Usain Bolt Life Story: Interesting Unknown Facts About His Career In Telugu - Sakshi
Sakshi News home page

Usain Bolt Biography: పది క్షణాల్లో ప్రపంచాన్ని జయించడం అంటే ఇదేనేమో! అప్పుడు దారితప్పినా..

Published Sun, Mar 12 2023 7:47 AM | Last Updated on Sun, Mar 12 2023 1:10 PM

Usain Bolt Life Story Career Inspiring Journey Interesting Unknown Facts - Sakshi

మెరుపు ఎలా ఉంటుందో దగ్గరి నుంచి చూశారా..
అతని పరుగు చూస్తే చాలు తెలిసిపోతుంది!
రెప్పపాటు కాలంలో, కళ్లు మూసి తెరిచేలోగా అంటూ విశేషణాలు తరచుగా వాడేస్తుంటామా..  
వాటి అసలు అర్థం ఆ వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది!
పది క్షణాల్లో ప్రపంచాన్ని జయించడం ఏమిటో చెప్పాలా.. అథ్లెటిక్స్‌లో అతడు సాధించిన ఘనతలు చూస్తే మరెవరికీ అవి సాధ్యం కావని అర్థమవుతుంది! 

ఒకటి కాదు రెండు కాదు, ట్రాక్‌ పైకి అడుగు పెట్టగానే అతని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా సిద్ధంగా ఉన్న ప్రపంచ రికార్డులు, ఒలింపిక్స్‌ పతకాలు, 
లెక్కలేనంత అభిమాన గణం.. 
ఎంతటి సాధారణ నేపథ్యమైనా  సరే విజయానికి 
దానితో పని లేదని.. 
ఆటతో, శ్రమతో, పట్టుదలతో శిఖరానికి చేరవచ్చని నిరూపించిన దిగ్గజం!
తన ప్రతి పరుగుతో ట్రాక్‌ను శాసించిన 
ఆ అద్భుతం..  ఉసేన్‌ బోల్ట్‌!! 

మైకేల్‌ హోల్డింగ్, కోట్నీ వాల్ష్‌.. ప్రపంచ క్రికెట్‌కు జమైకా అందించిన దిగ్గజ పేస్‌ బౌలర్లు. ఉసేన్‌ బోల్ట్‌ కూడా వారి బాటలోనే ఫాస్ట్‌ బౌలర్‌ కావాలనుకున్నాడు. చిన్నతనం నుంచి క్రికెట్‌పైనే దృష్టి పెట్టాడు. అయితే అతని భవిష్యత్తు మరో రూపంలో ఎదురుచూస్తోందని బోల్ట్‌కు తెలీదు.

పాఠశాల స్థాయి క్రికెట్‌ టోర్నీలో బోల్ట్‌ ఆడుతున్నప్పుడు చూసిన కోచ్‌ అతనికి మరో మార్గాన్ని నిర్దేశించాడు. నీకున్న మెరుపు పరుగుకు క్రికెట్‌ కంటే అథ్లెటిక్స్‌ బెటర్‌. ఆ రంగమైతే మరింత ‘వేగంగా’ ఎదుగుతావు అని చెప్పాడు. అప్పుడే సీన్‌ లోకి వచ్చిన అథ్లెటిక్స్‌ కోచ్‌ మెక్‌నీల్‌ ఆ కుర్రాడిలోని ప్రతిభను సానబెట్టడంతో బంగారు భవిష్యత్తుకు పునాది పడింది.

ఆ తర్వాత అతని సహజ ప్రతిభతో స్కూల్‌ స్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో బోల్ట్‌కు ఎదురు లేకుండా పోయింది. ఆ సమయంలో ఎంతో గుర్తింపు ఉన్న కరీబియన్‌ స్పోర్ట్స్‌ (కరిఫ్తా గేమ్స్‌)లో రెండు రజత పతకాలు సాధించడంతో అతని ఆట గురించి జమైకా బయట కూడా తెలిసింది. 

కొత్త తారగా దూసుకెళ్లి..
అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య జూనియర్, యూత్‌ స్థాయిలోనూ అధికారికంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తుంది. ఆ టోర్నీల్లో రాణిస్తే ఇక బంగారు భవిష్యత్తు ఉండటం ఖాయమని ఒక అంచనా. 15 ఏళ్ల వయసులో బోల్ట్‌ హంగేరీలో జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. ప్రపంచ వేదికపై ఇదే అతనికి తొలి మెగా ఈవెంట్‌.

అయితే 200 మీటర్ల పరుగులో అతను కనీసం ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయాడు. ఇదే కారణం వల్ల కావచ్చు.. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు అతను ఆటపై దృష్టి పెట్టకుండా దూరం జరుగుతూ పోయాడు. అయితే కోచ్‌లు సరైన సమయంలో కల్పించుకోవడంతో మళ్లీ దారిలోకి వచ్చాడు. మరుసటి ఏడాదే కింగ్‌స్టన్‌లో వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌ షిప్‌ జరిగింది.

సొంతగడ్డ నుంచే అద్భుతం మొదలైందా అన్నట్లుగా ఈ ఈవెంట్‌లో బోల్ట్‌ చెలరేగిపోయాడు. 200 మీటర్ల పరుగులో స్వర్ణంతో పాటు మరో రెండు రజతాలు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పుడు మొదలైన ఆ జోరు ఆ తర్వాత వేగంగా కొనసాగింది. ఎక్కడ పరుగెత్తినా, ఎక్కడ పాల్గొన్నా వరుస పతకాలు, రికార్డులు వచ్చి చేరాయి. ఈసారీ మరో ప్రమాద హెచ్చరిక!

తాజా విజయాలతో బోల్ట్‌కు సరదాలు ఎక్కువయ్యాయని, క్లబ్‌లలో పార్టీలు, జంక్‌ ఫుడ్‌లతో దారి తప్పుతున్న అతడిని జాగ్రత్తగా చూసుకోమని జమైకా ప్రభుత్వమే నేరుగా జమైకా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌కు చెప్పింది. దాంతో మళ్లీ కొత్తగా దారిలోకి తీసుకు రావాల్సి వచ్చింది. అయితే ఈ సారి ఇదే ఆఖరు! ఆ దిగ్గజం మళ్లీ ట్రాక్‌ తప్పాల్సిన అవసరం రాలేదు. 

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌తో మొదలు..
బోల్ట్‌.. ఒలింపిక్స్‌ ఎంట్రీ 2004 ఏథెన్స్‌లోనే జరిగింది. అయితే తాను కూడా దానిని ఎంతో తొందరగా మర్చిపోవాల్సి వచ్చింది. 200 మీటర్ల పరుగులో తొలి రౌండ్‌లోనే అతను వెనుదిరిగాడు. తర్వాతి ఏడాది తొలి ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో కూడా దాదాపు ఇదే పరిస్థితి.

ఫైనల్స్‌లో అతను చివరి స్థానంలో నిలిచాడు. జూనియర్‌ స్థాయిలో చూపిన ఘనతలు సీనియర్‌కు వచ్చే సరికి కనిపించకపోవడంతో బోల్ట్‌పై ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అయితే ఇది అతనిలో కసిని పెంచింది. దాదాపు రెండేళ్ల పాటు అన్నీ వదిలి అతను ఒకే ఒక లక్ష్యంతో తీవ్ర సాధన చేశాడు. తన స్ప్రింట్స్‌ నైపుణ్యాన్ని మెరుగుపరచుకొని 200 మీటర్లే కాదు, 100 మీటర్ల పరుగులోనూ పాల్గొంటానంటూ కోచ్‌తో పట్టుబట్టి మరీ తన మాట నెగ్గించుకున్నాడు.

2007 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో గెలిచిన 2 రజతాలు బోల్ట్‌ను కొత్తగా ప్రపంచానికి పరిచయం చేశాయి. ఆ తర్వాత వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో, వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లో అతని విజయధ్వానం వినిపించింది. 

అలా ముగిసింది..
2017 ఆగస్టు.. లండన్‌లో వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ జరుగుతోంది. అంతకు ముందు ఏడాదే రియో ఒలింపిక్స్‌లో తన అద్భుత ప్రదర్శన తర్వాత బోల్ట్‌ ఆటకు గుడ్‌బై చెప్పవచ్చని వినిపించింది. అయితే కొన్ని ఒప్పందాలు, ఇతర కారణాల వల్ల అతను మరో మెగా ఈవెంట్‌కు సిద్ధం కావాల్సి వచ్చింది. అయితే పతకాలు సాధించే చాన్సెస్‌ పట్ల కొన్ని సందేహాలు ఉన్నా.. అతనిపై అభిమానులకున్న క్రేజ్‌ ఇసుమంతైనా తగ్గలేదు. అది 100 మీటర్ల రేస్‌లో కనిపించింది.

అయితే భయపడినట్లుగానే అనూహ్య ఫలితం వచ్చింది. పదేళ్ల కాలం పాటు ఓటమి లేకుండా ట్రాక్‌ను శాసించిన బోల్ట్‌ చివరకు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 200 మీటర్ల పందెంలో పాల్గొనని బోల్ట్‌.. తన అభిమానుల కోసం దేశం తరఫున 4* 100 మీటర్‌ రిలేలో పరుగెత్తేందుకు సంకల్పించాడు. అది బోల్ట్‌ చివరి రేస్‌గా ప్రపంచం అంతా ఆసక్తిగా తిలకించింది.

అయితే చివరి లెగ్‌లో జమైకా ఆశలు మోస్తూ పరుగు ప్రారంభించిన బోల్ట్‌ సగం దూరానికే కుప్పకూలిపోయాడు. కండరాలు పట్టేయడంతో ముందుకు వెళ్లలేక కన్నీళ్లపర్యంతం అయ్యాడు. నిర్వహకులు వీల్‌చైర్‌ తీసుకు రాగా, వారిని నివారిస్తూ తన సహచరులు తోడుగా రాగా ‘ఫినిషింగ్‌ లైన్‌’ను దాటాడు. అథ్లెటిక్స్‌ ట్రాక్‌పై ఒక అత్యద్భుత ప్రస్థానం చివరకు అలా ముగిసింది. 

బంగారాల సింగారం..
అథ్లెటిక్స్‌ చరిత్రలో అనితరసాధ్యమైన రికార్డులు బోల్ట్‌ పేరిట ఉన్నాయి. మూడు ఈవెంట్లు 100 మీ., 200 మీ., 4* 100 మీ. రిలేలలో మూడేసి చొప్పున వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో అతను 9 స్వర్ణాలు గెలుచుకున్నాడు. 2008 బీజింగ్, 2012 లండన్‌ , 2016 రియో ఒలింపిక్స్‌లలో అతను ఈ ఘనత సాధించాడు. 6 ప్రపంచ చాంపియన్‌ షిప్‌లతో కలిపి 11 స్వర్ణాలు, 2 రజతాలు, ఒక కాంస్యం అతను సాధించాడు. 

2008లో స్వర్ణం సాధించిన జమైకా రిలే జట్టులో సభ్యుడైన నెస్టా కార్టర్‌ 2017లో డోపింగ్‌లో పట్టుబడటంతో ఆ ఫలితాన్ని రద్దు చేసి పతకం వెనక్కి తీసుకోవడంతో బోల్ట్‌ ఖాతాలో 8 స్వర్ణాలు మిగిలాయి. అయితే ఇది తన ఘనతను ఏమాత్రం తగ్గించదని అతను చెప్పుకున్నాడు. 

టు ద వరల్డ్‌
ఉసేన్‌ బోల్ట్‌ అనగానే అందరి మదిలో మెదిలే దృశ్యం విజయానంతరం అతను ఇచ్చే పోజ్‌! సామాన్యుడి నుంచి ప్రపంచ స్థాయికి  ఎదిగానని చెప్పేలా ‘టు ద వరల్డ్‌’ అంటూ అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక దశలో ప్రపంచ ప్రముఖులు ఎంతో మంది దీనిని అనుకరించి చూపించడం విశేషం.
-మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది 
చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement