Tokyo Olympics: ఏడు పతకాల కథ Meet India Medal Winners At Tokyo 2020 | Sakshi
Sakshi News home page

Tokyo Olympics: ఏడు పతకాల కథ

Published Mon, Aug 9 2021 4:04 AM | Last Updated on Mon, Aug 9 2021 4:29 AM

Meet India Medal Winners At Tokyo 2020 - Sakshi

ఎవరేమనుకున్నా... మధ్యలో మహమ్మారి దూరినా... కేంద్ర క్రీడా శాఖ ముందు నుంచీ ఒకే మాట చెప్పింది. ఈసారి మనం 2012 లండన్‌ గేమ్స్‌ ఆరు పతకాల సంఖ్యను దాటేస్తాం... డబుల్‌ డిజిట్‌ (పది పతకాలైనా) కూడా సాధిస్తాం! మాజీ క్రీడల మంత్రి, ప్రస్తుత న్యాయశాఖా మంత్రి కిరణ్‌ రిజిజు ఎక్కడికెళ్లినా ఇదేమాట అన్నారు. ఆయన అన్నట్లే ‘టోక్యో డ్రీమ్స్‌’ సగం నెరవేరాయి. ఏడు పతకాలతో భారత్‌ ‘లండన్‌’ను దాటేసింది. పతకాల పరంగా పట్టికలో 48వ స్థానంలో నిలిచింది.

షూటర్ల గురి కుదిరి ఉంటే... బాక్సర్ల ‘పంచ్‌’ కూడా అదిరిపోయుంటే... గోల్ఫ్‌లో కాస్త అదృష్టం కలిసొచ్చి ఉంటే... రెజ్లింగ్‌లో దీపక్‌ పూనియా, వినేశ్‌ తడబడకపోతే... ఆర్చరీలో బాణం మెరిసుంటే... ఆయన అన్నట్లే పతకాల ‘సంఖ్య’ రెండంకెలు కచ్చితంగా దాటేది. నాలుగు దశాబ్దాల తర్వాత భారత హాకీ అదిరిపోయిందనుకుంటే...  అంతకుమించిపోయే అబ్బుర ఫలితం అథ్లెటిక్స్‌లో వచ్చింది. మొత్తానికి టోక్యో ఒలింపిక్స్‌ భారత్‌కు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ స్ఫూర్తితో 2024 పారిస్‌లో మనం మరింత పైకి ఎదగాలని... స్వర్ణ కాంతులు మరిన్ని విరజిమ్మాలని కోరుకుందాం.   

‘రియో’ గాయాన్ని ‘టోక్యో’ మాపింది. ఏడు పతకాలతో క్రీడాభారతిని ఆనందడోలికల్లో ముంచేసింది. పతకాలు సాధించిన వారు ముమ్మాటికి విజేయులే! అలాగే పతకాల్ని త్రుటిలో కోల్పోయిన పోరాట యోధులు కూడా ఇక్కడ విజేతలే! ఎందుకంటే ఇక్కడ ఫలితమే తేడా. కానీ పోరాటంలో విజేతకి పరాజితకి తేడా లేదంటే అతిశయోక్తి కాదు. మహిళల హాకీ జట్టు కాంస్యానికి దూరమైనా ప్రదర్శనతో మన గుండెల్లో నిలిచింది. రెజ్లర్‌ దీపక్‌ పూనియా, గోల్ఫర్‌ అదితి పతకాలకు చేరువై చివరకు దూరమయ్యారు. మొత్తానికి టోక్యోలో మన క్రీడాకారుల శ్రమకు మంచి ఫలితాలే వచ్చాయి. 

మీరా రజత ధీర...
ఈ ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను శుభారంభమే నీరజ్‌ బంగారానికి నాంది అయ్యిందేమో! ఆరంభ వేడుకలు ముగిసి పోటీలు మొదలైన తొలి రోజే ఆమె రజతంతో బోణీ కొట్టింది. ‘లండన్‌’ దాటేందుకు ఈ వెయిట్‌లిఫ్టరే జేగంట మోగించింది. 26 ఏళ్ల చాను పోయిన చోటే వెతుక్కోవాలనుకుంది. ‘రియో’ ఒలింపిక్స్‌ చేదు అనుభవాన్ని టోక్యో ఒలింపిక్స్‌ రజతంతో చెరిపేసింది. 49 కేజీల కేటగిరీలో తలపడిన మణిపూర్‌ మహిళామణి 202 కేజీల (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది.

సింధు పతకాల విందు... 
‘రియో’లో భారత ఆశల పల్లకిని ఫైనల్‌దాకా మోసిన ఏకైక క్రీడాకారిణి పీవీ సింధు. బ్యాడ్మింటన్‌లో రన్నరప్‌ అయిన సింధు పతకం రంగుమార్చాలని, స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగింది. తనకెదురైన జపాన్‌ స్టార్‌ అకానె యామగుచిని క్వార్టర్స్‌లో మట్టికరిపించిన తెలుగు తేజం దురదృష్టవశాత్తు సెమీస్‌లో తడబడింది. వరల్డ్‌ నంబర్‌వన్‌ తై జు యింగ్‌కు తలవంచిన 26 ఏళ్ల సింధు కాంస్య పతక పోరులో మాత్రం పట్టువీడని పోరాటం చేసింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకాలు (రజతం, కాంస్యం) గెలిచిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కింది.

నీరజ్‌ ‘మిషన్‌ పాజిబుల్‌’... 
భారత్‌ ‘టోక్యో డ్రీమ్స్‌’లో అథ్లెటిక్స్‌ పతకం ఉంది. కానీ పసిడి మాత్రం లేదు. నీరజ్‌ చోప్రా ఆ టోక్యో డ్రీమ్స్‌ ఊహకే అందని విధంగా జావెలిన్‌ విసిరేశాడు. 23 ఏళ్ల ఈ ఆర్మీ నాయక్‌ సుబేదార్‌ విశ్వక్రీడల్లో (అథ్లెటిక్స్‌) బంగారు కల ఇక కల కాదని తన ‘మిషన్‌ పాజిబుల్‌’తో సాకారం చేశాడు. ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి ఈ ఒలింపిక్స్‌ పతకాల పట్టికను స్వర్ణంతో భర్తీ చేశాడు. హరియాణా రైతు బిడ్డ ఇప్పుడు భరతమాత ముద్దుబిడ్డ అయ్యాడు.

రెజ్లింగ్‌లో హరియాణా బాహుబలి రవి దహియా. తన శారీరక సామర్థ్యానికి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించిన రవి మల్లయుద్ధంలో మహాబలుడు. ఛత్రశాల్‌ స్టేడియం చెక్కిన మరో చాంపియన్‌ రెజ్లర్‌. పసిడి వేటలో కాకలు తిరిగిన సింహబలుడితో చివరకు పోరాడి ఓడాడు. 57 కేజీల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌లో  రజతం సాధించి భారత వెండికొండగా మారాడు.

పురుషుల హాకీ కంచు... 
మన తాత, తండ్రులకు తెలిసిన ఒలింపిక్స్‌ హకీ ఘన చరిత్రను మనకూ తెలియజేసిన ఘనత కచ్చితంగా మన్‌ప్రీత్‌సింగ్‌ సేనదే. విశ్వక్రీడల్లో నాలుగు దశాబ్దాల నిరాశకు టోక్యోలో చుక్కెదురైంది. పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణకు కాంస్యంతో తెరపడింది. సెమీస్‌లో బెల్జియం చేతిలో పరాజయం ఎదురైనా... పతకం ఆశ మిగిలుండటంతో ప్లేఆఫ్‌లో జర్మనీపై సర్వశక్తులు ఒడ్డి గెలిచిన తీరు అసాధారణం. మన్‌ప్రీత్‌ జట్టును నడిపిస్తే... గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ అడ్డుగోడ, స్ట్రయికర్‌ సిమ్రన్‌జీత్‌ సింగ్‌ ప్రదర్శన పోడియంలో నిలబెట్టాయి.

లవ్లీనా పంచ్‌... 
పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన బాక్సర్‌ లవ్లీనా బొర్గొహైన్‌. భారత తురుపుముక్క, దిగ్గజం మేరీకోమ్‌ తదితర మేటి బాక్సర్లు ఓడిన చోట కాంస్యంతో నిలిచిన ఘనత లవ్లీనాది. ఒలింపిక్స్‌కు ఆఖరి కసరత్తుగా యూరోప్‌ వెళ్లేందుకు సిద్ధమైన 23 ఏళ్ల లవ్లీనాను కోవిడ్‌ అడ్డుకుంది. కానీ ఆమె టోక్యోలో పతకం గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేకపోయింది. అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా ఒలింపిక్స్‌లో విజేందర్, మేరీకోమ్‌ల తర్వాత పతకం నెగ్గిన మూడో భారత బాక్సర్‌గా నిలిచింది.

బజరంగ్‌ పట్టు... 
ఫేవరెట్‌గా టోక్యోకు వెళ్లిన గోల్డెన్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా కాంస్యంతో మురిపించాడు. గంపెడాశలు పెట్టుకున్న షూటర్లతో పోల్చితే బజరంగ్‌ ముమ్మాటికి నయం. బాల్యం నుంచే కుస్తీ పట్లు పట్టిన ఈ హరియాణా రెజ్లర్‌ టోక్యో వేదికపై కంచు పట్టు పట్టాడు. ఇతన్నీ ఛత్రశాల్‌ స్టేడియమే చాంపియన్‌ రెజ్లర్‌గా తీర్చిదిద్దింది. అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పతకాలు నెగ్గిన ఇతని ఖాతాలో తాజాగా ఒలింపిక్‌ పతకం కూడా భర్తీ అయ్యింది.

టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను ఆదివారం తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది. ‘ఎన్నో రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒలింపిక్స్‌లో సాధించిన పతకంతో ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారింది’ అని మీరాబాయి ట్వీట్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement