WC 2011: ఊహించని షాకులు.. ఆ మధుర జ్ఞాపకాలు మరువగలమా?! 'Still Get Goosebumps': Yuvraj Singh, Suresh Raina Reminisce About 2011 World Cup Win | Sakshi
Sakshi News home page

WC 2011: జగజ్జేతగా టీమిండియా.. ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి!

Published Tue, Apr 2 2024 2:03 PM | Last Updated on Tue, Apr 2 2024 3:19 PM

Still Get Goosebumps Yuvraj Suresh Raina Reminisce About 2011 World Cup Win - Sakshi

‘‘2011.. మేము ప్రపంచకప్‌ ఎత్తిన రోజు. ఆ చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అద్భుతమైన జట్టుతో మరుపురాని జ్ఞాపకాలు’’..  ‘‘ఆ అద్భుత క్షణంలోకి మరొక్కసారి’’.. టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యులైన సురేశ్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌ భావోద్వేగం.

సరిగ్గా పదమూడేళ్ల క్రితం ఇదే రోజున.. ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్‌ జట్టు జగజ్జేతగా అవతరించింది. సొంత గడ్డపై ప్రఖ్యాత వాంఖడే మైదానంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది ధోని సేన.

క్రికెట్‌ దేవుడిగా పేరొందిన సచిన్‌ టెండుల్కర్‌ చిరకాల కలను నెరవేర్చి.. అపూర్వ విజయాన్ని అతడికి బహుమతిగా అందించింది. నాడు శ్రీలంకతో ఫైనల్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సిక్స్‌ బాదగానే కోట్లాది మంది భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి.

వాంఖడేలో ఉన్న దాదాపు 33 వేల మంది మా తుజే సలాం అంటూ జట్టును ఉత్సాహపరిచారు. మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు యావత్‌ భారతావని ఆనందంతో పులకించిపోయింది. 

ఆ అపురూప క్షణాన్ని చెరగని జ్ఞాపక​ంగా గుండెల్లో పదిలపరచుకున్నారు అభిమానులు. వారిలో మీరూ ఒకరా?!.. మరి ఆనాటి మ్యాచ్‌ విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందామా?

శుభారంభం లభించినా
ముంబైలోని వాంఖడే స్టేడియం.. టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్‌ కుమార్‌ సంగక్కర తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. భారత పేసర్‌ జహీర్‌ ఖాన్‌ ఆరంభంలోనే ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ(2)ను పెవిలియన్‌కు పంపాడు. 

అనంతరం హర్భజన్‌ సింగ్‌ మరో ఓపెనర్‌ తిలకరత్రె దిల్షాన్‌(33)ను అవుట్‌ చేయగా.. యువరాజ్‌ సింగ్‌.. కెప్టెన్‌ కుమార్‌ సంగక్కర(48) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

వరుస వికెట్లు తీసిన టీమిండియా ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ మహేళ జయవర్ధనే అజేయ శతకం(103)తో విరుచుకుపడ్డాడు. అయితే, మిగతా వాళ్లలో మళ్లీ ఒక్కరు కూడా కనీసం 35 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్‌ ముగిసింది.

ఊహించని షాకులు
ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఊహించని షాకిచ్చాడు లసిత్‌ మలింగ. ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌(0)ను డకౌట్‌ చేశాడు. మైదానమంతా నిశ్శబ్దం. ఆ తర్వాత కాసేపటికే సచిన్‌ టెండుల్కర్‌(18) కూడా అవుట్‌!

ఊపిరులూదిన గంభీర్‌
ఆ సమయంలో నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ భారత శిబిరంతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నింపాడు వన్‌డౌన్‌ బ్యాటర్‌ గౌతం గంభీర్‌. 122 బంతులు ఎదుర్కొని 97 పరుగులు సాధించాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. అంతకంటే విలువైన ఇన్నింగ్సే ఆడాడు.

ధనాధన్‌ ధోని
మిగిలిన వాళ్లలో విరాట్‌ కోహ్లి 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ధనాధన్‌ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు కెప్టెన్‌ ధోని. యువరాజ్‌ సింగ్‌(21 నాటౌట్‌)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను గెలిపించాడు. 

ఆ క్షణాన్ని మర్చిపోగలమా?
ఇక నలభై తొమ్మిదవ ఓవర్‌ రెండో బంతికి అతడు కొట్టిన విన్నింగ్‌ సిక్స్‌ భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్షణంగా నిలిచిపోతుందనడం అతిశయోక్తి కాదు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 79 బంతులు ఎదుర్కొన్న ధోని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకపై జయభేరి మోగించిన భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడింది. దీంతో వాంఖడేతో పాటు దేశమంతటా సంబరాలు అంబరాన్నంటాయి.

చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. తొలి జట్టుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement