‌బుక్‌ల బట్వాడా నిలిపివేత అంశాలపై రెవెన్యూ, పోస్టల్‌ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. స్పందించేందుకు నిరాకరించారు. 
 
ఇంతకు ముందు రవాణాశాఖలోనూ.. 
గతంలో డ్రైవింగ్‌ లైసెన్సుల విషయంలోనూ ఇదే తరహాలో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ బట్వాడా కోసం వాహనదారుల నుంచి ఫీజులు వసూలు చేసిన రవాణాశాఖ.. తపాలా శాఖకు ఆ చార్జీలను చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా రవాణాశాఖ స్పందించకపోవటంతో.. గతేడాది తపాలా శాఖ డ్రైవింగ్‌ లైసెన్సుల బట్వాడాను నిలిపేసింది.

అప్పట్లో ఆ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో.. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పందించారు. ట్రాన్స్‌పోర్టు అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు బకాయిల్లోంచి దాదాపు రూ.కోటి వరకు చెల్లించేలా చర్యలు చేపట్టారు. దానితో తపాలా శాఖ బట్వాడాను పునరుద్ధరించింది. ఇప్పుడు రెవెన్యూ శాఖ వంతు వచ్చింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement