లబ్ధిదారులకు ఇళ్లిచ్చిన తర్వాత పిటిషనా?  | Dismissal of Public Interest Litigation | Sakshi
Sakshi News home page

లబ్ధిదారులకు ఇళ్లిచ్చిన తర్వాత పిటిషనా? 

Published Fri, Aug 25 2023 1:45 AM | Last Updated on Fri, Aug 25 2023 1:45 AM

Dismissal of Public Interest Litigation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మన్‌సాన్‌పల్లి ఫేజ్‌–1, ఫేజ్‌–2 లో రూ.180 కోట్ల విలువైన 2,400 డబుల్‌ బెడ్రూ మ్‌ ఇళ్ల కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండియా లిమిటెడ్‌కు అప్పగించడాన్ని హైకోర్టు సమర్థించింది. ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అప్పగించిన తర్వాత ఇప్పడు పిటిషన్‌ వేయడం సమంజసం కాదంది.

ఈ దశలో ఎ లాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంటూ పిల్‌ని కొట్టివేసింది. టెండర్లు లేకుండా కాంట్రాక్టు అప్పగించడాన్ని సవాల్‌ చేస్తూ నిజామాబాద్‌కు చెందిన జి.చందు హైకోర్టులో పిల్‌ చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించింది.  

మధ్యలోనే పనులు వదిలివేయడంతో... 
వేరే కంపెనీలు మధ్యలో పనులను వదిలేయడంతో 2020లో మన్‌సాన్‌పల్లి ఫేజ్‌–1, ఫేజ్‌–2లోని పెండింగ్‌ పనులను పూర్తి చేయాలంటూ ప్రభుత్వం డీఈసీ కంపెనీకి అప్పగించింది. దీనిపై వెంకట్‌ అనే వ్యక్తి గతంలో దా ఖలు చేసిన పిటిషన్‌ను ఇదే హైకోర్టు కొట్టివేసింది. డీఈసీ కంపెనీ నిర్మాణాలను పూర్తి చేసి 2022లో అప్పగించింది.

కాంట్రాక్టు విలువ కంటే అదనంగా రూ.68 కోట్లు చెల్లిస్తున్నారని పేర్కొంటూ నిర్మాణాలను పూర్తి చేసిన తర్వాత పిటిషనర్‌ పిల్‌ దాఖలు చేశారు. దీంతో బిల్లులు చెల్లించవద్దంటూ జనవరిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాదనలు పూర్తయిన తర్వాత ధర్మాసనం..ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగినట్లు పిటిషనర్‌ ఆధారాలు చూపలేదంది.

2022లో ఇళ్లు అప్పగించిన తర్వాత పిటిషన్‌ దాఖలు చేశారని, దీనికి కారణం కూడా చెప్పలేదని వ్యాఖ్యానించింది. జీహెచ్‌ఎంసీ అప్పగించిన కాంట్రాక్ట్‌లో ఎలాంటి వివక్ష లేదని పేర్కొంది. కాంట్రాక్టర్‌కు బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement