27 మిల్లులు రూ.2వేల కోట్లు | Construction of Sarkari Rice Mills is this year | Sakshi
Sakshi News home page

27 మిల్లులు రూ.2వేల కోట్లు

Published Wed, Jun 21 2023 4:13 AM | Last Updated on Wed, Jun 21 2023 4:13 AM

Construction of Sarkari Rice Mills is this year - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మిల్లింగ్‌ సమస్యను పరిష్కరించేందుకు సర్కారీ రైస్‌ మిల్లుల నిర్మాణం ఈ సంవత్సరంలోనే ప్రారంభం కానుంది. సోమవారం సీఎం కేసీఆర్‌ పౌరసరఫరాల శాఖకు సంబంధించి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే ఏడాదికల్లా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారానే జిల్లాకో మిల్లును ఏర్పాటు చేయనున్నారు.

మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల్లో ప్రతి జిల్లాకూ ఒకటి చొప్పున 27 మిల్లును ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం సుమా ­రు రూ. 2వేల కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గంటకు 60 నుంచి 120 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మరాడించే కెపాసిటీతో ఈ మిల్లులను ఏర్పాటు కానున్నాయి. ప్రైవేటు మిల్లులపై భారాన్ని తగ్గించడంతో పాటు మిల్లర్లపై బాధ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.  

పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా... 
రాష్ట్రంలో ధాన్యం దిగుబడి అనూహ్యంగా పెరిగింది. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 3 కోట్ల టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మిల్లింగ్‌ ప్రధాన సమస్యగా మారింది. రైతుల నుంచి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, బియ్యం(సీఎంఆర్‌)గా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించాలి. ఎఫ్‌సీఐ సెంట్రల్‌ పూల్‌ కింద బియ్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తుంది.

ఈ క్రమంలో ఎక్కడ ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావలసిన డబ్బులు ఆగిపోతాయి. గత మూడేళ్లుగా ప్రతి ఏటా సకాలంలో మిల్లింగ్‌ ప్రక్రియ పూర్తికాక కేంద్రం నుంచి సహకారం అందక రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. గత యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇప్పటికి కూడా మిల్లర్లు మర పట్టించి ఇవ్వలేని పరిస్థితి.  

రాష్ట్రంలో 1,773 మిల్లులు... 
రాష్ట్రంలో ప్రస్తుతం 1,773 మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్‌ జరుగుతోంది. ఇందులో రా మిల్లులు 859 కాగా, బాయిల్డ్‌ మిల్లులు 914. ఒక్కో మిల్లులో ప్రస్తుతం గంటకు 8 నుంచి 10 మెట్రిక్‌ టన్నుల ధాన్యం చొప్పున ప్రతి రోజు రెండు షిఫ్టుల్లో 100 నుంచి 150 మెట్రిక్‌ టన్నుల వరకు మిల్లింగ్‌ కెపాసిటీ మాత్రమే ఉంది. అంటే రాష్ట్రంలోని అన్ని మిల్లుల్లో పూర్తిస్థాయిలో మిల్లింగ్‌ జరిగితే రోజుకు లక్ష నుంచి 2 లక్షల టన్నులకు పైగా ధాన్యం మిల్లింగ్‌ జరిగే అవకాశం ఉంది.

అయితే మిల్లర్లు తమ ప్రైవేటు దందాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో సర్కారుకు ఇచ్చే సీఎంఆర్‌ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గంటకు 60 నుంచి 120 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మరాడించే భారీ మిల్లులను పౌరసరఫరాల సంస్థ ద్వారా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడం గమనార్హం. మిల్లులతో పాటు బియ్యం ఆధారిత పరిశ్రమలను కూడా అక్కడే ఉండేలా ప్రణాళికలు తయారు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం ఆదేశించారు.  

సీఎం సూచన మేరకు నిర్మాణాలు: మంత్రి గంగుల  
సీఎం సూచన మేరకు ప్రభుత్వమే పౌరసరఫరాల సంస్థ ద్వారా రైస్‌ మిల్లులను నిర్మించాలని నిర్ణయించింది. గంటకు 60 నుంచి 120 టన్నుల కెపాసిటీ గల మిల్లులను తీసుకొస్తాం. వచ్చే ఏడాది కల్లా నిర్మాణాలు పూర్తి చేయాలనేది ఆలోచన. మిల్లులతో పాటు బియ్యం ఆధారిత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను కూడా కార్పొరేషన్‌ ద్వారా నిర్వహించే ఆలోచనలో ఉన్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement