మరోసారి రెచ్చిపోయిన శార్దూల్‌ ఠాకూర్‌ | Ranji Trophy 2024 Final: Mumbai All Out For 224 In First Innings Vs Vidarbha | Sakshi
Sakshi News home page

మరోసారి విధ్వంసం సృష్టించిన శార్దూల్‌ ఠాకూర్‌

Published Sun, Mar 10 2024 4:23 PM | Last Updated on Sun, Mar 10 2024 5:07 PM

Ranji Trophy 2024 Final: Mumbai All Out For 224 In First Innings Vs Vidarbha - Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌, ముంబై ప్లేయర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ రంజీల్లో చెలరేగిపోతున్నాడు. ఇటీవల తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్లో మెరుపు శతకం (104 బంతుల్లో 109) బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శార్దూల్‌.. ప్రస్తుతం విదర్భతో జరుగుతున్న ఫైనల్లో విధ్వంసకర అర్దసెంచరీ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. విదర్భ బౌలర్లు రెచ్చిపోవడంతో 224 పరుగులకే పరిమితమైంది. హర్ష్‌ దూబే (3/62), యశ్‌ ఠాకూర్‌ (3/54), ఉమేశ్‌ యాదవ్‌ (2/43), ఆదిత్య థకారే (1/36) ముంబై పతనాన్ని శాశించారు. ముంబై ఇన్నింగ్స్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్‌ లాల్వాని (37) శుభారంభాన్ని అందించినప్పటికీ.. మిడిలార్డర్‌ వైఫల్యం ఆ జట్టు కొంప ముంచింది.

ముషీర్‌ ఖాన్‌ (6), అజింక్య రహానే (7), శ్రేయస్‌ అయ్యర్‌ (7), హార్దిక్‌ తామోర్‌ (5), షమ్స్‌ ములానీ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. భీకరఫామ్‌లో ఉన్న 10, 11వ ఆటగాళ్లు తనుశ్‌ కోటియన్‌ (8), తుషార్‌ దేశ్‌పాండే (14) ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. బ్యాటింగ్‌లో రాణించిన శార్దూల్‌.. బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్‌ అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విదర్భను శార్దూల్‌ ఆదిలోనే దెబ్బకొట్టాడు. శార్దూల్‌ విదర్భ ఓపెనర్‌, ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ దృవ్‌ షోరేను డకౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. నాలుగు ఓవర్ల అనంతరం​ విదర్భ స్కోర్‌ వికెట్‌ నష్టానికి నాలుగు పరుగులుగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement