తప్పిదారి షాహిన్‌ కెప్టెన్‌ అయ్యాడు: అల్లుడిపై ఆఫ్రిది విమర్శలు! | Shaheen Became Captain By Mistake: Shahid Afridi Cheeky Dig At Son In Law While Praising Rizwan - Sakshi
Sakshi News home page

Shahid Afridi: తప్పిదారి షాహిన్‌ కెప్టెన్‌ అయ్యాడు.. ఆ అర్హత అతడికే ఉంది

Published Mon, Jan 1 2024 5:00 PM | Last Updated on Mon, Jan 1 2024 5:52 PM

Shaheen Became Captain By Mistake: Shahid Afridi Cheeky Dig at Son In Law - Sakshi

పాకిస్తాన్‌ టీ20 జట్టు కెప్టెన్‌ ఎంపిక గురించి ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదో తప్పిదారి షాహిన్‌ ఆఫ్రిది సారథి అయ్యాడని సరదాగా వ్యాఖ్యానించాడు. అతడికి బదులు మహ్మద్‌ రిజ్వాన్‌కు పగ్గాలు అప్పజెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. 

భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌-2023 ముగిసిన తర్వాత పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్‌ ఆజం.. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.

ఈ క్రమంలో అతడి స్థానంలో షాన్‌ మసూద్‌ను కెప్టెన్‌ చేసిన పాక్‌ క్రికెట్‌ బోర్డు.. టీ20 సారథ్య బాధ్యతలను పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిదికి అప్పగించింది. ఈ నేపథ్యంలో మసూద్‌ నాయకత్వంలో టెస్టు సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన పాక్‌ జట్టు.. తదుపరి షాహిన్‌ నేతృత్వంలో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. 

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న షాహిద్‌ ఆఫ్రిది ఈ విషయాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆటగాడిగా రిజ్వాన్‌ను నేను ఆరాధిస్తాను. కఠిన శ్రమ, ఆట పట్ల నిబద్ధత.. అతడిని అత్యుత్తమ క్రికెటర్‌గా నిలిపాయి.

కేవలం ఆట మీద మాత్రమే దృష్టి సారించి ఎక్కడ ఎంత వరకు నైపుణ్యాలను వాడుకోవాలో అతడికి బాగా తెలుసు. తనొక గొప్ప యోధుడు’’ అని మహ్మద్‌ రిజ్వాన్‌ను ప్రశంసించాడు.

అదే విధంగా.. ‘‘రిజ్వాన్‌ను పాక్‌ టీ20 కెప్టెన్‌గా చూడాలనుకున్నాను. కానీ తప్పిదారి షాహిన్‌ ఆఫ్రిది సారథిగా ఎంపికయ్యాడు’’ అని షాహిద్‌ ఆఫ్రిది పేర్కొన్నాడు. ఆ సమయంలో హ్యారిస్‌ రవూఫ్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌లతో పాటు అక్కడే ఉన్న షాహిన్‌ ఆఫ్రిది, మహ్మద్‌ రిజ్వాన్‌ నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

కాగా షాహిద్‌ ఆఫ్రిదికి షాహిన్‌ ఆఫ్రిది సొంత అల్లుడన్న సంగతి తెలిసిందే. షాహిద్‌ కుమార్తె అన్షాను అతడు వివాహమాడాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌ ప్రస్తుతం ఆసీస్‌ పర్యటనలో ఉంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులు ఓడిన పాకిస్తాన్‌.. జనవరి 3 నుంచి నామమాత్రపు మూడో టెస్టు ఆడనుంది.  

చదవండి: సౌతాఫ్రికా ఒక్కటే కాదు పాక్‌ కూడా అలాగే.. ఐసీసీ, బీసీసీఐ జోక్యం చేసుకోవాలి: స్టీవ్‌ వా
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement