గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి | Minister Indrakaran Reddy Speech At Komaram Bheem 82nd Death Anniversary Program | Sakshi
Sakshi News home page

గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి

Published Mon, Oct 10 2022 2:35 AM | Last Updated on Mon, Oct 10 2022 2:35 AM

Minister Indrakaran Reddy Speech At Komaram Bheem 82nd Death Anniversary Program - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజనుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఆదివారం నిర్వహించిన కుమురంభీమ్‌ 82వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా కుమురం సూరు, భీమ్‌ స్మారక విగ్రహాలకు, సమాధి వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధ్యక్షతన నిర్వహించిన గిరిజన దర్బార్‌లో మాట్లాడారు. అటవీ భూములు సాగు చేస్తున్నవారిలో అర్హులను గుర్తించి పట్టాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సుప్రీంకోర్టు కొట్టివేసిన జీవో 3ను న్యాయపరంగా పరిష్కరిస్తామని తెలిపారు. గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు.

జిల్లాలోని కుమురంభీమ్, వట్టివాగు, చలిమెల తదితర ప్రాజెక్టుల నీటిని పంటచేలకు మళ్లిస్తామని హామీనిచ్చారు. వంద గిరిజన దేవాలయాలు నిర్మిస్తామని వెల్లడించారు. జోడేఘాట్‌ వరకు రోడ్డు సౌకర్యం, స్థానికులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. స్థానిక ఆదివాసీలు వలస వచ్చిన వారితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని, జీవో 3ను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయని ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్లు రాహుల్‌రాజ్, సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్,  పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనకరాజు, కుమురంభీమ్‌ మనవడు సోనేరావు,  పాల్గొన్నారు. 

రద్దైన కేటీఆర్‌ పర్యటన
షెడ్యూల్‌ ప్రకారం జోడేఘాట్‌కు మంత్రి కేటీఆర్‌ వస్తారని భారీ ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దవడంతో అక్కడున్నవారంతా నిరుత్సాహపడ్డారు. రూ.15 కోట్లతో ఆసిఫాబాద్‌ పట్టణ అభివృద్ధి శిలాఫలకం, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ కుమురం భీమ్‌పై రాసిన పాట ఆల్బం సీడీని మంత్రి ఆవిష్కరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement