ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు చివరి చాన్స్‌  | Last chance for engineering counselling | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు చివరి చాన్స్‌ 

Published Thu, Aug 17 2023 1:26 AM | Last Updated on Thu, Aug 17 2023 10:09 AM

Last chance for engineering counselling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. కన్వినర్‌ సీటు కౌన్సెలింగ్‌ ద్వారా పొందడానికి ఇదే చివరి అవకాశం. ఇప్పటివరకూ సీటు కోసం ప్రయత్నించని వారు ఉంటే ఈ నెల 18న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరవ్వాలని సాంకేతిక విద్య కమిషనర్‌ వాకాటి కరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 19 వరకూ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

ఈ నెల 23వ తేదీన ప్రత్యేక దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో సీటు వచ్చిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత కూడా మిగిలిపోయిన సీట్లను ఈ నెల 25న స్పాట్‌ అడ్మిషన్ల పేరిట ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా కాలేజీల్లోనే భర్తీ చేస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సాంకేతిక విద్య విభాగం విడుదల చేయాల్సి ఉంది. 

అందుబాటులో 19 వేల సీట్లు 
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 19,049 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కంప్యూటర్‌ కోర్సులకు సంబంధించిన సీట్లు దాదాపు 4 వేలకు పైనే ఉన్నాయి. ఒక్క సీఎస్‌సీలోనే 3,034 సీట్లు మిగిలాయి. సివిల్‌ ఇంజనీరింగ్‌లో 2,505, ఈసీఈలో 2,721, ఈఈఈలో 2,630, ఐటీలో 1,785, మెకానికల్‌లో 2,542 సీట్లు ఉన్నాయి.

ఈ ఏడాది పలు కాలేజీలు సివిల్, మెకానికల్‌ సీట్లు రద్దు చేసుకుని, ఆ స్థానంలో కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు పెంచుకున్నాయి. వీటితో పాటు మరో 7 వేల సీట్లు కొత్తగా కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీలో పెరిగాయి. మొత్తంగా కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు 14 వేల వరకు పెరిగాయి.

అయితే గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉండే కాలేజీల్లో కంప్యూటర్‌ కోర్సులు అందుబాటులో ఉన్నా అక్కడ చేరేందుకు విద్యార్థులు ఇష్టపడటం లేదు. ఆయా కాలేజీల్లో మౌలిక వసతులు, సరైన ఫ్యాకల్టీ లేదని విద్యార్థులు భావిస్తున్నారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో సీట్లు 90 శాతం వరకూ భర్తీ అయ్యాయి.

లక్షకు చేరువలో చేరికలు 
ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి లక్ష మంది వరకు చేరే వీలుందని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 174 కాలేజీలుంటే, వీటిలో 83,766 కన్వినర్‌ కోటా సీట్లు, మరో 33 వేలు యాజమాన్య కోటా సీట్లు ఉన్నాయి.

కన్వీనర్‌ కోటాలో ఇప్పటికే 65 వేల మంది వరకూ చేరారు. ప్రత్యేక కౌన్సెలింగ్, స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా మరో 6 వేల మంది వరకూ చేరే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇక యాజమాన్య కోటా కింద దాదాపు 30 వేల వరకూ భర్తీ అయ్యే వీలుందని భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement