‘ఆర్థిక’ భారతానికి ఊపిరి పీవీ Bharat Ratna To PV Narasimha Rao: Life Of Ex PM Known For Pushing India Towards Modern Economic Prosperity | Sakshi
Sakshi News home page

‘ఆర్థిక’ భారతానికి ఊపిరి పీవీ

Published Sat, Feb 10 2024 4:23 AM | Last Updated on Sat, Feb 10 2024 1:36 PM

Bharat Ratna To PV Narasimha Rao: Life Of Ex PM Known For Pushing India Towards Modern Economic Prosperity - Sakshi

విదేశాలకు చెల్లింపులు చేయలేక దివాలా అంచుల్లో ఉన్న దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో గట్టెక్కించిన మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావును భారతరత్న వరించింది. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగానే కాదు.. దేశానికి గాందీ, నెహ్రూ కుటుంబేతర వ్యక్తుల్లో పూర్తికాలం పనిచేసిన తొలి ప్రధానిగా, మైనార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా ఐదేళ్లూ కొనసాగించిన రాజకీయ చాణక్యుడిగా పీవీ పేరు పొందారు. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి కూడా పీవీనే కావడం గమనార్హం. ఆయన రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా తాను పనిచేసిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. – సాక్షి, హైదరాబాద్‌ 

గడ్డు పరిస్థితిలో బాధ్యతలు చేపట్టి.. 
పీవీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే నాటికి దేశం గడ్డు పరిస్థితుల్లో ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు బిలియన్‌ డాలర్ల కంటే తగ్గిపోయాయి. విదేశాలకు చెల్లించాల్సిన అప్పులు, దిగుమతుల కోసం చేయాల్సిన చెల్లింపులు పేరుకుపోయాయి. ద్రవ్యోల్బణం గరిష్టంగా రెండంకెలకు చేరింది. ఏతావాతా దేశం ఆర్థికంగా దివాలా అంచున ఉన్న సమయంలో.. దేశాన్ని ముందుకు నడిపించేందుకు పీవీ సిద్ధమయ్యారు. వెంటనే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేపని మొదలుపెట్టారు. అప్పట్లో రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఉన్న ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌ను పిలిపించి నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

మన్మోహన్‌తోపాటు ఇతర ఆర్థికవేత్తలతో చర్చించి సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం సమకూరేందుకు వీలుగా రూపాయి విలువను తగ్గించారు. తాను ప్రధాని బాధ్యతలు స్వీకరించిన నెలలోనే రిజర్వుబ్యాంకు వద్ద ఉన్న బంగారం నిల్వలను బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో తాకట్టు పెట్టి 400 మిలియన్‌ డాలర్ల రుణం తెచ్చారు. కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. లైసెన్సుల విధానాన్ని సరళీకృతం చేశారు.  అన్ని రంగాల్లో ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యాన్ని తగ్గిస్తూ.. ప్రైవేటు సంస్థల స్థాపనకు అవకాశం కల్పించారు. 

ఎన్ని విమర్శలు వచ్చినా.. 
1991 జూలై 24న ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్‌లో అనేక సంస్కరణలను ప్రకటించారు. కార్పొరేట్‌ పన్ను పెంపు, టీడీఎస్‌ విధానం అమల్లోకి తేవడం, వంట గ్యాస్, కిరోసిన్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంపు, చక్కెరపై సబ్సిడీ తొలగింపు, దిగుమతుల పన్ను తొలగింపు వంటి విధానాలను అమల్లోకి తెచ్చారు. ఈ చర్యలతో పీవీ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌)కు దేశాన్ని అమ్మేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. అయినా మొక్కవోని ధైర్యంతో పారీ్టలో, ప్రభుత్వంలో అసమ్మతివాదులను ఒప్పిస్తూ సంస్కరణలను కొనసాగించారు. ఎగుమతుల కోసం ప్రత్యేక వాణిజ్య విధానాన్ని తేవడంతోపాటు చిన్న సంస్థలకు ప్రోత్సాహకాలు అందించారు.

ఈ చర్యలన్నింటి ఫలితంగా రెండున్నరేళ్లలో ద్రవ్యోల్బణం 17 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గింది. బిలియన్‌ డాలర్లలోపే ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు 15 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ద్రవ్యలోటు 8.4 నుంచి 5.7 శాతానికి తగ్గింది. ఎగుమతులు రెండింతలయ్యాయి. వృద్ధిరేటు 4 శాతానికి పెరిగింది. అక్కడి నుంచి ఇక భారత్‌ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి తలెత్తలేదు. ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానానికి చేరింది. దీనంతటికీ నాడు పీవీ వేసిన ఆర్థిక సంస్కరణలే పునాది. 

బేగంపేట.. బ్రాహ్మణవాడి అడ్డాగా.. 
పీవీ నరసింహారావు హైదరాబాద్‌లో ఉన్నంతకాలం బేగంపేటలోని బ్రాహ్మణవాడి కేంద్రంగానే కార్యకలాపాలను నిర్వహించారు. తొలుత స్వామి రామానంద తీర్థ ఇక్కడ నివాసం ఏర్పర్చుకోగా.. ఆయన అనుచరుడిగా పీవీ ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారు. 1973లో రామానంద తీర్థ పరమపదించగా.. పీవీ అక్కడ స్వామి రామానంద తీర్థ మెమోరియల్‌ కమిటీ సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రస్తుతం పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి ఈ కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె ఈ కమిటీ భవనంలో పీవీ స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పీవీ రాసిన, సేకరించిన వేలాది పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి. 

60 ఏళ్ల వయసులో కంప్యూటర్‌తో కుస్తీ పట్టి.. 
ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడంలో పీవీ ఎప్పుడూ ముందుండే వారు. ఆయన అసాధారణ ప్రతిభతో త్వరగానే పట్టు సాధించేవారు. అలా ఏకంగా దేశ, విదేశ భాషలు సహా 13 భాషలను నేర్చుకున్నారు. రాజీవ్‌గాంధీ హయాంలో మన దేశంలోకి కంప్యూటర్లను ప్రవేశపెట్టినప్పుడు.. పీవీ ఓ కంప్యూటర్‌ తెప్పించుకుని పట్టుపట్టాడు. 60 ఏళ్ల వయసులో కూడా రోజూ గంటల పాటు కూర్చుని టైపింగ్‌ మాత్రమేకాదు.. కంప్యూటర్‌ లాంగ్వేజ్‌నూ నేర్చుకున్నారు.  

ఉస్మానియాలో విద్యాభ్యాసం.. కలం పేరుతో వ్యాసాలు.. 
అపర మేధావి, బహుభాషా కోవిదుడుగా పేరుపొందిన పీవీ నరసింహారావు.. 1921 జూన్‌ 28న నాటి హైదరాబాద్‌ సంస్థానంలోని వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన నియోగి బ్రాహ్మణ దంపతులు సీతారామారావు, రుక్మాబాయిలకు జన్మించారు. మూడేళ్ల వయసులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణి దంపతులు ఆయన్ను దత్తత తీసుకున్నారు. భీమదేవరపల్లి మండలం కట్కూరులోని బంధువు గబ్బెట రాధాకిషన్‌రావు ఇంట్లో ఉంటూ పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు.

ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ చదివారు. 1938 సమయంలో హైదరాబాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరారు. నిజాం నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో ఆయనను ఉస్మానియా వర్సిటీ నుంచి బహిష్కరించగా.. ఓ మిత్రుడి సాయంతో నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో చేరి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. కొంతకాలం జర్నలిస్టుగానూ పనిచేశారు. తన సోదరుడు పాములపర్తి సదాశివరావుతో కలసి ‘జయ–విజయ’ అనే కలం పేరుతో కాకతీయ వారపత్రికకు వ్యాసాలు రాశారు. 

ఎమ్మెల్యే నుంచి ప్రధాని వరకు.. 
కాలేజీలో రోజుల నుంచే పీవీ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పారీ్టలో సభ్యుడిగా చేరారు. 1957–77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి మంథని నుంచి ప్రాతినిధ్యం వహించారు. అందులో 1962–­71 మధ్య వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 
► సీఎంగా పలు భూసంస్కరణలను ప్రవేశపెట్టారు. భూ­గరిష్ట పరిమితి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయించారు. గురుకుల విద్యా వ్యవస్థకు పునాది వేశారు. 
► 1969లో కాంగ్రెస్‌ పార్టీ చీలిన సమయంలో ఇందిరాగాంధీ వెన్నంటి నిలిచారు. 1978లో ఇందిరాగాంధీ స్థాపించిన కాంగ్రెస్‌ (ఐ)లో చేరారు. 

► 1977లో తొలిసారిగా హన్మకొండ ఎంపీగా గెలిచిన ఆయన.. 1984, 1989, 1991, 1996లలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని రాంటెక్, కర్నూల్‌ జిల్లా నంద్యాల, ఒడిశాలోని బరంపురం లోక్‌సభ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. కేంద్రంలో హోం, రక్షణ, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేశారు. 
► 1991లో రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకోవాలని పీవీ భావించారు. ఆ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేయలేదు కూడా. కానీ రాజీవ్‌గాంధీ హత్యతో పీవీ క్రియాశీలకంగా వ్యవహరించాల్సి వచ్చింది. 

► రక్షణ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పారీ్టలోని ఇతర పోటీదారులను వెనక్కినెట్టి మైనారీ్టలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నడిపించే అవకాశం దక్కించుకున్నారు. 1991 జూన్‌ 21న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి ఎంపీ కాకపోవడంతో.. నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఏకంగా ఐదు లక్షల ఓట్ల భారీ మెజార్టీ సాధించి గిన్నిస్‌ రికార్డుల్లో ఎక్కారు. 
► 1995 మే 16 వరకు మైనార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి రాజకీయ దురంధరుడిగా నిలిచారు.
► ఆర్థిక రంగమైనా, రాజకీయ రంగమైనా, అభివృద్ధి పథమైనా, సంక్షేమ బాటలోనైనా.. తాను నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చిన పీవీ 83 ఏళ్ల వయసులో.. 2004 డిసెంబర్‌ 23న ఢిల్లీలో కన్నుమూశారు. తర్వాత 19 ఏళ్ల అనంతరం ఆయనకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. 

పీవీ ఇంట్లోనే పనిజేసిన.. ప్యాంట్లు వేసుకుని సిగ్గుపడ్డం 
నా చిన్నప్పుడు పీవీ ఇంట్ల, వారి పొలాల్లో పనిచేసిన. ఊర్లో అందరం ఆయన ఇంటిని గడి అని పిలిచేటోళ్లం. పీవీ ఇంటివాళ్లు అందరితో కలివిడిగా ఉండేవారు. మాది చిన్న పల్లెటూరు. ధోవతులు తప్ప ప్యాంట్లు తెలియవు. ఎవరన్నా ప్యాంట్‌ వేసుకుంటే వింతగా జూసేది. ఏ ఊరి దొరనో అని గొప్పగా అనుకునే వాళ్లం. ఒకనాడు ఇంటికి వచ్చిన పీవీ దొరను.. మీరెందుకు ప్యాంట్లు వేసుకోరని అడిగిన. ఆయన చిన్నగా నవి్వండు. తర్వాత మా ఊళ్లనే బావులకాడ పనిచేసే పది మందికి ప్యాంట్లు కుట్టిచిండు. వాళ్లు బజార్ల తిరగాలంటే ఒకటే సిగ్గుపడుడు. గుర్తొస్తే నవ్వొస్తది. పీవీకి భారతరత్న వచ్చిందంటే.. మా ఊరికి కాదు దేశానికి గౌరవం ఇచ్చినట్టే..     – కాల్వ రాజయ్య, వంగర గ్రామస్తుడు 

వంగరలో సంబురాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్‌/మంథని: పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో.. ఆయన స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో.. కుటుంబసభ్యులు, గ్రామస్తులు సంబురాలు జరుపుకొన్నారు. పీవీ ఇంటి ఆవరణలో టపాసులు కాల్చారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. స్వీట్లు పంచుకున్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పీవీ సేవలను ఆలస్యంగానైనా గుర్తించి భారతరత్న ఇచ్చినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. అందరు ప్రధానమంత్రులను గౌరవించినట్టుగానే.. పీవీకి కూడా ఢిల్లీలో ఘాట్‌ నిర్మించాలని కోరారు. మరోవైపు పీవీ రాజకీయ అరంగేట్రం చేసి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంథని నియోజకవర్గంలోనూ స్థానికులు సంబురాలు చేసుకున్నారు. 

తెలుగు ప్రజలందరికీ గౌరవం పీవీకి భారతరత్నపై ఏపీ సీఎం జగన్‌ హర్షం 
సాక్షి, అమరావతి :  మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించటంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ‘పీవీ నరసింహారావు రాజనీతిజు్ఞడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు కలిగిన పండితుడు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గౌరవం’అని సీఎం పేర్కొన్నారు. అలాగే, రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చరణ్‌సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ, బీహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు కూడా భారతరత్న ప్రకటించడం యావత్‌ జాతి గరి్వంచదగ్గ విషయమని శుక్రవారం రాత్రి ‘ఎక్స్‌’లో సీఎం ట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement