‘అమ్మా’రావం! | Cows Born In Pilot Project in Kamareddy District | Sakshi
Sakshi News home page

article header script

‘అమ్మా’రావం!

Published Mon, Feb 13 2023 1:53 AM | Last Updated on Mon, Feb 13 2023 8:35 AM

Cows Born In Pilot Project in Kamareddy District - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి
ఇలా అంతా కోరుకున్న రీతిలో వస్తున్న ఆవు దూడలు పాడి రంగంలో కొత్త క్షీర విప్లవానికి నాందిగా నిలుస్తున్నాయి. స్వదేశీ ఆవుల సంఖ్యను పెంచడం.. అలాగే అధికంగా పాలిచ్చే జాతి ఆవులను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2019లో ‘రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌’ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. దీన్ని తెలంగాణ, ఆంధ్రపదేశ్‌తోపాటు మరో పది రాష్ట్రాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టింది.

ఇందులోభాగంగా కామారెడ్డి జిల్లా తిప్పాపూర్, ఎర్రపహాడ్, కొండాపూర్, చిన్నమల్లారెడ్డి, లింగంపల్లి, ఎల్లంపేట, మోతె, కొయ్యగుట్ట, మహ్మదాపూర్, కరత్‌పల్లి పది గ్రామాలను ఎంపిక చేశారు. ఇక్కడ వివిధ రకాల జాతులకు చెందిన 160 ఆవుల్లో లింగ నిర్ధారణ చేసి సాహివాల్, గిర్‌ తదితర స్వదేశీ జాతులతోపాటు అధిక పాలనిచ్చే హెచ్‌ఎఫ్, జెర్సీ కోడెల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేశారు.

ఇందులో ఇప్పటివరకు 134 ఆవులు గర్భం దాల్చి 126 (94 శాతం) ఆడ దూడలు, 8 కోడె దూడలకు జన్మనిచ్చాయి. దీంతో రైతులు స్వదేశీ గిర్, సాహివాల్‌ ఆడ దూడలతోపాటు అధిక పాలనిచ్చే ఆవులకు యజమానులయ్యారు. లక్షలు పోసినా దొరకని స్వదేశీ, విదేశీ ఆవుజాతులు ఇప్పుడు తమ పంటపొలాల్లో పరుగెడుతుండటంతో సంబరపడిపోతున్నారు. 

‘స్వదేశీ ఆవును పెంచుకోవాలన్నది నా జీవితాశయం. ఎవరి వద్దనైనా కొందామంటే ధర.. రూ.లక్షల్లో చెబుతున్నారు. అంత సొమ్ము భరించే స్తోమత లేదు. నా కల ఇక నెరవేరదు అనుకున్నా..! కానీ ఓ రోజు కేంద్ర పశుసంవర్థక శాఖ వారు మా ఊరిలో క్యాంప్‌ పెట్టి.. నా వద్ద ఉన్న విదేశీ జాతి హెచ్‌ఎఫ్‌ ఆవుకు కృత్రిమ గర్భధారణతో కోరుకున్న స్వదేశీ ఆవు దూడ పుట్టేలా ఉచితంగా చేస్తామన్నారు.

అందులో ఆడ–మగ.. ఏది కోరుకుంటే అదే పడుతుందన్నా­రు. నాకు సాహివాల్‌ రకం ఆడ దూడ కావా­లని అడిగాను. నా దగ్గర ఉన్న ఆవు గర్భంలో లింగ నిర్ధారణ వీర్యం ప్రవేశపెట్టి 9 నెలల్లో సాహివాల్‌ ఆడ దూడను కానుకగా ఇచ్చారు. ఇలా మా ఊరి ఆవుల్లో చేసిన కృత్రిమ గర్భధారణతో అందరికీ కోరుకున్న జాతి ఆడ దూడలే పుట్టాయి. ఇది మాకు ఆశ్చర్యంతోపాటు ఐశ్వర్యాన్ని ఇచ్చింది’ అంటూ కామారెడ్డి జిల్లా తిప్పాపూర్‌ పాడిరైతు ఏలేటి గణేశ్‌రెడ్డి ఆనందంతో గంతేశాడు.. ఈ ఆనందం ఇప్పుడు ఈయన ఒక్కడిదే కాదు కామారెడ్డి జిల్లాలో మరికొందరిది కూడా. 

ఇక అన్ని  పల్లెలకు.. 
కేంద్ర ప్రభుత్వం–విజయ డెయిరీ సహకారంతో చేపట్టిన కామారెడ్డి పైలెట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం కావడంతో వచ్చే నెల నుంచి అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,192 మంది వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులతో కృత్రిమ గర్భధారణ శిబిరాల్లో రైతు రూ.250 చెల్లిస్తే వారు కోరుకున్న దూడలకు జన్మనిచ్చేలా ఆవులను సిద్ధం చేయనున్నారు. అయితే 90 శాతం ఆడ దూడలు, 10 శాతం కోడె దూడలుండే విధంగా సమతౌల్యం పాటించనున్నారు.  ఈ పథకం విస్తృతంగా రైతుల్లోకి వెళ్తే వచ్చే ఏడేళ్లలో టాప్‌–10 రాష్ట్రాల జాబితాలోకి తెలంగాణ చేరే అవకాశం ఉందని పాడి నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

వెరీవెరీ స్పెషల్‌.. 
►గిర్, సాహివాల్‌ ఆవుల పాలల్లో పోషకాలు, ఔషధ గుణాలు ఎక్కువ. సంతానోత్పత్తి సమర్థత కూడా అధికం. తక్కువ మేత, ఎక్కువ పాల దిగుబడితో ప్రస్తుతం ఈ స్వదేశీ జాతి ఆవులకు రూ.లక్షల్లో డిమాండ్‌ ఉంది. 
►హెచ్‌ఎఫ్‌ ఆవుల్లో ఎక్కువ పాల దిగుబడితోపాటు ప్రసవించే పదిహేను రోజుల ముందు వరకు పాలు ఇవ్వడం ప్రత్యేకం.  

పాడిలో పెను మార్పులు 
పైలట్‌ ప్రాజెక్ట్‌గా పది గ్రామాల్లో చేసిన ప్రయోగం విజయవంతం కావడం శుభపరిణామం. ఈ పథకాన్ని మార్చిలో రాష్ట్రమంతా విస్తరిస్తాం. 
దీంతో పాడి రంగంలో పెనుమార్పులు రానున్నాయి.  
–డాక్టర్‌ మంజువాణి, సీఈఓ, లైవ్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ 

మా ఇంట్లో పోషకాల గోవు.. 
స్వదేశీ గిర్‌ ఆవుకు కృత్రిమ గర్భధారణతో మళ్లీ గిర్‌ ఆడ దూడ పుట్టింది. గిర్‌ ఆవు పాలల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. నా ఆవు రోజుకు 16 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ఒక్క స్వదేశీ ఆవు ఉంటే ఆరోగ్యం మన వెంట ఉన్నట్టే. 
–మన్నె గంగారెడ్డి, తిప్పాపూర్, కామారెడ్డి 

పుణేలో.. ఫలించిన ప్రయోగంతో.. 
అంతరిస్తున్న దేశీ జాతులతోపాటు అధిక పాలనిచ్చే విదేశీ జాతి సంతతి వృద్ధి కోసం భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఫౌండేషన్‌ (ఫుణే).. ఫ్లో సైటీమెట్రీ (బయాలాజికల్‌ విశ్లేషణ)తో తొలి అడుగు వేసింది. లింగ నిర్ధారణ వీర్యంతో పుణేలో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో, అక్కడి నుంచి తొలుత దేశీ జాతులు, ఆపై విదేశీ జాతుల లింగ నిర్ధారణ వీర్యాన్ని సిద్ధం చేశారు.

దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ఆవుల్లో కృత్రిమ గర్భధారణ చేయగా, ఆశించిన విధంగానే ఎక్స్‌ క్రోమోజోమ్‌తో అండ ఫలదీకరణ ప్రయోగంతో కోరుకున్న స్థాయిలో ఆడ ఆవుదూడలు పుట్టాయి. దీంతో హిమాచల్‌ ప్రదేశ్, జమ్ము,కశ్మీర్, ఒడిశాల్లో కృత్రిమ గర్భధారణ వేగవంతం చేశారు. మిగతా రాష్ట్రాల్లో వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని విస్తృతం చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement