Siddipet: తడి చెత్తతో సీఎన్‌జీ | CNG With Wet garbage In Telangana | Sakshi
Sakshi News home page

Siddipet: తడి చెత్తతో సీఎన్‌జీ

Published Fri, Jul 30 2021 12:58 AM | Last Updated on Fri, Jul 30 2021 1:34 PM

CNG With Wet garbage In Telangana - Sakshi

సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛతలో ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా తడి చెత్తతో సీఎన్‌జీ (కంప్రెస్డ్‌ న్యాచురల్‌ గ్యాస్‌) తయారు చేసే ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా స్వచ్ఛబడిని ఏర్పాటు చేసి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

వారంలో నాలుగు రోజుల పాటు ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి, హానికరమైన చెత్తను సేకరిస్తున్నారు. ఇప్పటికే చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నా, అంచనాలకు మించి చెత్త రావడంతో బెంగళూరు తరహాలో సీఎన్‌జీ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారు. మంత్రి ఆలోచన మేరకు మున్సిపల్‌ అధికారులు ప్లాంట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 

వ్యయం.. రూ.4.7 కోట్లు
సిద్దిపేట రూరల్‌ మండలంలోని బుస్సాపూర్‌ డంపింగ్‌ యార్డులో రూ.4.7 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షెడ్‌ నిర్మాణం చివరి దశకు చేరింది. స్వచ్ఛ భారత్‌ నిధులతో ఈ ప్లాంట్‌ను నెలకొల్పుతున్నారు. ఈ మున్సిపాలిటీలో 39,616 కుటుంబాల్లో 1.46 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ నిత్యం 25 టన్నుల తడి చెత్త సేకరిస్తున్నారు.

ప్రాజెక్ట్‌ నమూనా చిత్రం 

గ్యాస్‌ తయారీ ఇలా
ఇంటింటా సేకరించిన తడి చెత్తను తొలుత క్రషింగ్‌ చేస్తారు. అనంతరం దీనిని పైపు ద్వారా ఫ్రి డైజెస్టర్‌ అనే ట్యాంక్‌లోకి పంపిస్తారు. తర్వాత డైజెస్టర్‌ ట్యాంక్‌లోకి పంపించి మూడు రోజులు నిల్వ ఉంచుతారు. అక్కడి నుంచి 14 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల ఎత్తు ఉన్న మరో ట్యాంక్‌లోకి ఇక్కడ తయారైన ద్రావణాన్ని పంపిస్తారు. అనంతరం ఆ ట్యాంక్‌లో మైక్రో ఆర్గాన్‌లను వేస్తారు. ఆ సమయంలో విడుదలయ్యే మిథేన్‌ గ్యాస్‌ నుంచి సీఎన్‌జీని వేరు చేసి సిలిండర్‌లలో నింపుతారు. 

నిర్వహణ బాధ్యత ప్రైవేటుకు
గ్యాస్‌ ప్లాంట్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత కార్బన్‌ లైట్స్‌ ఇండియా ప్రైవేట్‌ కంపెనీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు సిద్దిపేట మున్సిపాలిటీతో ఈ కంపెనీ ఒప్పందం చేసుకోనుంది. గ్యాస్‌ ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని 25 శాతం మున్సిపాలిటీ, 75 శాతం కంపెనీ తీసుకుంటాయి.

ఆగస్టు చివరి వరకు పూర్తి
ఆగస్టు చివరి నాటికి గ్యాస్‌ ప్లాంట్‌ నిర్మాణం పూర్తవు తుంది. అనంతరం ప్రైవేట్‌ కంపెనీకి నిర్వహణ బాధ్య తలు అప్పగిస్తాం. దాదాపు ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాం.
–రమణాచారి, మున్సిపల్‌ కమిషనర్, సిద్దిపేట  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement