ఉస్మాన్‌ ఖాన్‌ ఊచకోత.. 50 బంతుల్లోనే శతకం.. వరుసగా రెండవది | PSL 2024: Usman Khan Shines With Yet Another Blasting Century, Multan Sultan Scores Highest Score Of The Season | Sakshi
Sakshi News home page

ఉస్మాన్‌ ఖాన్‌ ఊచకోత.. 50 బంతుల్లోనే శతకం.. వరుసగా రెండవది

Published Sun, Mar 10 2024 4:56 PM | Last Updated on Sun, Mar 10 2024 6:05 PM

 PSL 2024: Usman Khan Shines With Yet Another Blasting Century, Multan Sultan Scores Highest Score Of The Season - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో మరో భారీ స్కోర్‌ నమోదైంది. ఇస్లామాబాద్‌ యునైటెడ్‌తో ఇవాళ (మార్చి 10) జరుగుతున్న మ్యాచ్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోర్‌. 

ముల్తాన్‌ సుల్తాన్స్‌ భారీ స్కోర్‌ చేయడంలో ఉస్మాన్‌ ఖాన్‌ ప్రధానపాత్ర పోషించాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగిన ఉస్మాన్‌ కేవలం 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ 15 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఉస్మాన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. మార్చి 3న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్‌ 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఉస్మాన్‌ సెంచరీలు చేసిన ఈ రెండు సందర్భాల్లో నాటౌట్‌గా మిగిలాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఉస్మాన్‌తో పాటు జాన్సన్‌ చార్లెస్‌ (18 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), యాసిర్‌ ఖాన్‌ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (17 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్‌), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (12 బంతుల్లో 13; 2 ఫోర్లు), క్రిస్‌ జోర్డన్‌  (7 బంతుల్లో 15 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) రాణించారు. ఇస్లామాబాద్‌ బౌలర్లలో ఫహీమ్‌ అష్రాఫ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, హునైన్‌ షా తలో వికెట్‌ దక్కించుకున్నారు.

భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్‌.. తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డేవిడ్‌ విల్లే భారీ హిట్టర్‌ అలెక్స్‌ హేల్స్‌ను డకౌట్‌ చేయగా.. అఘా సల్మాన్‌ను మొహమ్మద్‌ అలీ (2) పెవిలియన్‌కు పంపాడు. 4 ఓవర్ల తర్వాత ఇస్లామాబాద్‌ స్కోర్‌ 38/2గా ఉంది. షాదాబ్‌ ఖాన్‌ (8 బంతుల్లో 13; 2 ఫోర్లు), కొలిన్‌ మున్రో (10 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్‌) క్రీజ్‌లో ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement