చెరువుల ఆక్రమణలను తీవ్రంగా పరిగణించాలి  | Encroachment of ponds should be taken seriously | Sakshi
Sakshi News home page

చెరువుల ఆక్రమణలను తీవ్రంగా పరిగణించాలి 

Published Wed, Feb 7 2024 4:22 AM | Last Updated on Wed, Feb 7 2024 4:22 AM

Encroachment of ponds should be taken seriously - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువుల శిఖం, ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌(ఎఫ్‌టీఎల్‌), ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, చుట్టూ కంచె ఏర్పాటు.. తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించేందుకు డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌(డీఎస్‌జీ) గాడి ప్రవీణ్‌కుమార్, రెవెన్యూ జీపీ శ్రీకాంత్‌రెడ్డిని అడ్వొకేట్‌ కమిషనర్లుగా హైకోర్టు నియామించింది.

రెండు జిల్లాల పరిధిలోని 16 చెరువులను పరిశీలించి మూడు వారాల్లో స్థాయి నివేదికను సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని ఆదేశించింది. అంతరించిపోతున్న చెరువులను కాపాడేందుకు వీరిని నియమించినట్లు చెప్పింది. దీనికంతటికీ అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. ‘భవిష్యత్‌ తరాలు బాగుండాలన్నదే మా అభిమతం.

ఒకప్పుడు హైదరాబాద్‌ను సరస్సుల నగరంగా పిలిచేవారు. ఇప్పుడు చాలా చెరువులు, సరస్సులు ఆక్రమణలతో అంతరించిపోయాయి. హైకోర్టు పక్కనే ప్రవహించే నది(మూసి) దుస్థితినే మనం చూడవచ్చు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. లేదంటే భవిష్యత్‌ తరాలు క్షమించవు’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే వ్యాఖ్యానించారు.
 
13 నీటి వనరులపై నివేదిక.. 
హైదరాబాద్‌ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని, శిఖంను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని.. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గమన సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనిల్‌ సి దయాకర్‌ 2007లో హైకోర్టుకు లేఖ రాశారు.

ముఖ్యంగా దుర్గం చెరువు, సున్నం చెరువు, పెద్ద చెరువు, పిర్జాదిగూడ, దామర చెరువు, దుండిగల్, చిన రాయుని చెరువు, గంగారం పెద్ద చెరువు, మేడికుంట చెరువు, హస్మత్‌పేట, బావురుడ తదితర చెరువులు ఆక్రమణలకు గురై పూర్తిగా కుంచించుకుపోయాయని పేర్నొన్నారు. ఈ లేఖను న్యాయస్థానం రిట్‌ పిటిషన్‌గా విచారణ స్వీకరించింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, జస్టిస్‌ అనిల్‌ కుమార్‌ జూకంటి ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.

దుర్గం చెరువు, సున్నం చెరువు, ఫిర్జాదిగూడ పెద్ద చెరువు, చినదామర, చినరాయుని, గ్నాగారం పెద్ద చెరువు, మేడికుంట, నల్లచెరువు, బోయిన్‌ చెరువు, మద్దెలకుంట, నల్లగండ్ల చెరువు, అంబీర్‌ చెరువు, గోసాయి కుంట.. 13 నీటి వనరులకు సంబంధించి ఆక్రమణలు, ఎఫ్‌టీఎల్, కంచె ఏర్పాటుపై నివేదికను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కోర్టుకు అందజేశారు. 

పరస్పర విరుద్ధ స్టేట్‌మెంట్లతో  అడ్వొకేట్‌ కమిషనర్ల నియామకం  
అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ.. దుర్గం చెరువు చుట్టూ సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసినందున కంచె వేయడం సాధ్యం కాదని చెప్పారు. అయితే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ అందజేసిన నివేదికలో మాత్రం కంచె ఏర్పాటు చేసినట్లు ఉండటంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. పరస్పర విరుద్ధంగా స్టేట్‌మెంట్లు ఉండటంతో అడ్వొకేట్‌ కమిషనర్ల నియామకం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వీరు చెరువులను పరిశీలించి నివేదిక అందజేస్తారని చెప్పింది.

ఇద్దరికీ రూ.25 వేల చొప్పున రెమ్యునరేషన్‌ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. విచారణకు జీహెచ్‌ఎంసీ తరఫున జయకృష్ణ, కేంద్రం తరఫున డీఎస్‌జీ గాడి ప్రవీణ్‌కుమార్, రెవెన్యూ తరఫున శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. దుర్గం చెరువు చుట్టూ కంచె ఏర్పాటుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవాలని ఏఏజీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం మార్చి 11కు వాయిదా వేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement