ఐర్లాండ్‌ చరిత్రాత్మక విజయం.. రెండు సిరీస్‌లలోనూ గెలుపు | ZIM Vs IRE 3rd ODI: Ireland Beat Zimbabwe Historic ODI Series Win | Sakshi
Sakshi News home page

ZIM Vs IRE: ఐర్లాండ్‌ చరిత్రాత్మక విజయం.. రెండు సిరీస్‌లలోనూ గెలుపు

Published Mon, Dec 18 2023 1:39 PM | Last Updated on Mon, Dec 18 2023 2:51 PM

ZIM Vs IRE 3rd ODI: Ireland Beat Zimbabwe Historic ODI Series Win - Sakshi

అంతర్జాతీయ వన్డేల్లో ఐర్లాండ్‌ చరిత్రాత్మక విజయం సాధించింది. జింబాబ్వే గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ గెలిచింది. అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య జట్టును చిత్తు చేసి 2-0 తేడాతో జయభేరి మోగించింది. కాగా మూడు టీ20, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు ఐరిష్‌ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.

ఇందులో భాగంగా.. డిసెంబరు 7న మొదలైన టీ20 సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న ఐర్లాండ్‌.. వన్డేల్లోనూ సత్తా చాటింది. బుధవారం (డిసెంబరు 13) నాటి తొలి మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. 

ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో జింబాబ్వేపై నెగ్గిన ఐర్లాండ్‌.. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుత విజయం సాధించింది. హరారే వేదికగా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న పాల్‌ స్టిర్లింగ్‌ బృందం జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 

ఐరిష్‌ పేసర్లు గ్రాహం హ్యూమ్‌, కర్టిస్‌ కాంఫర్‌ చెరో నాలుగు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో 40 ఓవర్లలోనే జింబాబ్వే కథ ముగిసింది. కేవలం 197 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ జాయ్‌లార్డ్‌ గుంబీ 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, వన్‌డౌన్‌ బ్యాటర్‌ కైటానో 13 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగారు.

అయితే, వర్షం ఆటంకం కలిగించడంతో డీఎల్‌ఎస్‌ పద్ధతిలో ఐర్లాండ్‌ టార్గెట్‌ను 201గా నిర్దేశించారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఐరిష్‌ జట్టుకు ఓపెనర్‌ ఆండ్రూ బల్బిర్నీ అదిరిపోయే ఆరంభం అందించాడు. మొత్తంగా 102 బంతుల్లో 82 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌(8) నిరాశపరచగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన కర్టిస్‌ కాంఫర్‌ 40, హ్యారీ టెక్టార్‌ 33 పరుగులు సాధించారు.

బల్బిర్నీతో కలిసి లోర్కాన్‌ టకర్‌ 29 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఐర్లాండ్‌ 2-0తో సొంతం చేసుకుంది. బల్బిర్నీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. కర్టిస్‌ కాంఫర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు.

చదవండి: IPL 2024: ఐపీఎల్‌ వేలానికి సర్వం సిద్దం.. కొత్త ఆక్షనీర్‌ ప్రకటన! ఎవరీ మల్లికా సాగర్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement