ఆ 23 గ్రామాలు ఆదివాసీలవే  Judgment of Telangana High Court CJ Bench on Adivasi Villages | Sakshi
Sakshi News home page

ఆ 23 గ్రామాలు ఆదివాసీలవే 

Published Thu, Jul 6 2023 6:23 AM | Last Updated on Thu, Jul 6 2023 6:23 AM

Judgment of Telangana High Court CJ Bench on Adivasi Villages - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదివాసీల 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు ఆదివాసీలకే చెందుతాయని పేర్కొంటూ హైకోర్టు ధర్మాసనం బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఆ గ్రామాలన్నీ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ పరిధిలోకే వస్తాయని తేల్చిచెప్పింది. 2014 ఏప్రిల్‌ 17న సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని చెప్పింది.

ఆ గ్రామాలు 5వ షెడ్యూల్‌ పరిధిలోకి రావన్న ఆదివాసీయేతరుల వాదనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం తప్పుబట్టింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ 2014 మేలో దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను కొట్టివేసింది. సింగిల్‌ జడ్జి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేశారని స్పష్టం చేసింది. 

75 ఏళ్ల క్రితం నుంచీ వివాదం.. 
దాదాపు 75 ఏళ్ల క్రితం నుంచి ఈ గ్రామాలకు సంబంధించి ఆదివాసీ, ఆదివాసీయేతరుల మధ్య వివాదం ఉంది. ఇరువర్గాలు ఈ వివాదంపై పలుమార్లు కోర్టులను కూడా ఆశ్రయించాయి. మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీల సర్పంచ్‌ ఎన్నికలు 2005 వరకు జనరల్‌ రొటేషన్‌ (జనాభా దామాషా) పద్ధతిన జరిగాయి. అయితే 2006లో రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలను ‘షెడ్యూల్డ్‌ ఏరియా’గా పేర్కొంటూ, ఎస్టీలకు 100 శాతం రిజర్వేషన్‌ ప్రకటిస్తూ సంబంధిత చట్టాల మేరకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్‌ ఇచ్చింది.

దీనిపై ఆదివాసీయేతరులు కొందరు కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేయడంతో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఇదే అంశంపై వివాదం కొనసాగుతుండటం, గిరిజనేతరులు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. ఇదే క్రమంలో 2014లో వరంగల్‌ జిల్లాకు చెందిన మర్రి వెంకటరాజం, మరికొందరు హైకోర్టులో రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని, ఇది రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 14, 21లను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5 ప్రకారం రాష్ట్రపతి ఈ గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాగా గుర్తించకున్నా.. ప్రభుత్వం మాత్రం వీటి పరిధిలో ఎన్నికలను ఆ చట్టాల మేరకే నిర్వహిస్తోందని తెలిపారు. ఈ గ్రామాల పరిధిలోని అన్ని పదవులను ఆదివాసీలకే రిజర్వు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఈ పిటిషన్‌పై సింగిల్‌ జడ్జి విచారణ జరిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలతో పాటు భూరియా కమిషన్‌ నివేదికను, దాదాపు 70కి పైగా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు కాపీలను పరిశీలించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న న్యాయమూర్తి.. సరిగా పరిశీలన చేయని కారణంగానే రాజ్యాంగం ప్రకారం ఈ గ్రామాలు షెడ్యూల్డ్‌ ప్రాంతాల జాబితాలోకి చేరలేదని చెప్పారు. పిటిషన్‌ను కొట్టివేస్తూ, ఆ గ్రామాలు షెడ్యూల్డ్‌ ప్రాంతం కిందికే వస్తాయని తీర్పునిచ్చారు. దీన్ని సవాల్‌ చేస్తూ వెంకటరాజం అప్పీల్‌ దాఖలు చేయగా, సుదీర్ఘ విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం.. తాజాగా తీర్పును వెలువరించింది.  

తప్పుడు కేసులతో ఎన్నో కోల్పోయాం 
తప్పుడు లిటిగేషన్‌ కేసులతో ఎన్నో ఏళ్లుగా విద్య, ఉద్యోగాలు, ఉపాధి, నీరు, నిధులు కోల్పోయాం. రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను పొందేందుకు 2005 నుంచి తుడుందెబ్బ, ఆదివాసీ సేన, వివిధ గిరిజన ప్రజా సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల సహకారంతో పోరాటం ప్రారంభించాం. 2006లో కేసు గెలిచాం. కానీ గిరిజనేతరులు మళ్లీ మా హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించారు. అయితే హైకోర్టు ఇప్పుడు ఇచ్చిన తీర్పుతో పూర్తిస్థాయిలో విజయం సాధించాం.  
– గొప్ప వీరయ్య, మన్యసీమ పరిరక్షణ సమితి, డోలుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు

ఈ తీర్పుతో ఆదివాసీలకు సకల హక్కులు 
హైకోర్టు తీర్పుతో ఆ 23 గ్రామాల్లో ఆదివాసీ చట్టాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి.   స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకం తొలగిపోనుంది. ఈ ఎన్నికల్లో ఆదివాసీయేతరులు పోటీ చేయడానికి అనర్హులు. ఆదివాసీలు మాత్రమే పోటీ చేయాలి. అటవీ హక్కుల చట్టం ఈ గ్రామాలకు కూడా వర్తిస్తుంది. ఆదివాసీల నుంచి ఇతరులకు భూ బదలాయింపు నిషేధ చట్టం అమల్లోకి వస్తుంది. ఇకపై ఇతర ఆదివాసీలు పొందిన 5వ షెడ్యూల్‌లోని హక్కులన్నీ వీరూ పొందుతారు.  
– న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement