MI Vs CSK: Rohit Should Change His Name to No Hit Sharma Says, Kris Srikkanth - Sakshi
Sakshi News home page

Kris Srikkanth: రోహిత్‌ శర్మ కాదు 'నో హిట్‌ శర్మ' అని పేరు మార్చుకో.. నేనైతే నిన్ను జట్టులోకి కూడా తీసుకోను..!

Published Sun, May 7 2023 10:07 AM | Last Updated on Sun, May 7 2023 11:20 AM

MI VS CSK: Rohit Should Change His Name To No Hit Sharma Says Kris Srikkanth - Sakshi

ముంబై ఇండియన్స్‌ స్కిప్పర్‌ రోహిత్‌ శర్మపై భారత మాజీ ఓపెనర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీఎస్‌కేతో నిన్నటి మ్యాచ్‌లో (మే 6) రోహిత్‌ శర్మ డకౌట్‌ అయిన వెంటనే కామెంట్రీ బాక్స్‌లో ఉన్న శ్రీకాంత్‌ స్పందిస్తూ.. రోహిత్‌ శర్మ తన పేరును 'నో హిట్‌ శర్మ'గా మార్చుకోవాలని సూచించాడు. రోహిత్‌ శర్మను అందరూ హిట్‌మ్యాన్‌ అని పిలుచుకునే నేపథ్యంలో శ్రీకాంత్‌ ఈ కామెంట​్‌ చేశాడు. ఇంతటితో ఆగని శ్రీకాంత్‌.. నేనైతే రోహిత్‌ శర్మను జట్టులోకి కూడా తీసుకోనని హిట్‌మ్యాన్‌ను అవమానించేలా వ్యాఖ్యానించాడు. శ్రీకాంత్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై హిట్‌మ్యాన్‌ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

తమ ఆరాధ్య క్రికెటర్‌ను అవమానించే అర్హత నీకు లేదంటూ ఘాటుగా బదులిస్తున్నారు. హిట్‌మ్యాన్‌ అభిమానులు శ్రీకాంత్‌పై దుమ్మెత్తిపోస్తున్న కామెంట్లతో ప్రస్తుతం సోషల్‌మీడియా హోరెత్తిపోతుంది. వాస్తవానికి ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రోహిత్‌ శర్మ చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతనాడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 184 పరుగులు మాత్రమే చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో డకౌట్‌ కావడంతో రోహిత్‌ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్‌గా (16) రికార్డుల్లోకెక్కాడు. రోహిత్‌ తర్వాత అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో సునీల్‌ నరైన్‌ (15), మన్‌దీప్‌ సింగ్‌ (15), దినేశ్‌ కార్తీక్‌ (15) వరుస స్థానాల్లో ఉన్నారు.

అంతకుముందు ముందు పంజాబ్‌తో మ్యాచ్‌లో కూడా ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన రోహిత్‌.. మరో చెత్త రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన కెప్టెన్‌గా (11) అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్‌.. గౌతమ్‌ గంభీర్‌తో సమానంగా 10 సందర్భాల్లో డకౌటైన కెప్టెన్‌గా ఉన్నాడు. 

ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. సీఎస్‌కే బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. మతీష పతిరణ 3 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా.. దీపక్‌ చాహర్‌, తుషార్‌ తలో 2 వికెట్లు, జడేజా ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం రుతురాజ్‌ (30), కాన్వే (44), రహానే (21), దూబే (26 నాటౌట్‌) రాణించడంతో సీఎస్‌కే సునాయాస విజయం సాధించింది. ముంబై బౌలర్లలో పియూష్‌ చావ్లా 2, ట్రిస్టన్‌ స్టబ్స్‌, ఆకాశ్‌ మధ్వాల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement