Hyderabad Metro Rail: Commuters Seek Extend Service to New Routes - Sakshi
Sakshi News home page

చిగురిస్తున్న మెట్రో ఆశలు.. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో హారం... 

Published Wed, Dec 14 2022 2:12 PM | Last Updated on Wed, Dec 14 2022 7:47 PM

Hyderabad Metro Rail: Commuters Seek Extended Service to New Routes - Sakshi

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో పలు మార్గాల్లో మెట్రో మార్గం ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్‌ మెట్రో ప్రాజెక్టుకు పునాదిరాయి పడిన నేపథ్యంలో.. తాజాగా పలు ప్రాంతాల నుంచి మెట్రో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వీటికి అధికార, విపక్ష పార్టీలు, వివిధ వర్గాల వారు మద్దతునిస్తుండడంతో నూతనంగా చేపట్టాల్సిన మెట్రో మార్గాలపై అధ్యయనానికి హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ శ్రీకారం చుట్టింది. ప్రతి కిలోమీటరు మెట్రో పూర్తికి సుమారు రూ.300 కోట్లు అంచనా వ్యయం అవుతుంది. 
    
ఈ స్థాయిలో నిధులు వ్యయం చేసే స్థితిలో రాష్ట్ర సర్కారు లేదన్న విషయం సుస్పష్టమే. ఈ నేపథ్యంలో పబ్లిక్‌– ప్రైవేటు భాగస్వామ్యం, లేదా కేంద్ర సహకారంతో పలు రూట్లలో ప్రాజెక్టులు చేపట్టడం.. తొలుత ప్రైవేటు సంస్థలు చేసే వ్యయంతో పూర్తిచేసి ఆ తర్వాత వాయిదా పద్ధతిలో సదరు సంస్థకు వడ్డీతో సహా చెల్లించడం (హైబ్రిడ్‌ యాన్యుటీ ) తదితర విధానాలపై సర్కారు దృష్టి సారించడం విశేషం. (క్లిక్ చేయండి: ఇక ఈజీగా ఆధార్‌ అప్‌డేట్‌)
  

ఔటర్‌ చుట్టూ మెట్రో హారం... 

మహానగరానికి మణిహారంలా 158 కి.మీ మేర విస్తరించిన ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా తాజాగా తెరమీదకు వచ్చింది. ఇటీవల సీఎం కేసీఆర్‌ ఇదే అంశాన్ని ప్రస్తావించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సుమారు 190 గ్రామాలు, 30కి పైగా నగరపాలక సంస్థలు ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపలున్నాయి. ఓఆర్‌ఆర్‌ చుట్టూ మెట్రో రూటు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత మెరుగవడంతో పాటు వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ప్రధానంగా ఐటీ, హార్డ్‌వేర్, రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు మెట్రో రూటు మరింత ఊపునిస్తుందన్న అంచనాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement