సింగరేణి @ 4000 మెగావాట్లు ! | Company decided to increase the capacity of thermal power | Sakshi
Sakshi News home page

సింగరేణి @ 4000 మెగావాట్లు !

Published Wed, Jun 7 2023 3:52 AM | Last Updated on Wed, Jun 7 2023 3:52 AM

Company decided to increase the capacity of thermal power - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనుల సంస్థ విద్యుదుత్పత్తి రంగంలో తెలంగాణ జెన్‌కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రధానంగా కొత్త విద్యుత్‌ కేంద్రాల స్థాపన ద్వారా తమ థర్మల్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 4000 మెగావాట్లకు పెంచుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిపిన సింగరేణి సంబురాల్లో  సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.

సింగరేణి సంస్థ ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద 2 వేల ఎకరాల్లో 1,200(2్ఠ600) మెగావాట్ల థర్మల్‌  విద్యుత్‌ కేంద్రాన్ని నిర్వహిస్తూ, ఏటా రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అదే ప్రాంగణంలో మరో  800 మెగావాట్ల కొత్త సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులను ఇటీవలే ప్రారంభించింది.

800 మెగావాట్ల మరో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించి థర్మల్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 2800 మెగావాట్లకు పెంచుకోలని ఈ ఏడాది ప్రారంభంలోనే సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజాగా 4000 మెగావాట్లకు థర్మల్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించడంతో, మరో 1200(2్ఠ600) మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను సంస్థ ఏర్పాటు చేయాల్సి ఉండనుంది. 

4400 మెగావాట్లకూ పెరిగే అవకాశం.. 
కొన్నేళ్ల నుంచి సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో 600 మెగావాట్ల కొత్త థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదు. దాంతో సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో 1600(2్ఠ800) మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లను సింగరేణి నిర్మించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే సింగరేణి థర్మల్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం 4400 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉంది.  

జెన్‌కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ.. 
తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) రాష్ట్రంలో మొత్తం 4042.5 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పూర్తయితే సంస్థ పూర్తి సామర్థ్యం 8042.5 మెగావాట్లకు పెరగనుంది.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎన్టీపీసీ’ రామగుండంలో 2600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలోని 1600(2్ఠ800) మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పూర్తయితే సంస్థ సామర్థ్యం 4200 మెగావాట్లకు పెరగనుంది. అదే సమయంలో 4400 మెగావాట్ల థర్మల్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో సింగరేణి ఎన్టీపీసీని వెనక్కి నెట్టి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. 

సౌర విద్యుత్‌ రంగంలో సైతం.. 
సింగరేణి సంస్థ భారీగా సౌర విద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  300 మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టి,  224 మెగావాట్ల ప్లాంట్ల పనులు పూర్తయి విద్యుదుత్పత్తి జరుగుతోంది. మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల పనులు చివరి దశలో ఉన్నాయి. భూపాలపల్లి, మందమర్రి, మణుగూరులో మరో 250 మెగావాట్ల సౌర విద్యత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసి సంస్థ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 550 మెగావాట్లకు పెంచుకోవాలని నిర్ణయించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement