SRH Vs MI: సన్‌రైజర్స్‌ ‘రన్‌’రంగం | IPL 2024 SRH Vs MI: Sunrisers Hyderabad Great Win Against Mumbai Indians By 31 Runs, Check Score Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024 SRH Vs MI: సన్‌రైజర్స్‌ ‘రన్‌’రంగం

Published Thu, Mar 28 2024 1:26 AM | Last Updated on Thu, Mar 28 2024 9:21 AM

Sunrisers Great win against Mumbai Indians by 31 runs - Sakshi

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు (277) సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

ముంబై ఇండియన్స్‌పై 31 పరుగులతో ఘన విజయం

చెలరేగిన క్లాసెన్, అభిషేక్‌ శర్మ, హెడ్‌

సునామీ బ్యాటింగ్‌... విధ్వంస ప్రదర్శన... వీర విజృంభణ... అద్భుతం...  అసాధారణం... అసమానం... ఎలాంటి విశేషణాలు ఉపయోగించుకుంటారో మీ ఇష్టం... ఎన్నాళ్లుగానో ఇలాంటి ఇన్నింగ్స్‌ ఎదురు చూస్తున్న సన్‌రైజర్స్‌ ఆట సగటు  అభిమానికి ఫుల్‌ జోష్‌ను పంచింది... సంపూర్ణ ఆనందాన్ని అందించింది... బౌండరీల వర్షంతో ఉప్పల్‌ స్టేడియంలో పరుగుల వరద పారింది... 19 ఫోర్లు, 18 సిక్సర్లు...  ముంబై బౌలింగ్‌పై హైదరాబాద్‌ ఊచకోత మామూలుగా సాగలేదు... ముగ్గురు బ్యాటర్లు ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించడంతో ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక టీమ్‌ స్కోరు నమోదైంది.

ముందుగా హెడ్‌ 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేస్తే...  కొద్ది క్షణాల్లోనే 16 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి అభిషేక్‌ శర్మ తానూ తక్కువ కాదని చూపించాడు. నన్ను ఎలా మరచిపోతారన్నట్లుగా ఆ తర్వాత క్లాసెన్‌ తనదైన శైలిలో  చెలరేగిపోయాడు... భారీ ఛేదనలో ముంబై కొంత వరకు ప్రయత్నించినా లక్ష్యం మరీ పెద్దదైపోయింది... చివరకు సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ విజయగర్జన చేసింది. ఓవరాల్‌గా టి20ల్లోనే అత్యధిక పరుగులు, అత్యధిక సిక్స్‌లు నమోదైన మ్యాచ్‌గా సన్‌రైజర్స్,  ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కింది.   

సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సత్తా చాటింది. ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ 17వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో కమిన్స్‌ బృందం ఘన విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన పోరులో రైజర్స్‌ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.

హెన్రిచ్‌ క్లాసెన్‌ (34 బంతుల్లో 80 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు)... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు)... ట్రవిస్‌ హెడ్‌ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు సాధించింది. ‘లోక్‌ బాయ్‌’ తిలక్‌ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), టిమ్‌ డేవిడ్‌ (22 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.  

వీర విధ్వంసం... 
7, 11, 22, 5, 13, 23, 21, 15, 11, 20 (తొలి 10 ఓవర్లలో 148)... 13, 12, 7, 11, 11, 12, 18, 11, 13, 21 (తర్వాతి 10 ఓవర్లలో 129)... సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ సాగిన తీరిది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (11) విఫలం కాగా... మిగిలిన నలుగురు బ్యాటర్లు ముంబై బౌలర్లపై విరుచుకు పడ్డారు. అండర్‌–19 వరల్డ్‌ కప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచి తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న 18 ఏళ్ల క్వెనా మఫాకా వీరిలో ముందుగా బలయ్యాడు.

అతని తొలి ఓవర్లో వరుసగా 6, 6, 4, 4 బాదిన హెడ్‌... హార్దిక్‌ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. కొయెట్జీ ఓవర్లోనూ వరుసగా 4, 4, 6 బాదిన హెడ్‌ 18 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చావ్లా వేసిన తర్వాతి ఓవర్లో అభిషేక్‌ 3 భారీ సిక్సర్లతో స్వాగతం పలికాడు. హెడ్‌ వెనుదిరిగిన తర్వాత అభిషేక్‌ మరింత చెలరేగిపోయాడు. మఫాకా ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 కొట్టిన అతను 16 బంతులకే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు.

 11వ ఓవర్‌ చివరి బంతికి అభిషేక్‌ అవుట్‌ కాగా... తర్వాతి 9 ఓవర్ల బాధ్యతను క్లాసెన్‌ తీసుకున్నాడు. మిత్రుడు మార్క్‌రమ్‌ (28 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) సహకారంతో అతను సిక్సర్లతోనే పరుగులు రాబడుతూ దూసుకుపోయాడు. మఫాకా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన అతను 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. 14.4 ఓవర్లలోనే జట్టు స్కోరు 200 పరుగులు దాటింది.

తన తొలి 3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి ఒకింత మెరుగైన ప్రదర్శన ఇచ్చిన బుమ్రా కూడా తన చివరి ఓవర్లో క్లాసెన్‌ జోరుకు 13 పరుగులు ఇచ్చుకున్నాడు. ములానీ వేసిన ఆఖరి ఓవర్లోనూ వరుసగా 4, 6, 6 బాదిన క్లాసెన్‌ ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరును తన జట్టును అందించాడు. సన్‌రైజర్స్‌ హెడ్‌ స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఉమ్రాన్‌ మలిక్‌ను బరిలోకి దించింది.  

తిలక్‌ వర్మ పోరాటం... 
ఓవర్‌కు 13.9 పరుగులు... భారీ లక్ష్య ఛేదనలో ఈ రన్‌రేట్‌తో పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబై బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనింగ్, ఆ తర్వాత మూడో వికెట్‌ భాగస్వామ్యాలు దూకుడుగానే సాగినా... ఇది సరిపోలేదు. రోహిత్‌ శర్మ (12 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆరంభించి తొలి వికెట్‌కు 20 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు. ఉనాద్కట్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ కొట్టిన కిషన్‌... భువీ వేసిన తర్వాతి ఓవర్లో 3 సిక్స్‌లు, ఫోర్‌ బాదాడు.

అయితే వీరిద్దరిని 10 పరుగుల వ్యవధిలో అవుట్‌ చేసి రైజర్స్‌ పైచేయి సాధించింది. ఆ తర్వాత తిలక్, నమన్‌ ధీర్‌ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరింత దూకుడు ప్రదర్శించారు. వీరిద్దరు 37 బంతుల్లోనే 84 పరుగులు జత చేశారు. నమన్‌ వెనుదిరిగాక, షహబాజ్‌ ఓవర్లో 3 భారీ సిక్సర్లు కొట్టిన తిలక్‌ 24 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. చివర్లో డేవిడ్, హార్దిక్‌ పాండ్యా (24) పోరాటం ఫలితమివ్వలేదు.
  
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) డేవిడ్‌ (బి) పాండ్యా 11; హెడ్‌ (సి) నమన్‌ (బి) కొయెట్జీ 62; అభిషేక్‌ శర్మ (సి) నమన్‌ (బి) చావ్లా 63; మార్క్‌రమ్‌ (నాటౌట్‌) 42; క్లాసెన్‌ (నాటౌట్‌) 80; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 277. వికెట్ల పతనం: 1–45, 2–113, 3–161. బౌలింగ్‌: మఫాకా 4–0–66–0, పాండ్యా 4–0–46–1, బుమ్రా 4–0–36–0, కొయెట్జీ 4–0–57–1, చావ్లా 2–0–34–1, షమ్స్‌ ములానీ 2–0–33–0.  

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) అభిషేక్‌ (బి) కమిన్స్‌ 26; ఇషాన్‌ కిషన్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) షహబాజ్‌ 34; నమన్‌ ధీర్‌ (సి) కమిన్స్‌ (బి) ఉనాద్కట్‌ 30; తిలక్‌ వర్మ (సి) మయాంక్‌ (బి) కమిన్స్‌ 64; పాండ్యా (సి) క్లాసెన్‌ (బి) ఉనాద్కట్‌ 24; టిమ్‌ డేవిడ్‌ (నాటౌట్‌) 42; షెఫర్డ్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 11; 
మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 246. వికెట్ల పతనం: 1–56, 2–66, 3–150, 4–182, 5–224. 
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–53–0, ఉనాద్కట్‌ 4–0–47–2, షహబాజ్‌ 3–0–39–1, కమిన్స్‌ 4–0–35–2, ఉమ్రాన్‌ 1–0–15–0, మర్కండే 4–0–52–0.  



523  ఓవరాల్‌ టి20 క్రికెట్‌లో అత్యధిక  పరుగులు నమోదైన మ్యాచ్‌గా హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ నిలిచింది. గత ఏడాది మార్చి 26న సెంచూరియన్‌ పార్క్‌లో దక్షిణాఫ్రికా (18.5 ఓవర్లలో 259/4), వెస్టిండీస్‌ (20 ఓవర్లలో 258/5) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 517 పరుగులు నమోదయ్యాయి. ఇక ఐపీఎల్‌ మ్యాచ్‌ల విషయానికొస్తే 2010లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (246/5), రాజస్తాన్‌ రాయల్స్‌ (223/5) మ్యాచ్‌లో మొత్తం 469 పరుగులు వచ్చాయి.  

38 హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లో నమోదైన సిక్స్‌లు. ఒక టి20 మ్యాచ్‌లో ఇవే అత్యధికం. 2018లో అఫ్గానిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా లెజెండ్స్, కాబుల్‌ జ్వానన్‌ మ్యాచ్‌లో మొత్తం 37 సిక్స్‌లు వచ్చాయి.  

148 ముంబైతో మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి 10 ఓవర్లలో చేసిన పరుగులు. ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఇవే అత్యధికం. 

ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్‌ X ఢిల్లీ 
వేదిక: జైపూర్‌ 

రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement