కొలువుదీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే! | 9 thousand teachers appointed in gurukula educational institutions | Sakshi
Sakshi News home page

కొలువుదీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే!

Published Sun, Mar 10 2024 1:13 AM | Last Updated on Sun, Mar 10 2024 1:13 AM

9 thousand teachers appointed in gurukula educational institutions - Sakshi

గురుకుల విద్యా సంస్థల్లో నియమితులైన 9 వేల మంది టీచర్లు

పలు కేటగిరీల్లో ఇప్పటికే నియామక పత్రాలు అందజేత

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో మరో 20 శాతం మందికి పెండింగ్‌

నాలుగైదు రోజుల్లో పార్లమెంటు ఎన్నికలకు మోగనున్న నగారా

దీంతో లోక్‌సభ ఎన్నికల తర్వాతే పూర్తిగా నియామకపత్రాల పంపిణీ

ఆ తర్వాత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణ, పోస్టింగులు

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా నియమితులైన టీచర్లు కొలువుదీరేందుకు మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ), పోస్ట్రుగాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ), ఫిజికల్‌ డైరెక్టర్‌ (పిడీ), లైబ్రేరియన్, జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌), డిగ్రీ లెక్చరర్‌ (డీఎల్‌) కేటగిరీల్లో దాదాపు 9వేల మంది కొత్తగా ఉద్యోగాలు సాధించారు. పీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్‌ డైరెక్టర్‌ కేటగిరీల్లో ఎంపికైన దాదాపు 2 వేల మందికి గత నెలలో నియామక పత్రాలను సంబంధిత గురుకుల సొసైటీలు అందించాయి.

అదేవిధంగా వారం క్రితం ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్, జూనియర్‌ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్‌ కేటగిరీల్లో ఎంపికైన 5,193 మందికి నియామక పత్రాలు అందజేశారు. వాస్త వానికి ఈ మూడు కేటగిరీల్లో 6,600 మందికి నియామక పత్రాలు అందించాల్సి  ఉండగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు.

మరికొన్ని పోస్టులను సాంకేతిక సమస్యల కారణంగా పెండింగ్‌లో పెట్టారు. కాగా, కోడ్‌ తొలగిన  వెంటనే పూర్తిస్థాయిలో నియామక పత్రాలు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. కానీ మరో నాలుగైదు రోజుల్లో పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉంది. దీంతో లోక్‌ సభ ఎన్నికలు  ముగిసే వరకు గురుకుల టీచర్లు కొలువెక్కేందుకు అవకాశం లేకుండా పోతుంది.

సీనియారిటీ తారుమారు కాకుండా..
గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారు 7 వేలకు పైగానే ఉన్నారు. నియామక పత్రాలు అందుకున్న వారికి నిర్దేశించి మల్టీ జోన్లు, జోన్లు, జిల్లాల వారీగా పోస్టింగ్‌ ఇవ్వాలి. కానీ జిల్లా కేడర్‌ మినహా జోన్లు, మల్టీజోన్‌ కేడర్‌లకు చెందిన కేటగిరీల్లో పోస్టింగ్‌ ఇవ్వాలంటే ఆ పరిధిలోని ఉద్యోగులందరికీ ఒకేసారి కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. జిల్లాస్థాయి కేడర్‌లో పోస్టింగ్‌ ఇస్తే ఇతర ఉద్యోగులకు పోస్టింగ్‌ పరంగా ఇబ్బంది లేనప్పటికీ సీనియార్టీలో భారీ వ్యత్యాసం వస్తుంది.

విధుల్లో చేరిన తేదీతో సర్వీసును పరిగణిస్తుండగా.. ఎన్నికల కోడ్‌ తర్వాత పోస్టింగ్‌ తీసుకున్న వారు జూనియర్లుగా పరిగణనలోకి వస్తారు. దీంతో భవిష్య త్తులో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో సొసైటీలు పోస్టింగ్‌ ప్రక్రియను వాయిదా వేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఈ నెలాఖరు వరకు ఉంటుంది. అంతలోపే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనుండగా.. ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు నియామకపత్రాల అందజేతకు అవకాశం ఉండదు.

ఈ నేపథ్యంలో ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత నియామక పత్రాలు పంపిణీ చేసి, తర్వాత కొత్తగా ఎంపికైన ఉద్యోగులందరికీ ఒకే దఫా కౌన్సెలింగ్‌ నిర్వహించేలా సొసైటీలు కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి. వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాత మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేసుకున్న పోస్టులు దక్కేలా సొసైటీలు సాంకేతిక ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి మే నెలాఖరు సమీపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత జూన్‌ నెల నుంచి 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో కొత్త విద్యా సంవత్సరంలోనే కొత్త టీచర్లు కొలువుదీరుతారని చెపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement