Why Series Of Deaths Happening In Basara IIIT, So May Questions And Doubts - Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీలో ఏం జరుగుతోంది? 

Published Fri, Jun 16 2023 3:41 AM | Last Updated on Fri, Jun 16 2023 9:51 AM

What is happening in Triple IT - Sakshi

నిర్మల్‌: చదువుల తల్లులుగా నిలవాల్సిన వాళ్ల చావుల వెనుక కారణాలేంటి.? ఆత్మహత్యలు చేసుకునేంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? మొన్న దీపిక ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లిఖిత చనిపోవడం వెనుక సరైన కారణమేంటి..? భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన విద్యాక్షేత్రం ఇలా విద్యార్థుల బతుకులను ఎందుకు బలి తీసుకుంటోంది..? అసలు బాసర ట్రిపుల్‌ ఐటీలో ఏం జరుగుతోంది? ఇవీ..సాధారణ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణుల్లో వ్యక్తమవుతున్న సందేహాలు. 

ఈనెల 13న బలవన్మరణానికి పాల్పడిన సంగారెడ్డికి చెందిన వడ్ల దీపిక (17) మృతిపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అదేరోజు నలుగురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ వేసినా ఇప్పటికీ కారణాలు బయటపెట్టకపోవడం సందేహాలకు, క్యాంపస్‌ వాతావరణంపై అనుమానాలకు తావిస్తోంది.

ఇక బుధవారం అర్ధరాత్రి తర్వాత గంగాబ్లాక్‌ నాలుగో అంతస్తుపై నుంచి పడి చనిపోయిన లిఖిత మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబసభ్యులు, వర్సిటీ వర్గాలు చెబుతున్నా.. ఏదో మిస్టరీ ఉందన్న వాదనలూ బలంగా ఉన్నాయి. రాత్రి 2.30 గంటల సమయంలో లిఖిత బయటకు ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆమె మరణంపై గురువారం ఉదయం సెక్యూరిటీ గార్డులు, అధికారులు చెప్పిన వివరణలు వేర్వేరుగా ఉండటం గమనార్హం. 

ఎన్నో ప్రశ్నలు..మరెన్నో అనుమానాలు 
♦ విద్యార్థుల మృతిపై ప్రతిపక్ష పార్టీ లు, విద్యార్థి సంఘాలు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నాయి. పలు ప్రశ్నలూ సంధిస్తున్నాయి. 
♦ పరీక్షలు రాస్తున్న సమయంలో కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని ప్రాణం తీసుకునేదాకా ఎందుకు తీసుకువచ్చారు?
♦ తన మానసిక పరిస్థితిని అంచనా వేయకుండా ఎందుకు బెదిరింపులకు పాల్పడ్డారు..? 
♦ వర్సిటీలో విద్యార్థుల కోసం ఏకంగా ముగ్గురు కౌన్సిలర్లతో కూడిన డిపార్ట్‌మెంట్‌ ఉండగా, వారి దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు?
♦ విద్యార్థులు ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారో ఎవరూ, ఎందుకు లోతుగా పరిశీలించడం లేదు?  
♦  స్థానికంగా ఉంటానని ఇన్‌చార్జిగా వచ్ఛిన వీసీ వెంకటరమణ గెస్ట్‌గానే ఎందుకు వ్యవహరిస్తున్నారు?
♦ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వర్సిటీలో వాతావరణాన్ని, అక్కడి అధ్యాపకులు, ఇన్‌చార్జీల తీరును నిలదీస్తున్నాయి. దీనిపై సర్కారు సీరియస్‌గా దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement