తెలంగాణ బీజేపీలో కొత్త సమీకరణాలకు బీజం | List of ticket Aspirants for BJP is growing in Adilabad Constituency | Sakshi
Sakshi News home page

బీజేపీలో కొత్త సమీకరణాలకు బీజం.. ‘సోయం’ గ్రీన్‌ సిగ్నల్‌తో పార్టీలోకి ఎన్‌ఆర్‌ఐ

Published Sat, Aug 20 2022 4:59 PM | Last Updated on Sun, Aug 21 2022 11:11 AM

List of ticket Aspirants for BJP is growing in Adilabad Constituency - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: మునుగోడు కేంద్రంగా జిల్లా బీజేపీలోనూ కొత్త సమీకరణాలకు బీజం పడుతున్నాయా.. అంటే అవుననే సమాధానమే వినిప్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కమలం తీర్థం పుచ్చుకుంటుండగా, జిల్లా నుంచి కూడా ఆ పార్టీలో చేరికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో ఓ ఎన్‌ఆర్‌ఐ చకచకా చేరికకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.

చూచాయగా సమాచారం..
ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్‌ ఆశిస్తూ ఇప్పటికే బీజేపీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్, జెడ్పీ మాజీ చైర్‌ పర్సన్‌ చిట్యాల సుహాసినిరెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతుంది. ఈక్రమంలోనే అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ కంది శ్రీనివాస్‌రెడ్డి కొంత కాలంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు కదులుతున్నారు. మొదటి నుంచి బీజేపీలో చేరిక ఖాయమంటూ సంకేతాలిస్తూ వచ్చారు.

తాజాగా ఆయన మునుగోడులో అమిత్‌షా సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. శుక్రవారం పార్టీకి చెందిన పలువురు జిల్లా నాయకులకు ఆయన ఫోన్‌ చేసి తాను పార్టీలో చేరుతున్నట్లు తెలియజేశారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా ఆయన చేరికకు సంబంధించి హైదరాబాద్‌ కేంద్రంగా జోరుగా ప్రయత్నాలు సాగుతూ వస్తున్నాయి. ఈ విషయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌కు మొదట ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రయత్నలు ఓ కొలిక్కి రావడంతో జిల్లా అధ్యక్షుడికి చూచాయగా తాను పార్టీలో చేరుతున్నట్లు తెలియజేసినట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

చదవండి: (అక్కడ ‘కారు’ జోరు పెరుగుతుందా?.. ఆ ఇద్దరు కీలక నేతల పరిస్థితేంటి?)

ఆసక్తికరంగా పరిణామాలు..
కమలం పార్టీలో చేరికకు సంబంధించి ఆసక్తికరంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడులో చేరిక తర్వాత మరుసటి రోజే సోమవారం ఆదిలాబాద్‌ నియోజకవర్గానికి పార్టీ అదిష్టానం ద్వారా ఇన్‌చార్జీగా నియమితులైన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం ఖోడబాయి రూపాల ఆదిలాబాద్‌కు రానున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఆయన ఆదిలాబాద్‌లో వ్యాపార వర్గాలు, మేధావులతో సమావేశం కానున్నారు. దీంతో ఈ వేదిక నుంచే ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో టికెట్‌ను ఆశిస్తున్న ముఖ్య నేతల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంది.

ఇప్పటికే  రెండు వర్గాలుగా కొనసాగుతుండగా, తాజాగా పార్టీలో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. సైద్ధాంతిక పార్టీలో ముందు నుంచి ఉన్నవారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కొంతమంది పాత నేతల్లో కొత్త చేరికపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ, రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయోననేది ఆసక్తి కలిగిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement