వారానికో జిల్లాకు సీఎం రేవంత్‌ | CM Revanth Reddy preparing for field visits in Telangana | Sakshi
Sakshi News home page

వారానికో జిల్లాకు సీఎం రేవంత్‌

Published Mon, Jul 8 2024 3:52 AM | Last Updated on Mon, Jul 8 2024 4:18 AM

CM Revanth Reddy preparing for field visits in Telangana

క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌ 

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షలకు నిర్ణయం

సొంత జిల్లా పాలమూరు నుంచి షురూ.. 9న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ సమీక్ష 

విద్య, వైద్యం, సాగునీటి రంగాలు, శాంతిభద్రతలపై ప్రధానంగా దృష్టి  

జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలపైనా నజర్‌ 

7 నెలల పాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ఆలోచనలో సీఎం

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షేత్ర­స్థాయి పర్యటనలపై దృష్టి పెట్టారు. ఇకపై ప్రతి వా­రం ఒక జిల్లాకు వెళ్లాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షించడంతో పాటు ఆ­యా జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన సొంత జిల్లా పాలమూరు నుంచి ఆయన పర్యటనలు ప్రారంభించనున్నారు. 

ఈ నెల 9వ తేదీన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలును సీఎం సమీక్షిస్తారని, ఈ మేరకు అన్ని వివరాలతో సమావేశానికి రా­వాలని క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని జిల్లా­ల కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఇప్పటికే ప్రభు­త్వ వర్గాల నుంచి సమాచారం అందింది.  

కీలక రంగాలపై ఫోకస్‌ 
జిల్లాల పర్యటనలో భాగంగా కీలక రంగాలపై ఫోకస్‌ పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలిసింది. విద్యాసంవత్సరం ప్రారంభం కానుండడం, వర్షాకాలం నేపథ్యంలో విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్ష జరుపుతారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంపై ఇప్పటికే దృష్టి పెట్టిన సీఎం.. ఆ దిశలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేయనున్నారు. 

ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ కాంప్లెక్సుల నిర్మాణం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లుగా ఐటీఐల అప్‌గ్రెడేషన్‌ తదితర అంశాలపై కూడా ఆయన దృష్టి పెట్టనున్నారు. వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధులు, వైద్య శాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ వైద్యరంగ బలోపేతం తదితర అంశాలపై కూడా సూచనలు చేయనున్నారు. ఇక ప్రతి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల గురించి స్థానిక అధికారులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడ­తారని, త్వరగా పూర్తయ్యేందుకు అవకాశం ఉన్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడం ద్వారా వీలైనంత వేగంగా వాటిని పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించేలా అధికారులకు మార్గదర్శనం చే­స్తా­రని సమాచారం. 

వీటితో పాటు వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన కార్యాచరణ, ఎరువుల లభ్యత, ఉపాధి హామీ పనులను సమీక్షించనున్న సీఎం.. రైతుభరోసా అమలు విధివిధానాలపై కూడా అధికారులతో చర్చించనున్నారు. ఎక్కడికక్కడ జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకోనున్న ముఖ్యమంత్రి, జిల్లా స్థాయిలో అమలు కావాల్సిన అన్ని కార్యక్రమాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో జిల్లాల్లోని శాంతిభద్రతల పరిస్థితిని కూడా సీఎం సమీక్షించనున్నారు. 

ఏడు నెలల పాలనపై ఏమంటారు? 
గత ఏడాది డిసెంబర్‌ 7వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాలనా పరంగా సాధారణ కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ, సీఎం ఎక్కువగా రాజకీయ అంశాలపైనే దృష్టి సారించాల్సి వచ్చింది. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, కేబినెట్‌ విస్తరణ లాంటి అనివార్య రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో పార్టీలో చేరికలపై కూడా దృష్టి పెట్టారు. ఇక వీలున్నంత మేరకు ప్రభుత్వ పాలనపై కూడా సమీక్షలు నిర్వహించారు. 

ఇటీవలే అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం ప్రజలతో మమేకం కావాలని వారికి సూచించారు. ఆఫీసుల్లో కూర్చుని పనిచేయడం కన్నా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. కేబినెట్‌ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం లాంటివి తాత్కాలికంగా వాయిదా పడిన నేపథ్యంలో ప్రస్తుతానికి పాలన వ్యవహారాలపై రేవంత్‌ దృష్టి సారించారు. తాను సైతం క్షేత్రస్థాయికి వెళ్లాలని నిర్ణయించారు. 

తొలుత గత ఏడు నెలల పాలనపై అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించడంతో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై ప్రజల మనోగతం ఎలా ఉందన్న దానిపై కూడా జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయన ఫీడ్‌బ్యాక్‌ తీసుకోనున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున క్షేత్రస్థాయిలో ప్రజల మూడ్‌ ఎలా ఉందన్న దానిపై కూడా ఆయన ఫోకస్‌ పెట్టారని, అందులో భాగంగానే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.  

నేడు మంగళగిరికి రేవంత్‌ 
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు గాను ముఖ్యమంత్రి సోమవారం ఏపీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3:15 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరికి వెళ్లి సీకే కన్వెన్షన్‌లో జరిగే వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో పాల్గొంటారని, కార్యక్రమం ముగిసిన తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 7:45 నిమిషాలకు హైదరాబాద్‌ వస్తారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement