సీట్లు కొండంత.. భర్తీ సగమంత More Than 2 Lacs Degree Seats Vacant In Telangana Colleges | Sakshi
Sakshi News home page

డిగ్రీలో ఏటా  2 లక్షలకు పైగా సీట్లు ఖాళీ 

Published Mon, Dec 6 2021 3:06 AM | Last Updated on Mon, Dec 6 2021 3:06 AM

More Than 2 Lacs Degree Seats Vacant In Telangana Colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల సీట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ఏటా 3.2 లక్షల మంది ఇంటర్‌ పాసవుతుంటే డిగ్రీ సీట్లు మాత్రం 4.5 లక్షలకు పైనే ఉన్నాయి. ఇంజనీరింగ్, ఇతర కోర్సులు పోనూ డిగ్రీలో చేరికలయ్యాక ప్రతి ఏటా దాదాపు 2 లక్షలకు పైనే సీట్లు మిగులుతున్నాయి. గత ఐదేళ్లుగా ఇదే నడుస్తోంది. దీంతో ఉన్నత విద్యా మండలి పునః సమీక్షకు సిద్ధమైంది. డిమాండ్‌ ఉన్న కోర్సులు, విద్యార్థులు ఎక్కువగా చేరే కాలేజీలకే అనుమతి ఇవ్వాలని ఆలోచిస్తోంది. అలాగే నాణ్యత, అంతర్జాతీయ మార్కెట్‌ ఉన్న కోర్సులనూ ప్రవేశపెట్టాలని అనుకుంటోంది.  

40 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు 
రాష్ట్రంలో 1,080 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో ఎక్కువగా ప్రైవేటు కాలేజీలే. ఈ ఏడాది ఈ కాలేజీల్లో 4,66,345 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అడ్మిషన్లు ముగిసే సమయానికి 2,49,266 సీట్లే భర్తీ అయ్యాయి. దాదాపు 40 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్‌ కూడా లేదు. 30 కాలేజీల్లో కొన్ని గ్రూపుల్లో విద్యార్థులు నామమాత్రం కన్నా తక్కువే చేరారు. వాస్తవానికి రాష్ట్రంలో ఏటా ఇంటర్‌ పాసయ్యే వారి సంఖ్య 3.2 లక్షలకు మించట్లేదు. ఇందులో 70 వేల మంది ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక విద్య కోర్సులను ఎంచుకుంటున్నారు. మిగతా వాళ్లు డిగ్రీలో చేరుతున్నారు. ఈ లెక్కన 2.5 లక్షల డిగ్రీ సీట్లున్నా సరిపోతుంది. కానీ ప్రైవేటు కాలేజీల ఒత్తిడి మేరకు ఇష్టానుసారం అనుమతి ఇస్తున్నారు.  

పాఠ్య ప్రణాళిక ప్రక్షాళన! 
విద్యార్థుల చేరికను పరిశీలిస్తే కొన్ని కోర్సులకే డిమాండ్‌ ఉంటోంది. బీకాంలో 40 శాతం మంది చేరితే ఫిజికల్‌ సైన్స్‌ 35 శాతం మంది చేరుతున్నారు. బీఏలో 20 శాతానికి మించట్లేదు. డిగ్రీ కోర్సులు చేసిన వారికి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని విద్యార్థుల్లో అసంతృప్తి ఉంది. దీన్ని దూరం చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు అందిపుచ్చుకుని బీఏ (హానర్స్‌), బీకాం కోర్సులను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది. తరగతి బోధన కన్నా ప్రాజెక్టు వర్క్‌ ఎక్కువ ఉండాలని భావిస్తోంది. ఇందుకు మౌలిక సదుపాయాలున్న కాలేజీలను గుర్తించి వాటికే అనుమతి ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే నాణ్యత లేని కాలేజీలు 
తగ్గుతాయని, సీట్ల మిగులు సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.  

సీట్లు కాదు.. నాణ్యతే ముఖ్యం  
విద్యార్థుల సంఖ్యకు మించి డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నది నిజమే. అయితే నాణ్యత ప్రమాణాలతో కోర్సులు అందిస్తున్నామా లేదా అన్నదే ప్రధానం. మూస విద్యావిధానానికి బదులు సరికొత్త బోధన ఉండాలి. పాశ్చాత్య దేశాల్లో గ్రాడ్యుయేషన్‌లో ఏ కోర్సు చేసినా పీజీలో ఇష్టమైన కోర్సు తీసుకోవచ్చు. మన దగ్గర బీఏ చేస్తే ఎంకాం చేయడానికి వీల్లేదు. డిగ్రీలో ప్రమాణాలు పెంచితే పోటీని తట్టుకునే కాలేజీల సంఖ్య తగ్గి పరిమిత సీట్లే ఉండే వీలుంది. – ప్రొఫెసర్‌ రవీందర్‌ (ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉప కులపతి) 

ఇక ఈసారి నో చాన్స్‌  
చేరే వాళ్లే లేనప్పుడు డిగ్రీలో ఇన్ని కాలేజీలు, ఇన్ని సీట్లు అవసరమా? అని ప్రశ్న వినిపిస్తోంది. నిజమే.. దాదాపు 30, 40 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు ఉంటున్నాయి. మరికొన్ని చోట్ల కోర్సుల్లో జీరో అడ్మిషన్లు నమోదవుతున్నాయి. వాస్తవానికి వీటిని మూసేయాలి. కానీ ఒక్క అవకాశం ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాలు ఏటా నెట్టుకొస్తున్నాయి. ఈసారి ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. హేతుబద్ధీకరణపై దృష్టి పెడుతున్నాం.  – ప్రొఫెసర్‌ లింబాద్రి, (ఉన్నత విద్యా మండలి చైర్మన్‌)  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement